Mandakrishna Madiga : ప్రాణత్యాగాల ఫలితం
ABN, Publish Date - Aug 14 , 2024 | 05:32 AM
ఎస్సీ వర్గీకరణ కోసం ప్రాణాలర్పించిన వారి కంటే తమ శ్రమ గొప్పది కాదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. వర్గీకరణ కోసం తెల్లబండ్ల రవి మొట్టమొదల ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. బిడ్డల ప్రాణ త్యాగాలకు నేడు ఫలితం దక్కిందన్నారు.
సుప్రీంకోర్టు తీర్పు ద్వారా మాదిగ జాతి గెలిచింది
30 ఏళ్ల పోరాటం ఫలించింది: మందకృష్ణ
తీర్పు తరువాత తొలిసారి హైదరాబాద్‌కు..
ఎమ్మార్పీఎస్ శ్రేణుల ఘన స్వాగతం
నగరంలో భారీ విజయోత్సవ ర్యాలీ
కవాడిగూడ /బర్కత్‌పుర/రెజిమెంటల్‌బజార్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ వర్గీకరణ కోసం ప్రాణాలర్పించిన వారి కంటే తమ శ్రమ గొప్పది కాదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. వర్గీకరణ కోసం తెల్లబండ్ల రవి మొట్టమొదల ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. బిడ్డల ప్రాణ త్యాగాలకు నేడు ఫలితం దక్కిందన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన అనంతరం ఢిల్లీ నుంచి తొలిసారి హైదరాబాద్‌కు చేరుకున్న మందకృష్ణ మాదిగకు జంట నగరాలతోపాటు వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిని ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి క్లాక్‌టవర్, ప్యాట్నీ, బైబిల్ హౌస్, ట్యాంక్‌బండ్ మీదుగా బషీర్‌బాగ్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కళాకారుల నృత్యాలు, డప్పుల చప్పుళ్లతో విజయోత్సవ ర్యాలీ హోరెత్తింది. క్లాక్‌టవర్ వద్ద భారీ గజమాలతో మందకృష్ణ మాదిగను సత్కరించారు. ఎమ్మార్పీఎస్ శ్రేణులు దారి పొడవునా బాణసంచా కాల్చుతూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ర్యాలీ.. రాణిగంజ్ ట్యాంక్‌బండ్ మీదుగా లోయర్ ట్యాంక్‌బండ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నాక.. అక్కడ అంబేడ్కర్ విగ్రహానికి మందకృష్ణ మాదిగ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
తిరిగి అక్కడి నుంచి ప్రారంభమైన ర్యాలీ బషీర్‌బాగ్‌లోని బాబు జగ్జీవన్‌రాం విగ్రహం వద్దకు చేరుకుంది. ఇక్కడ ఏర్పాటు చేసిన సభలో మందకృష్ణ మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారాలు రాష్ట్రానికే ఉన్నాయని, వాటిని అమలు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని తెలిపారు.
ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. ‘‘30 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో మా న్యాయమైన పోరాటానికి మీడియా మద్దతిచ్చింది. జాతీయ అంశమైన ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేశాం. సుప్రీంకోర్టు తీర్పు ద్వారా మాదిగజాతి గెలిచిందని స్పష్టంగా అర్థమైంది’’ అని మందకృష్ణ మాదిగ అన్నారు. ఈ సభలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖ ప్రొఫెసర్ కాశీం, ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు నాగరాజుతోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు.
Updated Date - Aug 14 , 2024 | 07:02 AM