ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sunkishala Project: కుప్పకూలిన సుంకిశాల గోడ

ABN, Publish Date - Aug 09 , 2024 | 04:11 AM

అది నాగార్జున సాగర్‌ జలాశయానికి ఆనుకుని నిర్మిస్తున్న సుంకిశాల ప్రాజెక్టు! నిత్యం ఒక్కో షిఫ్టులో అక్కడ వంద మంది పని చేస్తూ ఉంటారు!

  • ధ్వంసమైన రెండో టన్నెల్‌ గేటు.. వంద మందికి త్రుటిలో తప్పిన పెను ముప్పు

నాగార్జునసాగర్‌, హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 8: అది నాగార్జున సాగర్‌ జలాశయానికి ఆనుకుని నిర్మిస్తున్న సుంకిశాల ప్రాజెక్టు! నిత్యం ఒక్కో షిఫ్టులో అక్కడ వంద మంది పని చేస్తూ ఉంటారు! ఈనెల 2న రాత్రి షిఫ్టు చేసిన కార్మికులు ఉదయం ఆరింటికి బయటకు వెళ్లారు! పగలు డ్యూటీ కార్మికులు ఇంకా లోపలికి రాలేదు! ఆ సమయంలో భారీ శబ్ధం! టన్నెల్‌ గేటు, ఇన్‌టేక్‌ వెల్‌ రక్షణ గోడ ఒక్కసారిగా కుప్పకూలాయి. కళ్లు మూసి తెరిచేలోగానే ఇన్‌టేక్‌ వెల్‌ (భారీ సంపు) నీట మునిగింది! ఆ సమయంలో అక్కడ కార్మికులు ఎవరూ లేకపోవడంతో పెను ముప్పు తప్పింది. ఇదే ప్రమాదం అరగంట ముందు జరిగి ఉంటే సుమారు 100 మంది కూలీలు జలసమాధి అయ్యేవారు.


హైదరాబాద్‌లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా 50 ఏళ్ల వరకు తాగునీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం సుంకిశాల వద్ద ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. దీని నిర్మాణ పనులకు నాటి మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌, సబిత, మహమూద్‌ అలీ, జగదీశ్‌ రెడ్డి 2022, మే 14న శంకుస్థాపన చేశారు. తొలుత, రూ.1,450 కోట్లతో మేఘా ఇంజనీరింగ్‌ వర్క్స్‌ ఒప్పందం చేసుకుంది. తర్వాత అంచనా వ్యయం రూ.2,215 కోట్లకు పెంచారు. ప్రాజెక్టులో భాగంగా ఇన్‌టేక్‌ వెల్‌(భారీ సంపు), మూడేసి పంప్‌ హౌజ్‌లు, టన్నెళ్లు, పంప్‌హౌజ్‌ సూపర్‌ స్ట్రక్చర్‌ నిర్మిస్తారు. నాటినుంచి నిర్మాణ పనులు సాగుతున్నాయి.


  • మూడు స్థాయుల్లో పంప్‌హౌజ్‌లు

నాగార్జున సాగర్‌ జలాశయం కనిష్ఠ నీటి మట్టం (డెడ్‌ స్టోరేజీ) 510 అడుగులు. ప్రస్తుతం అక్కంపల్లి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. సాగర్‌లో నీటిమట్టం 510 అడుగుల కంటే తగ్గితే.. అక్కంపల్లికి నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. నీటి మట్టం 450 అడుగుల వరకూ ఉన్నా నీటిని తరలించేందుకు వీలుగా సుంకిశాల ప్రాజెక్టు చేపట్టారు. అంటే, మండు వేసవిలోనూ హైదరాబాద్‌ తాగునీటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేలా దీనిని నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా జలాశయం నుంచి సొరంగ మార్గం (మూడు టన్నెళ్లు) ద్వారా నీటిని ఇన్‌టేక్‌ వెల్‌కు తరలిస్తారు. ఇక్కడి నుంచి 30 కి.మీ. దూరంలో ఉన్న పెద్దఅడిశర్లపల్లి మండలం కోదండాపూర్‌ వాటర్‌ ప్లాంట్‌లో నీటిని నిల్వ చేస్తారు. అక్కడ ఫిల్టర్‌ చేసిన తర్వాత జంట నగరాలకు తరలిస్తారు. జలాశయం నుంచి ఇన్‌టేక్‌ వెల్‌కు నీటిని తరలించడానికి మూడు పంప్‌హౌజ్‌లు నిర్మిస్తున్నారు. వీటిలో మొదటిది, మూడోది పూర్తయ్యాయి.


