Local Body Elections: దీపావళి తర్వాత స్థానిక ధమాకా!

ABN, Publish Date - Jul 27 , 2024 | 02:48 AM

Telangana Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలు డిసెంబరులో జరగనున్నాయా!? ఇందుకు నవంబరులో నోటిఫికేషన్‌ విడుదల కానుందా!? ఈ ప్రశ్నలన్నిటికీ ‘ఔను’ అనే అంటున్నాయి అత్యంత విశ్వసనీయ వర్గాలు.

Local Body Elections: దీపావళి తర్వాత స్థానిక ధమాకా!
Telangana Local Body Elections:

  • నవంబరులో నోటిఫికేషన్‌.. డిసెంబరులో ఎన్నికలు.. బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై తర్జనభర్జన

  • ఓటర్ల జాబితా ప్రకారం బీసీ గణనకు సర్కారు నిర్ణయం.. ఈసీ నుంచి దానిని తీసుకోనున్న పంచాయతీరాజ్‌

  • దాంతో గ్రామాలు, వార్డులు, మండలాల వారీ సర్వే.. బీసీలకు రిజర్వేషన్లు ఎంతనే అంశంపై కమిషన్‌ సిఫారసు

హైదరాబాద్‌, జూలై 26 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలు డిసెంబరులో జరగనున్నాయా!? ఇందుకు నవంబరులో నోటిఫికేషన్‌ విడుదల కానుందా!? ఈ ప్రశ్నలన్నిటికీ ‘ఔను’ అనే అంటున్నాయి అత్యంత విశ్వసనీయ వర్గాలు. డిసెంబరులో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేలా ప్రభుత్వం అడుగులు వేస్తోందని, ఈ మేరకు నవంబరులోనే ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుందని ఆ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో సర్పంచ్‌ల పదవీ కాలం జనవరిలో; ఎంపీటీసీ, జడ్పీటీసీ పదవీ కాలం జూలై మొదటి వారంతో ముగిసింది. పదవీ కాలాలు ముగిసేలోపే ఎన్నికలను నిర్వహించి కొత్తవారిని ఎన్నుకోవాలి. సర్పంచిల పదవీ కాలం ముగిసి ఇప్పటికే ఆరు నెలలు దాటేసింది.


ఫలితంగా, స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి వచ్చే నిధులు ఇప్పటికే నిలిచిపోయాయి. ఈ నిధులు సాధించుకోవాలంటే సాధ్యమైనంత తొందరగా స్థానిక ఎన్నికలను నిర్వహించాలనే ఆలోచనలో సర్కారు ఉంది. అలాగే, రుణ మాఫీ ప్రక్రియ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తేల్చి చెప్పారు. ఈ ప్రక్రియ ఆగస్టు 15వ తేదీనాటికి పూర్తి కానుండడంతో ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించాలని పావులు కదుపుతున్నారు. ముందుగా సర్పంచ్‌, తరువాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. మునిపాలిటీలకు మాత్రం వచ్చే ఏడాది జనవరి తరువాత ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలిసింది.


బీసీల రిజర్వేషన్‌ ఎంత!?

రిజర్వేషన్లు 50 శాతాన్ని మించరాదన్న సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ఈసారి కూడా బీసీలకు 23 శాతమే అమలవుతుందా!? లేక బీసీలు ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నట్లు చట్ట సవరణ చేసి వాటిని పెంచే అవకాశం ఉంటుందా!? అనే అంశంపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. నిజానికి, గత బీఆర్‌ఎస్‌ సర్కారు 2018లో పంచాయతీరాజ్‌ చట్టంలో పలు సవరణలు చేసింది. సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 23 శాతానికి తగ్గించింది. ఆ ప్రకారమే 2019లో స్థానిక ఎన్నికలను నిర్వహించింది. జనాభా దామాషా ప్రకారం తమకు రిజర్వేషన్లు పెంచి అమలు చేయాలని బీసీలు డిమాండ్‌ చేస్తూ వస్తున్నారు. కానీ, రిజర్వేషన్లు 50 శాతం మించరాదన్న సుప్రీం కోర్టు ఆదేశాలు ఇందుకు ప్రతిబంధకంగా మారాయి. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లను కల్పిస్తున్నారు. సుప్రీం కోర్టు నిర్దేశించిన 50 శాతం కోటా మించకుండా ఆయా రాష్ట్రాలు బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే, బీసీల ఆకాంక్షలను నెరవేర్చడానికి వారి జనాభాను తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుల గణనకు ఆదేశించిన విషయం తెలిసిందే. కానీ, అది ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం లేదు.


