KTR: ఒకటి, రెండేళ్లు జైలుకు వెళ్లడానికైనా సిద్ధమే
ABN, Publish Date - Oct 25 , 2024 | 04:03 AM
‘‘అధికారం ఎవరికీ శాశ్వతం కాదు.. పోలీసులు తొందరపడి ఆగం కావద్దు.. న్యాయం, ధర్మం ప్రకారం పని చేయండి.. వచ్చేది మళ్లీ మా ప్రభుత్వమే.. ఎవరినీ వదిలి పెట్టేది లేదు.. పోలీసులైనా, అధికారులైనా అతి చేస్తే ఊరుకోం.
కాంగ్రెస్ నేతలు పెట్టే కేసులకు భయపడం
పోలీసులు, అధికారులు.. అతి చేస్తే ఊరుకోం
కాంగ్రెసోళ్లను ఉరికించి కొట్టే రోజులు దగ్గర్లోనే
ఆ పార్టీ మోసాలను మహారాష్ట్రలోనూ చెప్పండి
ఆదిలాబాద్ రైతు పోరుబాట సభలో కేటీఆర్
ఆదిలాబాద్, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): ‘‘అధికారం ఎవరికీ శాశ్వతం కాదు.. పోలీసులు తొందరపడి ఆగం కావద్దు.. న్యాయం, ధర్మం ప్రకారం పని చేయండి.. వచ్చేది మళ్లీ మా ప్రభుత్వమే.. ఎవరినీ వదిలి పెట్టేది లేదు.. పోలీసులైనా, అధికారులైనా అతి చేస్తే ఊరుకోం. పేర్లు రాసిపెట్టుకుని మరీ అధికారంలోకి రాగానే మిత్తితో సహా చెల్లిస్తాం’’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. ఆదిలాబాద్‌లో గురువారం నిర్వహించిన రైతు పోరుబాట సభలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు పెట్టే కేసులకు భయపడబోమని, అవసరమైతే ప్రజల కోసం రెండేళ్లు జైలుకు వెళ్లడానికైనా సిద్ధమేనని ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులు చట్ట ప్రకారం విధులు నిర్వహించాలని సూచించారు. హైడ్రా పేరుతో ఇళ్ల నిర్మాణాలను కూల్చివేయడం, కడుపు కాలి ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి జైలులో పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
ప్రజలు తిరగబడి కాంగ్రెస్ వాళ్లను ఊళ్లలో ఉరికించి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. రుణమాఫీ చేయడం లేదని ప్రశ్నించిన రైతులపై కేసులు పెట్టారన్నారు. అలాంటప్పుడు కల్యాణలక్ష్మి కింద నగదుతోపాటు తులం బంగారం ఇస్తామని చెప్పి.. మోసం చేసిన సీఎంపై కేసులు ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించారు. సన్న ధాన్యానికి బోనస్ ఇస్తామని చెప్పినా.. ఇప్పటికీ రాలేదన్నారు. రైతు భరోసా ఇస్తామని చెప్పిన సీఎం కుర్చీకే భరోసా లేదన్నారు. బీసీ సబ్‌ప్లాన్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, యువ మహిళా డిక్లరేషన్, 2లక్షల ఉద్యోగాల భర్తీ ఏమైందని ప్రశ్నించారు.
త్వరలోనే మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతున్నాయని, కాంగ్రెస్ మోసాలను అక్కడి వాళ్లకు కూడా చెప్పాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వాస్తవానికి కాంగ్రెస్, బీజేపీ రెండూ తోడు దొంగలేనన్నారు. ఎన్నికల సమయంలో సీసీఐని పునరుద్ధరిస్తామని చెప్పిన బీజేపీ.. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు దందాలు చేస్తూ చందాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. కేంద్రంలో జుమ్లా ప్రధాని.. రాష్ట్రంలో హౌలా సీఎం ఉన్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ అంటే.. భారత రాష్ట్ర సమితి కాదని.. భారత రైతు సమితి అని, పార్టీ శ్రేణులు రైతుల పక్షాన పోరాడాలని కార్యకర్తలకు సూచించారు.
చిరు గాయం.. మందు రాసుకున్న కేటీఆర్
సభ ప్రారంభంలో అభిమానులు, కార్యకర్తలు కేటీఆర్ దగ్గరికి వచ్చేందుకు ప్రయత్నించారు. కరచాలనం చేసే ప్రయత్నంలో ఎవరివో గోళ్లు కేటీఆర్ చేతికి తగలడంతో.. చిన్న గాయమైంది. దీంతో సభలో ఆ గాయానికి కేటీఆర్ మందు రాసుకుంటూ కనిపించారు.
Updated Date - Oct 25 , 2024 | 04:03 AM