light rains: రాష్ట్రంలో నెలాఖరు వరకు వర్షాలు
ABN, Publish Date - Aug 26 , 2024 | 04:13 AM
రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఈనెల 31 వరకు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
4 రోజుల పాటు యెల్లో అలెర్ట్.. ఉమ్మడి కరీంనగర్, నిర్మల్, హైదరాబాద్‌లో అక్కడక్కడ వానలు
శ్రీశైలం, సాగర్‌కు తగ్గిన వరద
ఎస్సారెస్పీకి 34,952 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఈనెల 31 వరకు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమ, మంగళవారాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వివరించింది. సోమవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.
ఈనెల 29 వరకు యెల్లో అలెర్ట్ జారీ చేసింది. ఆదివారం రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడ్డాయి. ఉమ్మడి కరీంనగర్, నిర్మల్ జిల్లాల్లో మోస్తరుగా.. హైదరాబాద్‌లో అక్కడక్కడ చిరు జల్లులు కురిశాయి. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం కొండాపూర్‌లో 5.4 సెం.మీ., కరీంనగర్ జిల్లా చిగురుమామిడి, నిర్మల్ జిల్లా లక్ష్మణచాందలో 4.9 సెం.మీ., ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలో 4.7 సెం.మీ., అదే జిల్లా పెంచికల్‌పేటలో 4.2 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో మధ్యాహ్నం గంట పాటు భారీ వర్షం కురవగా.. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
ఆల్మట్టికి పెరిగిన వరద..
కృష్ణా బేసిన్‌లోని ఎగువ ప్రాజెక్టులు ఆల్మట్టి, నారాయణపూర్‌లకు మళ్లీ ఇప్పుడిప్పుడే వరద పెరుగుతుండగా.. దిగువన శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు వరద ప్రవాహాలు తగ్గాయి. తుంగభద్ర మినహా అన్ని ప్రాజెక్టుల్లోనూ నీరు నిండుగానే ఉంది. ఆల్మట్టికి 46,739 క్యూసెక్కుల వరద ఇన్‌ఫ్లో ఉండగా.. లక్ష క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉంది. నారాయణపూర్‌కు 40 వేల క్యూసెక్కులు వస్తుండగా, 66,270 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టులోకి 31 వేల క్యూసెక్కులు వస్తుండగా.. జల విద్యుదుత్పత్తి ద్వారా 39 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
తుంగభద్ర డ్యామ్‌కు 23,725 క్యూసెక్కులు వస్తుండగా, దిగువకు నీటిని విడవట్లేదు. శ్రీశైలానికి 45,855 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, విద్యుదుత్పత్తి ద్వారా 69,282 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్‌కు 37,882 క్యూసెక్కులు వస్తుండగా.. మొత్తం 48,818 క్యూసెక్కులను దిగువకు విడుదలవుతోంది. ఇటు గోదావరి బేసిన్‌లో శ్రీరాంసాగర్ (ఎస్సారెస్పీ) ప్రాజెక్టుకు 34,952 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది.
Updated Date - Aug 26 , 2024 | 04:13 AM