KTR: మూసీ పేరిట లక్ష కోట్ల దోపిడీకి యత్నం
ABN, Publish Date - Oct 10 , 2024 | 04:42 AM
‘‘మూసీ ప్రక్షాళన పేరిట లక్ష కోట్లు దోపిడీ చేసేందుకు కాంగ్రెస్ సర్కారు చూస్తోంది. రాహుల్ గాంధీతోపాటు వాళ్ల బావకు కోట్ల రూపాయలు దోచిపెట్టాలని ప్రయత్నిస్తోంది’’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
రాహుల్, వాళ్ల బావకు దోచిపెట్టే ప్రయత్నం
నియామకాలపైనా నీతిమాలిన ప్రచారం: కేటీఆర్
హైదరాబాద్, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): ‘‘మూసీ ప్రక్షాళన పేరిట లక్ష కోట్లు దోపిడీ చేసేందుకు కాంగ్రెస్ సర్కారు చూస్తోంది. రాహుల్ గాంధీతోపాటు వాళ్ల బావకు కోట్ల రూపాయలు దోచిపెట్టాలని ప్రయత్నిస్తోంది’’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి బుల్డోజర్ పాలన తీసుకొచ్చారని దుయ్యబట్టారు. వరంగల్‌లో ఓ ఎమ్మార్వో బతుకమ్మ ఘాట్ చూసేందుకు వెళ్తే ఇళ్లు కూలగొట్టేందుకు వచ్చారనుకొని ప్రజలు తరమి కొట్టారంటే.. ఎంత భయాందోళన చెందుతున్నారో అర్థమవుతుందన్నారు.
తెలంగాణలో దసరా పండుగను ఘనంగా జరుపుకొనే వీల్లేకుండా భయానక వాతావరణం సృష్టించారని విమర్శించారు. కాంగ్రెస్ పది నెలల పాలనలో అన్నీ వైఫల్యాలేనని, రాష్ట్రంలోని అన్ని వర్గాలు అసంతృప్తితోనే ఉన్నాయన్నారు. శేరిలింగంపల్లి కాంగ్రెస్ నేత మహ్మద్ అల్లావుద్దీన్‌తోపాటు పలువురు నాయకులు బుధవారం బీఆర్‌ఎ్‌సలో చేరగా.. కేటీఆర్ గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ సమస్య అయినా కలెక్టర్లకు చెప్పాలనడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. హరియాణా ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజలు బుద్ధి చెప్పారని, ఆ ఫలితాలు చూసైనా రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి హామీల అమలుకు కృషి చేయాలని సూచించారు.
కొడంగల్‌లో రైతుల పక్షాన పోరాడిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. భూ సేకరణలో ప్రజల భయాలు, అనుమానాలను నివృత్తి చేసి వాళ్లను ఒప్పించాల్సింది పోయి.. పోలీసులను అడ్డు పెట్టుకొని అరాచకం సృష్టించడమేంటని నిలదీశారు. కాగా, ఉద్యోగ నియామకాలపై కాంగ్రెస్ ప్రభుత్వం నీతిమాలిన ప్రచారం చేసుకొంటోందని ‘ఎక్స్’ వేదికగా కేటీఆర్ ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం ప్రారంభించిన ప్రక్రియను వారి ఖాతాలో వేసుకోవడానికి కొంచెమైనా సిగ్గుండాలని వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డిని చూేస్త గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోందని విమర్శించారు. అశోక్‌నగర్ చౌరస్తా, ఉస్మానియా క్యాంప్‌సకు వెళ్లి కొలువుల పండుగ కథలు చెబుతావా? అని ప్రశ్నించారు. కాగా, జ్యోతిబాపూలే విదేశీ విద్య పథకానికి కాంగ్రెస్ తూట్లు పొడుస్తోందని కేటీఆర్ ఆరోపించారు.
Updated Date - Oct 10 , 2024 | 04:42 AM