KTR: కుటుంబ ఫంక్షన్‌ను రేవ్ పార్టీగా చిత్రీకరించే కుట్ర
ABN, Publish Date - Oct 28 , 2024 | 03:45 AM
బంధువులు, కుటుంబ సభ్యులతో జరుపుకున్న ఫంక్షన్‌ను రాజకీయ కక్షతో రేవ్ పార్టీగా చిత్రీకరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
డ్రగ్స్ దొరకకుండానే కేసులా: కేటీఆర్
ఫాంహౌస్ ఘటన పక్కా స్కెచ్: హరీశ్‌రావు
కుటుంబ ఫంక్షన్లు చేసుకునే స్వేచ్ఛ కూడా లేదా?
రేవ్ పార్టీ జరిగినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారు
రేవంత్ అవినీతి ఎత్తిచూపినందుకే అక్రమ కేసులు
రేవంత్ రెడ్డి కుట్రపూరిత చర్యకు పాల్పడ్డారు
జైళ్లకు పంపినా.. ప్రజల కోసం పోరాటం ఆపం
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): బంధువులు, కుటుంబ సభ్యులతో జరుపుకున్న ఫంక్షన్‌ను రాజకీయ కక్షతో రేవ్ పార్టీగా చిత్రీకరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఆదివారం నందినగర్‌లోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, రేవంత్‌రెడ్డి చేస్తున్న అక్రమాలు, అవినీతిని ఎత్తి చూపుతున్నందుకే బీఆర్‌ఎస్ నేతలపై అక్రమ కేసులు పెట్టి భయపెడుతున్నారని చెప్పారు. తన బావమరిది రాజ్‌పాకాల జన్వాడలో సొంత ఇల్లుకట్టుకొని అక్కడికి నివాసం మార్చిన సందర్భంగా జరిగిన ఫంక్షన్‌పై రేవంత్‌రెడ్డి కుట్రపూరిత చర్యకు పాల్పడ్డారన్నారు. ఒక కుటుంబం తమ బంధువులతో దావత్ చేసుకోవడానికి కూడా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలా? కుటుంబ ఫంక్షన్‌లు చేసుకునేందుకు కూడా ఈ రాష్ట్రంలో స్వేచ్ఛ లేదా? అని కేటీఆర్ ప్రశ్నించారు.
జన్వాడలో ఫంక్షన్ జరిగిన ప్రదేశం ఫామ్ హౌస్ కాదని తన బావమరిది రాజ్‌పాకాల ఇల్లు అని ఆయన వెల్లడించారు. శనివారం రాత్రి 11గంటల నుంచి అక్కడ రేవ్‌పార్టీ జరిగినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని, అసలు రేవ్ పార్టీ అర్థం తెలుసా? అని ఆయన ప్రశ్నించారు. ఆ ఫంక్షన్‌లో 70 ఏళ్ల తన అత్తమ్మ, రెండేళ్లు, నాలుగేళ్లు, ఏడేళ్ల పిల్లలు, భార్యభర్తలు, కుటుంబ సభ్యులు ఉన్నారని, పురుషులు, మహిళలు అంటూ వేరు చేసి దాన్ని మరోరకంగా చిత్రించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్, సీఐ.. స్నిఫర్ డాగ్స్‌తో సహా అక్కడికి వెళ్లామని, తనిఖీల్లో ఎటువంటి డ్రగ్స్ లభించలేదని చెప్పారని కేటీఆర్ గుర్తు చేశారు. అక్కడ మూత్ర పరీక్షలు చేశారని, తన బావమరిదితో సహా.. 14 మందికి టెస్ట్ చేస్తే ఒకరికి పాజిటివ్ వచ్చిందన్నారు.
ఆ వ్యక్తి ఎక్కడ డ్రగ్స్ తీసుకున్నారో తేల్చాల్సింది సంబంధిత విభాగాలేనన్నారు. డ్రగ్స్ కూడా లభించని ప్రదేశంలో.. 4 విదేశీ మద్యం బాటిళ్లు ఉండాల్సిన చోట 8 బాటిళ్లు ఎక్కువగా ఉన్నాయని కేసు పెట్టామన్నారని కేటీఆర్ చెప్పారు. సాయంత్రానికే మొత్తం మారిపోయిందంటున్నారని, డ్రగ్స్‌కు సంబంధించి 25, 27, 29 సెక్షన్ల కింద కేసులు పెట్టినట్లు తెలుస్తోందన్నారు. అక్కడ డ్రగ్స్ దొరకకుండానే ఈ కేసులు ఎలా పెడతారని కేటీఆర్ ప్రశ్నించారు. ఆ ఫంక్షన్ నుంచి 5 నిమిషాల ముందే తాను అక్కడి నుంచి వెళ్లినట్లు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని, తాను అక్కడే ఉన్నానని కొన్ని ప్రసార మాధ్యమాల్లో అసత్య ప్రచారం జరుగుతోందని, తన భార్యపై, కుటుంబ సభ్యులపై ఇష్టం వచ్చినట్లు ప్రసారం చేయడం ఏమాత్రం తగదన్నారు.
శనివారం సాయంత్రం 7గంటలకు తాను మాజీ సీఎం కేసీఆర్ దగ్గర ఎర్రవెల్లిలో ఉన్నానని, ఆ తర్వాత హైదరాబాద్‌కు చేరుకొని తన ఇంట్లో కుమార్తెతో కొద్దిసేపు మాట్లాడి.. ఆ తర్వాత ఇంట్లోనే పడుకొని పోయానని.. ఆ ఫంక్షన్‌కు వెళ్లలేకపోయానని కేటీఆర్ వివరణ ఇచ్చారు. పొలిటికల్ బాంబులు పేలుతాయని కాంగ్రెస్ నాయకులు అంటే ఏదో అనుకున్నానని, ఇలా కుట్రపూరితమైన చర్యలకు పాల్పడతారని అనుకోలేదని కేటీఆర్ చెప్పారు. బీఆర్‌ఎస్ పార్టీని, తనను ఎదుర్కొలేక చివరకు తన బంధువులు, కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడుతున్నారని ఇది వారి చేతగానితనానికి నిదర్శనమన్నారు. తమను జైల్లో పెట్టినా ప్రజల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరంతరం పోరాటం చేస్తామని కేటీఆర్ హెచ్చరించారు.
Updated Date - Oct 28 , 2024 | 03:45 AM