Kaleshwaram Project: మేడిగడ్డతో ముంపు
ABN, Publish Date - Oct 29 , 2024 | 04:33 AM
కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగా తమ సాగు భూములు ముంపునకు గురవుతున్నాయని మహారాష్ట్ర రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బ్యారేజీ పూర్తిగా నిండితే 400 ఎకరాలకు ముప్పు
దీన్ని గుర్తించడంలో తెలంగాణ, మహారాష్ట్ర అధికారుల వైఫల్యం.. చర్యలు తీసుకోండి
కాళేశ్వరం విచారణ కమిషన్ చైర్మన్ ఘోష్‌కు మహారాష్ట్ర రైతుల లేఖ
మహదేవపూర్ రూరల్, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగా తమ సాగు భూములు ముంపునకు గురవుతున్నాయని మహారాష్ట్ర రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీతో మహారాష్ట్ర వైపు నష్టపోతున్న ముంపు భూములను గుర్తించడంలో తెలంగాణ, మహారాష్ట్ర అధికారులు అలసత్వం వహించారని, ఫలితంగా తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇరు రాష్ట్రాలకు చెందిన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్ చైర్మన్ పినాకి చంద్రఘో్‌షకు మహారాష్ట్ర రైతులు సోమవారం లేఖ రాశారు. బ్యారేజీలో పూర్తి స్థాయిలో నీటిని నింపితే మహారాష్ట్ర వైపు అదనంగా 400 ఎకరాల వరకు పంట భూములు నీటమునుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ముంపు భూముల వివరాలను తప్పుగా చూపిస్తూ అధికారులు చేసిన సర్వేతోపాటు పరిహారం చెల్లింపులోనూ జాప్యం వహించారని పేర్కొన్నారు. ఫలితంగా తామంతా ఆందోళనలకు దిగడంతో మహారాష్ట్ర ప్రభుత్వమే పరిహారం ఇచ్చిందని వెల్లడించారు. బ్యారేజీలో నీటినిల్వ 100 ఎఫ్‌ఆర్‌ఎల్ చేరితే అదనంగా ముంపునకు గురయ్యే భూముల సర్వే, పరిహారంపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టతనివ్వకుండా తమ జీవితాలతో ఇరురాష్ట్రాల ప్రభుత్వాలు చెలగాటమాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో మరోమారు మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా సిరొంచా మండల కేంద్రంలో తాము నిరసన కార్యక్రమాలు చేపట్టిన క్రమంలోనే అక్కడ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని, ఫలితంగా నిరసనను తాత్కాలికంగా విరమించుకున్నామని పేర్కొన్నారు. ప్రాజెక్టుపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర వైపు ముంపునకు గురవుతున్న భూములు, పరిహారంపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. పీసీ ఘోష్‌కు లేఖ రాసిన మహారాష్ట్ర రైతులు భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ పోస్టాఫీసులో రిజిస్టర్ పోస్ట్ చేశారు.
Updated Date - Oct 29 , 2024 | 04:33 AM