దాంతో, ఓటర్ల జాబితా ప్రకారమే ఈ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. దాని ప్రకారమే బీసీల జనాభా ఎంతనే విషయాన్ని తేల్చనుందని సమాచారం. ఈ మేరకు ఎన్నికల సంఘం నుంచి తాజా ఓటర్ల జాబితాను పంచాయతీరాజ్‌ శాఖ తీసుకుంటుంది. గ్రామాలు, వార్డులు, మండలాలవారీగా వివరాలు సేకరించి బీసీ కమిషన్‌కు అందజేస్తుంది. క్షేత్రస్థాయిలో బీసీలు ఎంత మంది ఉన్నారనే వివరాలను పరిశీలించి.. బీసీలు రాష్ట్రంలో ఎంతమేర వెనకబాటుకు గురయ్యారు? వారికి ఎంతమేర రిజర్వేషన్లు కల్పించాలనే అంశంపై ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది. కాగా గ్రామ, వార్డు, మండలవారీగా స్థానిక వివరాల సేకరణకు సుమారు 35-45 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది.


అనంతరం బీసీ కమిషన్‌ వాటిని పరిశీలించి ప్రభుత్వానికి నివేదించేందుకు సుమారు 55-65 రోజుల సమయం పడుతుంది. ఈ ప్రక్రియ మొత్తం అక్టోబరు- నవంబరు మధ్య పూర్తి కానుంది. దాంతో, నవంబరు చివరి వారంలో ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల కానున్నట్టు సమాచారం. అయితే, ఇక్కడ బీసీ కమిషన్‌ ఇచ్చిన నివేదిక మేరకు రిజర్వేషన్లపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దాని ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంటుంది. కానీ, బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని బీసీ కమిషన్‌ సిఫారసు చేసినా.. ఇప్పటికిప్పుడు దానిని పెంచి అమలు చేసే అవకాశం లేదు. అందుకు భారీ ప్రక్రియనే చేపట్టాల్సి ఉంటుంది. పంచాయతీరాజ్‌ చట్టంలో చట్ట సవరణ చేయాల్సి ఉంటుంది.


ప్రస్తుత కమిషన్‌ నేతృత్వంలోనే..

బీసీ రిజర్వేషన్ల అంశంపై గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన డాక్టర్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌ నేతృత్వంలోని బీసీ కమిషన్‌నే అప్పటి ప్రభుత్వం పూర్తిస్థాయి డెడికేటెడ్‌ కమిషన్‌గా నియమించింది. అప్పటి నుంచి ఈ కమిషన్‌ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్‌ను ఖరారు చేసే అంశంపై కృషి చేస్తూ వస్తోంది. దీని గడువు ఆగస్టుతో ముగియనుంది. ఇదే సమయంలో ప్రభుత్వం స్థానిక ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయించింది. మళ్లీ కొత్త కమిషన్‌ను నియమిస్తే అది కసరత్తు చేయడానికి సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో వకుళాభరణం కృష్ణమోహన్‌ కమిషన్‌ గడువునే పొడిగించి దాని ఆధ్వర్యంలోనే బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసి, ఎన్నికలకు వెళ్లాలని సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది.


Also Read:

Nagarjuna Sagar: సాగర్‌ నీటి విడుదలకు మా సమ్మతి అక్కర్లేదా?

Krishna basin: కృష్ణమ్మ బిరబిరా.. శ్రీశైలం కళకళ!

Kottur: దొంగలను పట్టించిన యూపీఐ చెల్లింపు..

For More Telangana News and Telugu News..

Updated Date - Jul 27 , 2024 | 07:59 AM

Advertising
Advertising
<