KTR : రేవంత్ చెప్పేవి పచ్చి అబద్ధాలు!
ABN, Publish Date - Oct 22 , 2024 | 04:21 AM
ప్రజలను మభ్యపెడుతూ సీఎం రేవంత్‌రెడ్డి పాలన సాగిస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
60వేల ఉద్యోగాలు ఎవరికిచ్చారు?
రేవంత్, సంజయ్... రహస్య స్నేహితులు: కేటీఆర్
హైదరాబాద్, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి) : ప్రజలను మభ్యపెడుతూ సీఎం రేవంత్‌రెడ్డి పాలన సాగిస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 60వేల ఉద్యోగాలు ఇచ్చిందంటూ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. 60వేలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఎప్పుడిచ్చారు? పరీక్షలు ఎప్పుడు పెట్టారో చెప్పాలి? అని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్‌లో సోమవారం మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తాము ఇచ్చిన నోటిఫికేషన్లకు నియామక పత్రాలు జారీ చేస్తూ... బీఆర్‌ఎస్ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని సిగ్గు లేకుండా చెబుతున్నారన్నారు.
కేసీఆర్ హయాంలో 1.60లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చింది వాస్తవం కాదా? వాళ్లకు ప్రభుత్వం జీతాలు ఇస్తున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. జీవో 29 వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, రిజర్వేషన్లకు విఘాతం కలుగుతుందన్నారు. ఈ విషయంలో హైకోర్టు నిర్ణయం తీసుకునే వరకు గ్రూప్-1 ఫలితాలు వెల్లడించొద్దన్న సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. జీవో29కు వ్యతిరేకంగా హైకోర్టులో అభ్యర్థుల తరఫున కొట్లాడతామన్నారు. మూసీ విషయంలో బీఆర్‌ఎస్ కంటే ఎక్కువ ప్రశ్నించాల్సింది జర్నలిస్టులేనని, లక్షన్నర కోట్లు మూసీలో పోద్దామంటే చూస్తూ ఊరుకుందామా? అని ప్రశ్నించారు. జర్నలిస్టులపై బీఆర్‌ఎ్‌సకు ఎనలేని గౌరవం ఉందని, ఎన్నడూ తాను ఎవరినీ అవమానించలేదన్నారు. విద్యుత్ చార్జీల విషయంలో ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయంతో ప్రజలపై పెను భారం పడే అవకాశం ఉందని అన్నారు.
విద్యుత్ చార్జీలు పెంచాలంటూ డిస్కమ్‌లు చేసిన 9 ప్రతిపాదనలను అంగీకరించొద్దని ఈఆర్‌సీ చైర్మన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు. ఈనెల 23న జరిగే బహిరంగ విచారణలో పాల్గొని అభిప్రాయాలు చెప్పాలని ఈఆర్‌సీ చైర్మన్ తమకు సూచించారన్నారు. రేవంత్‌రెడ్డి కుర్చీ పోతుంటే.. కేంద్ర మంత్రి బండి సంజయ్ బాధపడుతున్నారని, వారిద్దరూ రహస్య స్నేహితులని ఆరోపించారు. ముత్యాలమ్మ గుడి సంఘటనను తాను ఖండిస్తే శాంతిభద్రతల సమస్య అంటూ సైబర్ క్రైమ్ వాళ్లు తనపై ట్విట్టర్ కు ఫిర్యాదు చేశారని వెల్లడించారు. ముఖ్యమంత్రికి చేతనైతే శాంతి భద్రతలను కాపాడాలని, సోషల్ మీడియాను ఏదో చేయాలని ప్రయత్నించటం అరాచకమని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక తిరోగమన పరిస్థితిపై సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. విధ్వంసకర విధానాలతో జీఎస్టీ వసూళ్లలో రాష్ట్రం ఆఖరి స్థానంలో నిలిచి అనూహ్యమైన ఘనతను సాధించిందని సోమవారం ఎక్స్ వేదికగా ఆయన విమర్శించారు.
Updated Date - Oct 22 , 2024 | 04:21 AM