ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వద్దొద్దంటున్నా.. మళ్లీ ఆర్‌ఎంసీ!

ABN, Publish Date - Nov 08 , 2024 | 03:11 AM

వరదల సమయంలో తరలించే నీటిని వినియోగం కింద లెక్కించొద్దనే ప్రధాన ఎజెండాపై చర్చించడానికి వీలుగా రిజర్వాయర్‌ నిర్వహణ కమిటీ (ఆర్‌ఎంసీ)ని పునరుద్ధరిస్తూ కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) సంచలన నిర్ణయం తీసుకుంది.

  • ‘జలాశయ కమిటీ’ పునరుద్ధరణ

  • వరద మళ్లింపును వినియోగం కింద చూడొద్దనేదే అజెండా

  • కృష్ణా బోర్డు అత్యుత్సాహం

  • తెలంగాణ విజ్ఞప్తులు బేఖాతరు

హైదరాబాద్‌, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): వరదల సమయంలో తరలించే నీటిని వినియోగం కింద లెక్కించొద్దనే ప్రధాన ఎజెండాపై చర్చించడానికి వీలుగా రిజర్వాయర్‌ నిర్వహణ కమిటీ (ఆర్‌ఎంసీ)ని పునరుద్ధరిస్తూ కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) సంచలన నిర్ణయం తీసుకుంది. వరదల సమయంలో తరలించే ప్రతీ నీటిచుక్కను వినియోగం కిందే పరిగణించాలని పదేళ్లుగా తెలంగాణ చేస్తున్న విజ్ఞప్తికి పూర్తి విరుద్ధంగా.. ఈ అంశంపై చర్చకు బోర్డు నిర్ణయం తీసుకోవటం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో, గత ఆర్‌ఎంసీ తాలూకు అంశాలు ముందుకొస్తున్నాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ రిజర్వాయర్లలో రూల్‌కర్వ్‌ను (ఏ సమయంలో ఎంత మేర నీటి నిల్వలు ఉండాలి అన్నదానిని) ఖరారు చేయడం, ఆయా ప్రాజెక్టుల్లో జలవిద్యుత్‌ ఉత్పాదన, మిగులు జలాలను ఏ విధంగా పరిగణనలోకి తీసుకోవాలనే అంశాలపై 2022 మే నెలలో ఆర్‌ఎంసీని ఏర్పాటు చేశారు. ఏడు నెలల పాటు పలు సమావేశాలు జరిగాయి. ముసాయిదా నివేదికను రూపొందిస్తున్న సమయంలో.. తెలంగాణ తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేసింది. దీంతో ఆర్‌ఎంసీ ఏర్పాటు లక్ష్యం విఫలమయిందని పేర్కొంటూ అప్పటి ఆర్‌ఎంసీ కన్వీనర్‌ రవికుమార్‌ పిళ్లై కృష్ణా బోర్డుకు నివేదిక ఇచ్చారు. తర్వాత.. మళ్లీ ఆర్‌ఎంసీని ఏర్పాటు చేయాలంటే తెలుగు రాష్ట్రాల ఏకాభిప్రాయం అవసరం. కానీ, తెలంగాణతో మాటవరసకైనా సంప్రదింపులు జరపకుండానే ఆర్‌ఎంసీని కృష్ణా బోర్డు తాజాగా పునరుద్ధరించటం వివాదంగా మారింది. అంతేకాకుండా, శుక్రవారం (ఈనెల 8వ తేదీన) ఆర్‌ఎంసీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం. ఏపీ విజ్ఞప్తితో ఈ సమావేశం వాయిదా పడినప్పటికీ కృష్ణాబోర్డు నిర్ణయం వివాదాస్పదంగా మారింది.


ఆర్‌ఎంసీ ఎజెండాలో చేర్చిన మూడు అంశాలూ తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసేవేనని రాష్ట్ర అధికారులు మండిపడుతున్నారు. మూడు అంశాల్లో ముఖ్యమైనది.. వరదల సమయంలో జూరాల నుంచి ప్రకాశం బ్యారేజీ దాకా అన్ని రిజర్వాయర్లు నిండిన తర్వాత, ఆ నీటిని ఇరు రాష్ట్రాలు కిందికి తరలిస్తే, వాటిని వినియోగం కింద లెక్కించరాదు అనే అంశం. రెండోది.. శ్రీశైలం, సాగర్‌లలో జలవిద్యుత్‌ కేంద్రాల నిర్వహణ. మూడవది.. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లపై కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) సిద్ధం చేసిన రూల్‌కర్వ్‌కు తుదిరూపు ఇవ్వడం. ఒకవైపు కృష్ణా జలాల పంపిణీపై ట్రైబ్యునల్‌ విచారణ ఢిల్లీలో జరుగుతుండగా.. ఆర్‌ఎంసీ సమావేశం ఉండనుందని బోర్డు చెప్పటం గమనార్హం. వాస్తవానికి నీటి వాటాలపై ట్రైబ్యునల్‌ తీర్పు అనంతరం నిర్ణయాలు తీసుకోవాల్సి ఉండగా... విచారణ జరుగుతున్న సమయంలోనే సమావేశం ఏర్పాటు చేయటం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

  • ఎజెండా అంతా తెలంగాణకు వ్యతిరేకమే!

