Mancherial: మాఫీ తేల్చిన పంట రుణం స్వాహా లీల!
ABN, Publish Date - Aug 29 , 2024 | 04:42 AM
రైతులకు రుణాలు ఇచ్చినట్లుగా రికార్డుల్లో రాసేసి.. రైతుల ఖాతాల్లోంచి ఆ మొత్తాన్ని తామే స్వాహా చేసిన అధికారుల నిర్వాకం బట్టబయలైంది.
30 మంది రైతుల పేర్లతో రుణాలు..18లక్షలు విత్ డ్రా
రుణమాఫీ మెసేజ్‌లు రావడంతో రైతుల షాక్
ప్రజావాణిలో ఫిర్యాదు.. విచారణకు కలెక్టర్ హుకం
మంచిర్యాల, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): రైతులకు రుణాలు ఇచ్చినట్లుగా రికార్డుల్లో రాసేసి.. రైతుల ఖాతాల్లోంచి ఆ మొత్తాన్ని తామే స్వాహా చేసిన అధికారుల నిర్వాకం బట్టబయలైంది. మంచిర్యాల జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం (సీఏసీఎస్) సీఈవో లీల ఇది! ఒక్క రైతు నుంచి కాదు.. మొత్తంగా 18 మంది పేరు మీద పంట రుణాల పేరుతో రూ.30లక్షలు స్వాహా చేసినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. జిల్లాలోని హాజీపూర్ మండలం ముల్కల్లకు చెందిన రైతు సిరిపెల్లి బాపు మంచిర్యాలలోని ఏడీసీసీ బ్యాంకులో 2015లో పంట రుణం కింద రూ. 65వేలు తీసుకుని 2019 నవంబరులో తిరిగి చెల్లించాడు.
2023లో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం రూ.లక్ష రుణమాఫీ చేయడంతో బాపు పేరిట రూ. 67 వేలు బ్యాంకులో జమయ్యాయి. అప్పటి నుంచి ఆ రైతు ఎలాంటి పంట రుణమూ తీసుకోలేదు. ఆయనకు ఆగస్టు 2న రూ. 1,10,515 మాఫీ అయినట్లు ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. ముల్కల్లకు చెందిన మరో రైతు కందుల లక్ష్మయ్యకూ ఇదే అనుభవం ఎదురైంది. బాపు, లక్ష్మయ్య.. వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించడంతో ఇద్దరికీ రుణమాఫీ అయినట్లు చెప్పారు. అనంతరం ఆ రైతులు.. పీఏసీఎస్ సీఈవో పెంట సత్యనారాయణ వద్దకు వెళ్లి ప్రశ్నించారు.
అవి ఫేక్ మెసేజ్‌లంటూ...ఈవిషయం ఎవరికీ చెప్పొద్దని, అధికారులకు ఫిర్యాదు కూడా చేయొద్దని బతిమాలుకున్నాడు. ఆయన తీరును అనుమానించిన రైతులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్.. విచారణ జరిపి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కో ఆపరేటివ్ సొసైటీ అధికారులను ఆదేశించారు. విచారణ చేపట్టిన అధికారులు పెద్ద మొత్తంలో అక్రమాలను గుర్తించినట్లు సమాచారం. జిల్లాలోని ఇతర సహకార బ్యాంకుల్లోనూ ఇదే తంతు జరిగినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - Aug 29 , 2024 | 04:42 AM