Share News

అక్టోబరులో 4.25 లక్షల మందికి రుణమాఫీ!

ABN , Publish Date - Sep 25 , 2024 | 04:14 AM

దసరాలోపు నాలుగో విడత రుణమాఫీ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. అందుకు అవసరమైన కసరత్తును ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం. రేషన్‌ కార్డులు లేకపోవడం, కుటుంబ

అక్టోబరులో 4.25 లక్షల మందికి రుణమాఫీ!

దసరాలోపు నాలుగో విడత పూర్త్తి?

రూ.4250 కోట్లు అవసరమని అంచనా.. స్థానికంగా లేని కుటుంబాల డేటా అప్‌లోడ్‌ పెండింగ్‌

నెలాఖరుకల్లా ఫ్యామిలీ గ్రూపింగ్‌ పూర్తి చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్‌, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): దసరాలోపు నాలుగో విడత రుణమాఫీ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. అందుకు అవసరమైన కసరత్తును ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం. రేషన్‌ కార్డులు లేకపోవడం, కుటుంబ నిర్ధారణ కాకపోవడం, ఆధార్‌లో తప్పులు దొర్లడంతో పెండింగ్‌లో ఉన్న రైతుల సమాచారాన్ని సరిచేసి నాలుగో విడతలో రుణమాఫీ చేయనున్నారు. ప్రస్తుతం కుటుంబ నిర్ధారణ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుండగా.. ఈ నెలాఖరువరకు డేటా అప్‌లోడ్‌ పూర్తి చేయనున్నట్లు తెలిసింది. దసరా పండుగలోపు 4.25 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ మేరకు నిధుల సర్దుబాటుపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. పంద్రాగస్టు నాటికి రాష్ట్ర ప్రభుత్వం సుమారు 22 లక్షల మంది రైతులకు రూ.17,934 కోట్ల రుణమాఫీ చేసిన విషయం తెలిసిందే. అయితే రేషన్‌ కార్డులు లేని రైతులకు, కుటుంబ నిర్ధారణ కానివారికి, ఆధార్‌, బ్యాంకు ఖాతా పుస్తకాల్లో తప్పులు దొర్లిన రైతులకు.. రుణమాఫీ చేయకుండా పెండింగ్‌ పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా కుటుంబ నిర్ధారణ కాని రైతులు 4.28 లక్షల మంది ఉండగా, ఆధార్‌, ఇతర సాంకేతిక సమస్యలున్న రైతులు 1.26 లక్షల మంది ఉన్నారు. మొత్తం కలిపి 5.54 లక్షల మంది రైతుల ఖాతాలు పెండింగ్‌లో పెట్టారు. ‘పంట రుణ మాఫీ (సీఎల్‌డబ్ల్యు)యా్‌ప’ను ప్రత్యేకంగా రూపొందించి వివరాలు అప్‌లోడ్‌ చేయాలని మండల వ్యవసాయ అధికారులకు (ఏవోలకు) బాధ్యతలు అప్పగించారు. ఆగస్టు 29 నుంచి సెప్టెంబరు 4 వరకు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఆ తర్వాత నుంచి ఏవోలు క్షేత్రస్థాయికి వెళ్లి రైతులు, కుటుంబ సభ్యుల వివరాలు, ఆధార్‌ కార్డులు సేకరించి, సెల్ఫీలు దిగి, రైతు నుంచి డిక్లరేషన్‌ తీసుకొని, యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. ఫ్యామిలీ గ్రూపింగ్‌ ప్రక్రియ దాదాపుగా కొలిక్కి వచ్చింది. ఆదిలాబాద్‌ సహా కొన్ని జిల్లాల్లో 90 శాతం పూర్తయింది. మరికొన్ని జిల్లాల్లో 70 శాతం నుంచి 80 శాతం పూర్తయింది. మంగళవారం నాటికి అందిన సమాచారం మేరకు.. 4.28 లక్షల మంది రైతుల్లో 3.10 లక్షల మంది రైతులకు సంబంధించి ఫ్యామిలీ గ్రూపింగ్‌ పూర్తయింది. ఆధార్‌ మిస్‌ మ్యాచింగ్‌ అయిన 1.26 లక్షల మంది రైతుల్లో ఇప్పటివరకు లక్ష మంది రైతుల వివరాలు సరిచేశారు.


మొత్తం 5.54 లక్షల మంది రైతుల్లో ఇప్పటివరకు 4.10 లక్షల మంది రైతుల వివరాలు సరిచేసి అప్‌లోడ్‌ చేశారు. ఇప్పటి వరకు సగటున 74 శాతం అప్‌లోడ్‌ ప్రక్రియ పూర్తయింది. ఈ నెలాఖరు వరకు మరో 15 వేల మంది వివరాలు అప్‌లోడ్‌ చేస్తామనే అంచనాతో వ్యవసాయశాఖ అధికారులున్నారు. అంతా కలిపి 4.25 లక్షల మంది రైతులు నాలుగో విడత రుణమాఫీలో లబ్ధిదారులుగా ఉండనున్నారు. వీరికి సగటున రూ. లక్ష చొప్పున బకాయిలున్నా.. సుమారు రూ.4,250 కోట్లు సర్దుబాటు చేయా ల్సి ఉంటుంది. దాదాపుగా స్థానికంగా ఉన్న రైతుల కుటుంబ నిర్ధారణ, డేటా అప్‌లోడ్‌ పూర్తయింది. ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఉన్న రైతులకు సంబంధించి డేటా అప్‌లోడ్‌ పెండింగ్‌ పడింది. లోన్‌ తీసుకున్న రైతు కుటుంబంలో ఎవరో ఒకరు (భార్య/భర్త) అందుబాటులో ఉన్నా ఫొటో, డిక్లరేషన్‌, సెల్ఫీ తీసుకొని అప్‌లోడ్‌ చేస్తున్నారు. ఏ ఒక్కరూ అందుబాటులో లేకపోతే పెండింగ్‌ జాబితాలో పెట్టారు. ఏవోలు కూడా బ్యాంకర్ల నుంచి రైతుల వివరాలు తీసుకొని.. స్థానికంగా లేనివారికి ఫోన్లు చేసి సమాచారం ఇచ్చారు. అయితే కొందరు రైతులు ఇప్పటికీ రావడం లేదు. అలాంటి వారి డేటా అప్‌లోడ్‌ చేయలేదు. రేషన్‌ కార్డు లు లేని వారిలో 1.18 లక్షల మంది రైతులు ఏవోలకు అందుబాటులోకి రాలేదు. ఆధార్‌లో తప్పులున్న రైతు లు 26 వేల మందికి సంబంధించి సమాచారాన్ని సరిచేసే అంశం పెండింగ్‌లో ఉంది. వీరిలో నెలాఖరు వర కు 15 వేల మంది అందుబాటులోకి రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెలాఖరు వరకు ఫ్యా మిలీ గ్రూపింగ్‌, డేటా అప్‌లోడ్‌ పూర్తిచేయనున్నారు.

Updated Date - Sep 25 , 2024 | 08:52 AM