KTR: మహిళలపై ఇబ్బందికర వ్యాఖ్యలు.. విచారం వ్యక్తం చేసిన కేటీఆర్
ABN, Publish Date - Aug 16 , 2024 | 08:41 AM
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక ట్వీట్ చేశారు. మహిళలపై తాను చేసిన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక ట్వీట్ చేశారు. మహిళలపై తాను చేసిన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేశారు. ‘బస్సుల్లో కుట్లు అల్లికలే కాదు, అవసరమైతే బ్రేక్ డ్యాన్సులు చేసుకున్న మాకు అభ్యంతరం లేదు’ అని తాను అన్న వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న వేళ ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘నిన్న పార్టీ సమావేశంలో యాదాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మా మహిళా సోదరీమణులకు మనస్థాపం కలిగితే విచారం వ్యక్తం చేస్తున్నాను. నా అక్కా చెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదు’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
కాగా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణాలకు సంబంధించి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దుర్వినియోగం జరుగుతోందంటూ ట్రోల్స్ జరుగుతున్నాయి. దీనిపై మంత్రి సీతక్క స్పందిస్తూ.. బస్సుల్లో మహిళలు అల్లం వెల్లుల్లి పొట్టు ఒలుచుకుంటే తప్పేంటని, కూట్లు అల్లికలు చేసుకుంటే తప్పేముందని ప్రశ్నించారు. అయితే ఈ వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్.. బస్సుల్లో కుట్లు అల్లికలే కాదు.. అవసరమైతే బ్రేక్ డ్యాన్సులు చేసుకున్న తమకు అభ్యంతరం లేదని అన్నారు. మాజీ మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు చిన్నపాటి దుమారాన్నే రేపాయి. మహిళా వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అధికార కాంగ్రెస్ నేతలు సైతం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మహిళలను అవమానించారంటూ మండిపడ్డారు.
సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్..
కేటీఆర్ వ్యాఖ్యలకు సంబంధించి కీలక పరిణామం జరిగింది. కేటీఆర్ వ్యాఖ్యలను తెలంగాణ మహిళా కమీషన్ సుమోటోగా స్వీకరించింది. తెలంగాణ మహిళలను కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని కమీషన్ చైర్ పర్సన్ నేరెళ్ళ శారద అభిప్రాయపడ్డారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై విచారణకు ఆమె ఆదేశాలు జారీ చేశారు.
Updated Date - Aug 16 , 2024 | 08:44 AM