రెండో టన్నెల్‌, పంప్‌ హౌజ్‌ పనులు కొనసాగుతున్నాయి. జూలై 29, 30, 31 తేదీల్లో టన్నెల్‌కు గేటు అమర్చారు. ఇందుకు రిజర్వాయర్‌ వైపున్న మట్టిని తొలగించారు. అదే సమయంలో సాగర్‌కు ఎగువ నుంచి భారీ వరద ప్రారంభమైన విషయం తెలిసిందే. దాంతో, టన్నెల్‌ గేటు ధ్వంసమైంది. దానికి అనుసంధానంగా ఉన్న ఇన్‌టేక్‌ వెల్‌ సైడ్‌ వాల్‌(రక్షణ గోడ) కూలిపోయింది. ఐదు నిమిషాల స్వల్ప వ్యవధిలోనే 590 అడుగుల ఇన్‌టేక్‌ వెల్‌ పూర్తిగా నిండిపోయింది. ఇంత పెద్ద ప్రమాదం జరిగి వారం రోజులు గడిచినా.. హైదరాబాద్‌ జలమండలి బయటకు వెల్లడించలేదు. నిర్మాణ సంస్థ కూడా గోప్యంగానే ఉంచింది. గోడ కూలుతున్న సమయంలో అక్కడ పనిచేసే ఒడిశా కార్మికులు తీసిన వీడియో ద్వారా విషయం బయటకు వచ్చింది. రక్షణ గోడ నిటారుగా ఉండడంతో ప్రమాదం ఉంటుందని, దానికి అనుసంధానంగా టై భీమ్‌లను నిర్మించాలని ఐదారు నెలల క్రితమే ఇంజనీరింగ్‌ అధికారులు సూచించారు. కానీ, నిర్మాణ సంస్థ పట్టించుకోలేదు. అదే సమయంలో గేటు ఏర్పాటుకు రిజర్వాయర్‌ వైపు మట్టి తొలగింపు పనులు చేశారు. దాంతో, గేటు ధ్వంసమై, రక్షణ గోడ కూలింది.


  • మొదటి నుంచీ వివాదాస్పదమే

సుంకిశాల పంప్‌హౌజ్‌ నిర్మాణ పనులు పూర్తయితే జంట నగరాలకు ఏఎంఆర్‌పీ నుంచి నీటిని తరలించడం ఆపేసి ఇక్కడి నుంచి నిరంతరాయంగా సరఫరా చేస్తారు. నిజానికి, జంట నగరాలకు సుంకిశాల నుంచి నీటిని తీసుకెళ్లాలని ఉమ్మడి ఏపీ సీఎం కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ప్రతిపాదించారు. అప్పట్లో ఆ పనులను సీపీఎం, టీడీపీ వ్యతిరేకించాయి. దీనిపై అప్పట్లో నార్ల తాతారావు ఆధ్వర్యంలో ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ సుంకిశాలతో లాభం లేదని తేల్చి.. అక్కంపల్లి వద్ద ఏఎంఆర్‌పీని ప్రతిపాదించింది. దీంతో, ఎన్టీఆర్‌ హయంలో అక్కంపల్లి వద్ద పంప్‌హౌజ్‌కు శంకుస్థాపన చేసి అక్కడి నుంచి కోదండాపూర్‌ పంప్‌హౌ్‌సకు తరలించి శుద్ధి చేసిన నీటిని జంట నగరాలకు తరలించే ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర విభజన తర్వాత 2014లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏఎమ్మార్పీకి బదులు సుంకిశాల నుంచి జంట నగరాలకు తాగు నీటిని అందించాలని నిర్ణయించింది.


  • పునః నిర్మాణ ఖర్చు మేఘాదే: జల మండలి

పునర్నిర్మాణ పనులకు రూ.20 కోట్ల వరకూ ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రాజెక్టులో దెబ్బతిన్న భాగాన్ని మేఘా సంస్థే నిర్మిస్తుందని, ఇందుకయ్యే ఖర్చునూ నిర్మాణ సంస్థే భరిస్తుందని వాటర్‌ బోర్డు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. అనూహ్యంగా భారీ వరద వచ్చి టన్నెల్‌ వద్ద ఒత్తిడి పెరగడంతో ప్రమాదం సంభవించిందని పేర్కొన్నారు. ఘటనపై బోర్డు స్థాయిలో ఇంజనీర్లతో విచారణ కమిటీ ఏర్పాటు చేశారని, సభ్యులుగా వాటర్‌ బోర్డు ఈడీ సత్యనారాయణ, రెవెన్యూ డైరెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, ప్రాజెక్టు డైరెక్టర్‌ సుదర్శన్‌ను నియమించారని తెలిపారు. నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటారని, మార్చిలోగా పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ ఘటనతో మరో రెండు నెలలు ఆలస్యమవుతుందని వివరించారు. నిజానికి, జలాశయం నీటిమట్టం కనిష్ఠ స్థాయిలో 510 అడుగుల కంటే తక్కువ ఉంటేనే ప్రాజెక్టు నిర్మాణ పనులు సాగుతాయి. లేకపోతే పంప్‌హౌజ్‌లోకి నీళ్లు చేరి పనులకు ఆటంకం ఏర్పడుతుంది. అంటే, సాగర్‌లో నీటి మట్టం డెడ్‌ స్టోరేజీ కంటే తగ్గితేనే తిరిగి ఇక్కడ పనులు ప్రారంభం కానున్నాయి. అంటే, రాబోయే వేసవిలోనే ఈ పనులు చేయడానికి అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.


