‘అమృత్’లో అక్రమాలు లేవని తేలితే రాజకీయ సన్యాసం
ABN, Publish Date - Sep 23 , 2024 | 03:07 AM
‘‘అమృత్ టెండర్ల విషయంలో తప్పు జరిగిందని నిరూపిస్తే రాజీనామా చేస్తానని ఒక మంత్రి అన్నారు. ఆ సవాల్‌ను నేను స్వీకరిస్తున్నా.
రేవంత్ పదవి ఊడగొట్టేందుకు మంత్రి పొంగులేటి యత్నం
దమ్ముంటే దర్యాప్తు జరిపించాలి.. సీజే దగ్గరకు వెళదాం రా
ఇష్టం లేదంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వద్దకైనా వెళ్దాం
ఈ వ్యవహారంలో సీఎం పదవి పోతుంది.. బీ రెడీ
సింగరేణి కార్మికులకు బోనస్ కాదు.. బోగస్: కేటీఆర్
హైదరాబాద్, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): ‘‘అమృత్ టెండర్ల విషయంలో తప్పు జరిగిందని నిరూపిస్తే రాజీనామా చేస్తానని ఒక మంత్రి అన్నారు. ఆ సవాల్‌ను నేను స్వీకరిస్తున్నా. దమ్ముంటే దీనిపై విచారణ జరిపించాలి. ఎలాంటి అక్రమాలూ జరగలేదని విచారణలో తేలితే రాజీనామా కాదు.. నేను రాజకీయ సన్యాసం చేస్తా’’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. మంత్రి పొంగులేటిని ఉద్దేశించి అన్నారు. రేవంత్‌రెడ్డి సీఎం పదవిని ఊడగొట్టే ప్రయత్నంలో భాగంగానే పొంగులేటి తనకు సవాల్ విసిరారని ఆయన వ్యాఖ్యానించారు.
ఆదివారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. దమ్ముంటే దీనిపై దర్యాప్తు జరిపించాలని పొంగులేటిని డిమాండ్ చేశారు. ‘‘ఈ టెండర్లకు సంబంధించిన పత్రాలతో హైకోర్టు సీజే వద్దకు ఇద్దరం వెళదాం. అది ఇష్టం లేదంటే ఢిల్లీ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వద్దకైనా వెళదాం. అప్పుడు వాస్తవాలు బయటపడతాయి. సీఎం, మంత్రులు రాజీనామా చేయాల్సి వస్తుంది’’ అన్నారు. తన బావమరిదికి అక్రమంగా టెండర్లు కట్టబెట్టిన వ్యవహారం రేవంత్ మెడకు చుట్టుకోవడం ఖాయమని.. ఆయన దీనికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ‘‘సూదిని సృజన్ రెడ్డి సీఎం రేవంత్ భార్యకు స్వయానా సోదరుడు. భార్య సోదరుడు బావమరిది కాక ఏమవుతారు. అవినీతి టెండర్ల కోసం సొంత బావమరిదితో సం బంధం లేదని చెప్తారా?’’ అని మండిపడ్డారు. ‘‘కేవలం రూ.2 కోట్ల లాభం ఉన్న బావమరిది కంపెనీకి రూ.1000 కోట్ల కాంట్రాక్టు ఇచ్చి అవినీతి జరగడం లేదంటే ఎవరైనా నమ్ముతారా?’’ అని నిలదీశారు.
ఇప్పటికైనా తప్పును ఒప్పుకొని టెండర్లను వెంటనే రద్దుచేయాలని డిమాండ్ చేశారు. లేదంటే, గతంలో సోనియాగాంధీ పద వి, మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్‌చవాన్, కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప పదవి పోయినట్లే రేవంత్ పదవి కూడా పోతుందని హెచ్చరించారు. ఇక.. సింగరేణి కార్మికులకు రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది దసరా బోనస్ కాదు.. బోగస్ అని దుయ్యబట్టారు. రూ.4,700 కోట్లు లాభాలు వచ్చాయని డిప్యూటీ సీఎం భట్టి చెప్పి న ప్రకారం సింగరేణి లాభాల్లో 33% వాటా ఇస్తే ఒక్కో కార్మికునికి రూ.3.70 లక్షలు పంచాల్సి ఉంటుందని.. కానీ, రూ.1.9 లక్షలు బోన్‌సగా ప్రకటించడమంటే.. లాభంలో ఇస్తున్న వాటా 16.2 శాతమేనని.. ఒక్కో కార్మికునికీ రూ.1.8 లక్షల నష్టమని చెప్పారు.
పురపాలకశాఖలో లంచావతారాలు..
కాంగ్రెస్ సర్కారు వచ్చిన 9 నెలల్లోనే పురపాలక శాఖలో లంచావతారాలు చెలరేగుతున్నాయని.. ఫైళ్ల క్లియరెన్స్ నత్తనడకన సాగుతోందని కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా ఆరోపించారు. సీఎం వద్దే ఉన్న మునిసిపల్ శాఖ పరిధిలోని హెచ్‌ఎండీఏలో భారీగా పేరుకుపోతున్న ఫైళ్లు దేనికి సంకేతమని ప్రశ్నించారు. కారణాల్లేకుండా అధికారు లు ఫైళ్లను తమవద్దే ఎందుకు తొక్కిపెడుతున్నారని నిలదీశారు. దీని వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో ప్రజలకు చెప్పాలన్నారు.
Updated Date - Sep 23 , 2024 | 03:07 AM