Mamunur Airport: మామునూరుకు మోక్షం!
ABN, Publish Date - Oct 25 , 2024 | 04:29 AM
వరంగల్ జిల్లాలోని మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణానికి గ్రహణం వీడనుంది. ఏళ్ల తరబడి కాగితాలకే పరిమితమైన ఈ విమానాశ్రయం నిర్మాణానికి మోక్షం లభించనుంది.
విమానాశ్రయం ఏర్పాటుకు తొలిగిన అడ్డంకి
150 కి.మీ.ల నిబంధనను పక్కన పెట్టటానికి జీఎమ్మార్ అంగీకారం
త్వరలో ప్రభుత్వానికి సమాచారం
పట్టాలెక్కనున్న పనులు.. మొత్తం 949 ఎకరాలు అవసరం
ఎయిర్‌పోర్టు నిర్మాణంతో వివిధ ప్రాంతాల అనుసంధానం
హైదరాబాద్, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): వరంగల్ జిల్లాలోని మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణానికి గ్రహణం వీడనుంది. ఏళ్ల తరబడి కాగితాలకే పరిమితమైన ఈ విమానాశ్రయం నిర్మాణానికి మోక్షం లభించనుంది. అక్కడ ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు ఇప్పటి వరకు ఆటంకంగా ఉన్న ‘150 కిలోమీటర్ల’ నిబంధనను పక్కనపెట్టటానికి జీఎమ్మార్ సంస్థ ఒప్పుకున్నట్టు అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఇదే విషయాన్ని అధికారికంగా త్వరలోనే ప్రభుత్వానికి తెలుపనున్నట్టు సమాచారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జీఎమ్మార్ సంస్థ నిర్మించింది. నిర్మాణ సమయంలో అప్పటి ప్రభుత్వంతో సంస్థ చేసుకున్న ఒప్పందం ప్రకారం.. శంషాబాద్ విమానాశ్రయానికి 150 కి.మీ.ల పరిధిలో 30 ఏళ్ల పాటు (2038 వరకూ) వాణిజ్య విమానాశ్రయాలను ఏర్పాటు చేయవద్దు.
దీని కారణంగానే శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు 150 కిలోమీటర్ల పరిధిలో కొత్త విమానాశ్రయాలేవీ ఏర్పాటు కాలేదు. అయితే, 2017లో కేంద్రం తీసుకొచ్చిన ‘ఉడో దేశ్‌కీ ఆమ్ నాగరిక్’ (ఉడాన్) పథకం కింద మామునూరు ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేయాలని గుర్తించారు. కానీ, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో ఎయిర్‌పోర్టు పనులు ముందుకు సాగలేదు. గతేడాది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత.. అనువైన ప్రాంతాల్లో విమానాశ్రయాలను ఏర్పాటు చేసేందుకు కసరత్తును ప్రారంభించింది. దీంట్లో భాగంగా.. జీఎమ్మార్ సంస్థతో పలుమార్లు చర్చలు జరపగా, 150 కి.మీ.ల షరతును పక్కనపెట్టటానికి సదరు సంస్థ అంగీకరించినట్లు తెలిసింది. వరంగల్ జిల్లాలో నిర్మించతలపెట్టిన మామునూరు ఎయిర్‌పోర్టు.. శంషాబాద్ విమానాశ్రయానికి 146-148 కి.మీ.లలోపే ఉండటం గమనార్హం. అయితే, జీఎమ్మార్ సుముఖతతో త్వరలోనే మామునూరు విమానాశ్రయ నిర్మాణ పనులు పట్టాలెక్కనున్నాయి.
నిజాం హయాంలోనే ఎయిర్‌పోర్టు
మామునూరులో 1930లో నిజాం హయాంలోనే విమానాశ్రయం ఏర్పాటు కాగా.. వివిధ కారణాలతో 1980లో అది మూతపడింది. ఆ తర్వాత కాలంలో అసలు అక్కడ ఎయిర్‌పోర్టు ఉందన్న విషయమే మరుగునపడింది. 2007లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రీజినల్ కనెక్టివిటీ స్కీం (ఆర్‌సీఎస్) కింద తెలంగాణలో ఆరు కొత్త విమానాశ్రయాల ఏర్పాటుతోపాటు, మామునూరు ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేయాలని అప్పటి ప్రభుత్వం ఎంవోయూ కూడా కుదుర్చుకుంది. కానీ, అభివృద్ధికి నోచుకోలేదు. ఈ క్రమంలోనే ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటు, ఇప్పటికే ఉన్న వాటి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. అయితే మామునూరు విమానాశ్రయాన్ని పూర్తిస్థాయి ప్రయాణాలకు అనువుగా అందుబాటులోకి తీసుకురావాలంటే భూసేకరణ అంశంతోపాటు ఇతర సాంకేతిక సమస్యలు ఉన్నాయి.
వీటిలో కీలకమైన 150 కి.మీ.ల సమస్య పరిష్కారానికి అడుగులు పడ్డాయి. ఇక విమానాశ్రయం ఏర్పాటుకు మొత్తం 949 ఎకరాలు అవసరం కాగా, ప్రస్తుతం ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా పరిధిలో 696.14 ఎకరాల భూమి ఉంది. మిగిలిన 253 ఎకరాలు సేకరించాల్సి ఉంది. కాగా, మామునూరు వి మానాశ్రయం నుంచి విమానాలు నడిపేందుకు అవసరమైన ఇన్‌స్ట్రుమెంటల్ ఫ్లైట్ రూల్స్ (ఐఎ్‌ఫఆర్), విజువల్ ఫ్లైట్ రూల్స్ (వీఎ్‌ఫఆర్) అనుమతుల కోసం రాష్ట్ర ఏవియేషన్ విభాగం కసరత్తు చేస్తోంది. ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే.. ఢిల్లీ సహా ఇతర ప్రాంతాలకు ఎయిర్ కనెక్టివిటీ పెరగడంతోపాటు.. పరిశ్రమల స్థాపనకు భారీస్థాయి కంపెనీలు ముందుకొచ్చే అవకాశంఉంది. తద్వారా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి.
Updated Date - Oct 25 , 2024 | 04:29 AM