  • ఈ పాపం బీఆర్‌ఎస్‌దే: భట్టి

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు సుంకిశాల ప్రాజెక్టులో గోడ కూలిన పాపం కూడా గత బీఆర్‌ఎస్‌ పాలకులదేనని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు. మేడిగడ్డ, సుందిళ్ల మాత్రమే నాసిరకమని అనుకున్నామని.. గోదావరినే కాదు కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టులను కూడా వదిలిపెట్టలేదని సుంకిశాల ఘటన తేటతెల్లం చేస్తోందని మండిపడ్డారు. విద్యుత్తు శాఖపై గురువారం ఆయన ఖైరతాబాద్‌లోని టీజీఎస్పీడీసీఎల్‌ ప్రధాన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సుంకిశాల ప్రాజెక్టును బీఆర్‌ఎస్‌ హయాంలోనే ప్రారంభించారని, 2023 జూలైలో టన్నెల్‌ రక్షణ గోడను పూర్తి చేశారని వివరించారు. గోడలు డిజైన్ల లోపంతో కూలిపోతే.. కాంగ్రెస్‌ సర్కారు రాగానే కూలిందంటూ తమ పాపాన్ని వేరొకరిపై వేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సుంకిశాల ఘటనపై అధికారులు విచారణ చేస్తున్నారని,చెప్పారు. విద్యుత్తు శాఖ టోల్‌ ఫ్రీ నంబర్‌ 1912కు విస్తృత ప్రచారం కల్పించాలని, 108 తరహాలో దీని సేవలు విస్తృతం చేస్తామని చెప్పారు. పదోన్నతులు, బదిలీలకు సంబంధించిన కార్యాచరణ వెంటనే చేపట్టాలని సీఎండీలను ఆదేశించారు.


  • ఆనాడే వ్యతిరేకించా: గుత్తా

నల్లగొండ, ఆగస్టు 8: కృష్ణా బేసిన్‌లో ప్రాజెక్టుల నిర్మాణంపై బీఆర్‌ఎస్‌ సర్కారు నిర్లక్ష్యం చూపిందని మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆరోపించారు. సుంకిశాల పంప్‌హౌస్‌ నిర్మాణాన్ని ఆనాడే తాను వ్యతిరేకించానని, కేటీఆర్‌ దృష్టికి సైతం తీసుకెళ్లానని చెప్పారు. ఆ నిధులను ఎస్‌ఎల్‌బీసీకి కేటాయిస్తే బాగుండేదన్నారు. నల్లగొండలో గురువారం ఆయన మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ హయాంలో కాళేశ్వరంతోపాటు గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులపైనే పూర్తి స్థాయిలో శ్రద్ధ పెట్టిందన్నారు. కాళేశ్వరంపై చూపిన శ్రద్ధలో 15 శాతం కృష్ణా బేసిన్‌పై చూపినా నల్లగొండ జిల్లాలోని ఎస్‌ఎల్‌బీసీతోపాటు డిండి ఎత్తిపోతలు, ఉదయసముద్రం ప్రాజెక్టులు పూర్తయి ఉండేవన్నారు. నల్లగొండ జిల్లాలోని పలు ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభించి.. 18 ఏళ్లవుతున్నా కొలిక్కి రాకపోవడం బాధాకరమన్నారు. ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 4 లక్షలు, ఏఎమ్మార్పీ ద్వారా 3 లక్షలు, డిండి ద్వారా 3 లక్షలు, ఉదయసముద్రం ద్వారా లక్ష ఎకరాలకు సాగు నీరు వస్తే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందన్నారు.


  • గత సర్కారు వల్లే: పొన్నం

ఎల్కతుర్తి/భీమదేవరపల్లి, ఆగస్టు 8: సుంకిశాల పంపుహౌస్‌ నిర్మాణం సందర్భంగా రక్షణ గోడ కూలిన ఘటనపై న్యాయ విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ పేర్కొన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు హైదరాబాద్‌ ఇన్‌చార్జి మంత్రిగా సుంకిశాలపై సమగ్ర విచారణ చేపడతామన్నారు. ప్రాథమికంగా విచారణ చేపట్టాలని హెచ్‌ఎండీఏ, మునిసిపల్‌ అధికారులను ఇప్పటికే ఆదేశించినట్లు తెలిపారు. హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తి, భీమదేవరపల్లిలో గురువారం మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడారు. పెట్టుబడులను ఆహ్వానించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్తే బీఆర్‌ఎస్‌ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగినా మాట్లాడలేని చేతగాని మంత్రి కిషన్‌రెడ్డి అని విమర్శించారు. రుణమాఫీపై విమర్శలు చేయడం ఆయనకే చెల్లిందని మండిపడ్డారు.

Updated Date - Aug 09 , 2024 | 04:11 AM

Advertising
Advertising
<