Nagarjunasagar: బుద్ధ వనంలో బౌద్ధ విశ్వవిద్యాలయం!
ABN, Publish Date - Aug 26 , 2024 | 04:43 AM
నాగార్జునసాగర్ సమీపంలో అభివృద్ధి చేసిన బుద్ధ వనంలో బౌద్ధ విశ్వవిద్యాలయం స్థాపన కోసం మలేషియా బుద్ధిస్ట్ సంస్థ ముందుకు వచ్చింది.
మలేషియా బుద్ధిస్ట్ సంస్థ ప్రతిపాదనలు
బడ్జెట్ హోటల్ నిర్మాణానికి తైవాన్ ఓకే
సమీక్షించి నిర్ణయం తీసుకోనున్న సర్కార్
హైదరాబాద్, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్ సమీపంలో అభివృద్ధి చేసిన బుద్ధ వనంలో బౌద్ధ విశ్వవిద్యాలయం స్థాపన కోసం మలేషియా బుద్ధిస్ట్ సంస్థ ముందుకు వచ్చింది. 274 ఎకరాల మేర విస్తరించి ఉన్న బుద్ధ వనం ప్రాజెక్టులో తమకు అవసరమైన స్థలాన్ని కేటాయించిన పక్షంలో అంతర్జాతీయ ప్రమాణాలతో విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. బౌద్ధ మత ప్రచారకుడిగా విశ్వవ్యాప్త గుర్తింపుపొందిన ఆచార్య నాగార్జునుడు ఇక్కడ స్థాపించిన విజయపురి విశ్వవిద్యాలయంలో దేశ విదేశాలకు చెందిన వేలాది మంది విద్య అభ్యసించిన ప్రాశస్త్యాన్ని పరిగణనలోకి తీసుకుని బౌద్ధ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి వారు ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం.
మరోవైపు.. పర్యాటకులకు అవసరమైన వసతి సౌకర్యాలు కల్పించేందుకు వీలుగా బడ్జెట్ హోటల్‌ను నిర్మించేందుకు తైవాన్ కేంద్రంగా పని చేస్తున్న బౌద్ధ సంస్థ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. అయితే, విదేశీ సంస్థలకు బుద్ధ వనంలో స్థలాల కేటాయింపుపై రాష్ట్రప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మలేషియా, తైవాన్ ప్రతినిధుల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై ఉన్నత స్థాయిలో సమీక్షించి, నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు అధికారవర్గాలు పేర్కొన్నాయి.
Updated Date - Aug 26 , 2024 | 04:43 AM