Gummadidala: పట్టపగలు.. పాత పగ
ABN, Publish Date - Nov 15 , 2024 | 04:51 AM
పట్టపగలు అందరూ చూస్తుండగా తల్లి, ఆమె కుమారుడిని కత్తితో పొడిచి చంపేశాడో వ్యక్తి. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది.
సంగారెడ్డిలో తల్లీకొడుకు దారుణహత్య
బైక్‌పై వెళ్తుండగా కారుతో ఢీకొట్టి..
కత్తితో పొడిచి చంపిన యువకుడు
తన కొడుకు మృతికి కారణమనే.. మృతులు, నిందితుడు యూపీ వారే
గుమ్మడిదల, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): పట్టపగలు అందరూ చూస్తుండగా తల్లి, ఆమె కుమారుడిని కత్తితో పొడిచి చంపేశాడో వ్యక్తి. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. తన కుమారుడి మృతికి ఆ ఇద్దరూ కారణమనే అనుమానంతోనే అతడు ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టాడు. పోలీసుల కథనం ప్రకారం.. యూపీకి చెందిన నాగరాజు (30)... అదే రాష్ట్రానికి చెందిన సరోజ(50), ఆమె కుమారుడు అనిల్(30) మరో ముగ్గురు పిల్లలతో కలిసి బతుకుదెరువు కోసం గుమ్మడిదల మండలం బొంతపల్లికి వచ్చారు. కొన్నేళ్లుగా నాగరాజు, సరోజ కుటుంబాలు వీరభద్రనగర్‌లోని పక్కపక్క ఇళ్లలోనే ఉంటున్నారు.
నాగరాజు కుమారుడు (1) ఏడాది క్రితం నీటిసంపులో పడి చనిపోయాడు. తన బిడ్డ చావుకు సరోజు, ఆమె కుమారుడు అనిల్ కారణమని నాగరాజు భావించాడు. వారే తన బిడ్డను సంపులో పడేశారని అనుమానించి, అప్పటి నుంచి వారిపై పగ పెంచుకున్నాడు. గురువారం ఉదయం సరోజ గుడికి వెళ్లేందుకు కుమారుడు అనిల్‌తో కలిసి బైక్‌పై వెళ్తుండగా, ఇంటికీ సమీపంలోనే వారి కోసం కత్తితో ఎదురు చూస్తున్న నాగరాజు తన కారుతో బైక్‌ను ఢీ కొట్టాడు. వారు బైక్ ఆపి చూస్తుండగానే, నాగరాజు వెంట తెచ్చుకున్న కత్తితో ఇద్దరినీ పొడిచాడు. తీవ్రగాయాలతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. జిన్నారం సీఐ సుధీర్‌కుమార్, గుమ్మడిదల ఎస్సై మహేశ్వర్‌రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి నిందితుడు నాగరాజును అదుపులోకి తీసుకున్నారు.
Updated Date - Nov 15 , 2024 | 04:51 AM