ఆర్‌ఎంసీలో చర్చించే ఎజెండా అంతా కూడా తెలంగాణకు వ్యతిరేకంగా ఉందని అధికారులు మండిపడుతున్నారు. ఏపీలో ఇటీవలి వరదల సమయంలో పోతిరెడ్డిపాడు నుంచి పెన్నా బేసిన్‌కు దాదాపు 210 టీఎంసీలకు పైగా జలాలు తరలించారని లెక్కలు చెబుతున్నాయి. తెలంగాణలో మాత్రం ఈ విధంగా నీటి తరలింపునకు వీలుగా కృష్ణా నదిపై సరిపడా రిజర్వాయర్లు లేవు. దీనివల్లే వరదల సమయంలో ప్రతీ నీటిచుక్కను లెక్కించి, ఆయా రాష్ట్రాల వినియోగం ఖాతాలో వేయాలనేది తెలంగాణ వాదన. రాష్ట్రంలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో రిజర్వాయర్లు సిద్ధంగా ఉన్నా... పంప్‌హౌ్‌సలు, ప్రధాన కాలువల పనులే జరుగలేదు. ఇక కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో చెరువులే తప్ప రిజర్వాయర్లు లేవు. సాగర్‌ పరిధిలోనూ ఇదే పరిస్థితి. పట్టుమని 50 టీఎంసీలను కూడా ఒడిసిపట్టుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు.. వరదల సమయంలో వినియోగాన్ని లెక్కించరాదని ఎజెండాలో పెడతారని అధికారులు అడుగుతున్నారు.


  • కన్వీనర్‌ వైఖరికి నిరసనగా లేఖ

2022 మేలో ఏర్పాటైన ఆర్‌ఎంసీ ఆరు సమావేశాలు నిర్వహించగా.. మూడు సమావేశాలకు తెలంగాణ హాజరుకాగా... ఏపీ ఐదుసార్లు హాజరైంది. ఈ సమావేశాల్లో శ్రీశైలం రూల్‌కర్వ్‌పై ఏకాభిప్రాయం కుదిరినట్లే కుదిరి... మొత్తం వ్యవహారం అడ్డం తిరిగింది. ఆర్‌ఎంసీ కన్వీనర్‌ వైఖరిపై నిరసన వ్యక్తం చేస్తూ ఆర్‌ఎంసీ ముసాయిదాను అమలు కాకుండా నిలుపుదల చేయాలని కోరుతూ తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ రజత్‌కుమార్‌ 2022 డిసెంబరులో లేఖ రాశారు. లేఖ రాసిన మరుసటి రోజే కేఆర్‌ఎంబీ సభ్యుడు, ఆర్‌ఎంసీ మెంబర్‌ కన్వీనర్‌ రవికుమార్‌ పిళ్లై ఢిల్లీకి బదిలీ అయ్యారు. ఆర్‌ఎంసీ నిర్ణయాలను అమలులోకి తీసుకురావాలని పిళ్లై చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. పలు సందర్భాల్లో ఆయన నేరుగా తెలుగు రాష్ట్రాల అధికారులను కలిసి ఆర్‌ఎంసీకి సహకరించాలని విజ్ఙప్తి చేశారు. 2022 డిసెంబరు 3వ తేదీన శ్రీశైలం నిర్వహణపై ఏకాభిప్రాయం కుదిరిందని తెలుగు రాష్ట్రాల ఈఎన్‌సీలు, ఆర్‌ఎంసీ కన్వీనర్‌ కూడా ప్రకటించారు. కానీ, ఆ తర్వాత రెండు రోజులకే వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఏపీ ఆర్‌ఎంసీ ముసాయిదాపై సంతకాలు చేసింది. తెలంగాణ సంతకాలు చేసేందుకు నిరాకరించింది. ఇప్పుడు మళ్లీ ఆర్‌ఎంసీని పునరుద్ధరించడంతో వాతావరణం వేడెక్కే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Updated Date - Nov 08 , 2024 | 03:11 AM