KTR : వచ్చే ఎన్నికల్లో గెలుపు మనదే!
ABN, Publish Date - Jul 03 , 2024 | 02:46 AM
రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని మాజీ సీఎం కేసీఆర్ చెప్పారు. 15 ఏళ్లపాటు అధికారంలో ఉంటామని ధీమా వ్యక్తం చేశారు.
15 ఏళ్లు బీఆర్‌ఎస్ అధికారంలో ఉంటుంది.. ఈసారి ఎవరికి బీ ఫామ్ దక్కితే వారిదే విజయం
పార్టీ మారిన వారిని
ప్రజలు అసహ్యించుకుంటున్నారు
జెడ్పీచైర్‌పర్సన్లతో కేసీఆర్
హైదరాబాద్/మర్కుక్, జూలై 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని మాజీ సీఎం కేసీఆర్ చెప్పారు. 15 ఏళ్లపాటు అధికారంలో ఉంటామని ధీమా వ్యక్తం చేశారు. గతంలో ఎన్టీఆర్ విషయంలో జరిగిందే.. తమకూ జరుగుతుందన్నారు. ఒకసారి అధికారంలోకి వస్తే.. పిచ్చి పనులు చేసి ప్రజలచేత ఛీ కొట్టించుకోవడం కాంగ్రెస్ పార్టీ లక్షణమని చెప్పారు. ఈ కారణంగానే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మళ్లీ బీఆర్‌ఎ్‌సనే గెలిపిస్తారని కేసీఆర్ పేర్కొన్నారు. మంగళవారం ఎర్రవెల్లిలోని తన వ్యవసాయక్షేత్రంలో జెడ్పీచైర్‌పర్సన్లు, వారి కుటుంబసభ్యులతో కేసీఆర్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఇందులో మాజీ మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తమ పార్టీ ఈసారి 15 ఏళ్లు అధికారంలో ఉంటుందన్నారు.
మరో రెండేళ్లలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందని, రాష్ట్రంలో నియోజకవర్గాల సంఖ్య 160 వరకు పెరగొచ్చని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో మహిళలకు ఎక్కువ అవకాశాలు వస్తాయని, ఈసారి బీఆర్‌ఎస్ తరఫున ఎవరికి బీఫామ్ దక్కితే వాళ్లదే విజయమని చెప్పారు. అంత వరకు పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంచెం కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయని, ఆలోగా పార్టీకి సంబంధించి అన్ని స్థాయుల్లో కమిటీల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు.
అత్యున్నత పదవులు అనుభవించి పార్టీని వీడుతున్న వారిని ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. వ్యవసాయ స్థిరీకరణ కోసం తమ ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా అన్నదాతలను ఆదుకుంటే.. కాంగ్రెస్ సర్కారు వివిధ కారణాలు చూపుతూ ఎగనామం పెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారం చేపట్టాక విద్యుత్తు, తాగునీటి ఇబ్బందులేగాక మతకల్లోలాలు కూడా చెలరేగడం బాధ కలిగిస్తోందని చెప్పారు. అప్పుడున్న అధికారులే ఇప్పుడూ ఉన్నప్పటికీ ఈ సమస్య ఎందుకు వస్తుందో ఆలోచించాలన్నారు. ఒకసారి ప్రజా జీవితంలోకి వచ్చాక, అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పనిచేసే వాళ్లే నిజమైన రాజకీయ నాయకులని కేసీఆర్ పేర్కొన్నారు.
Updated Date - Jul 03 , 2024 | 02:46 AM