Shamirpet: ‘ఇల్లెందు’ కౌన్సిల్ భేటీలో డిష్యుం.. డిష్యుం!
ABN, Publish Date - Jun 30 , 2024 | 03:45 AM
ఇల్లెందు మునిసిపాలిటీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. శనివారం నిర్వహించిన కౌన్సిల్ భేటీలోనే చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరావు వైస్ చైర్మన్ ఎస్‌డీ జానీపాషాల మధ్య ఘర్షణ జరిగి పరస్పర దాడులు చేసుకున్నారు.
ఎమ్మెల్యే కోరం సమక్షంలోనే కొట్టుకున్న చైర్మన్, వైస్ చైర్మన్
‘తూంకుంట’ భేటీలో చైర్మన్, వైస్ చైర్‌పర్సన్‌పై కౌన్సిలర్ల దాడి
ఇల్లెందు/శామీర్‌పేట, జూన్ 29: ఇల్లెందు మునిసిపాలిటీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. శనివారం నిర్వహించిన కౌన్సిల్ భేటీలోనే చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరావు వైస్ చైర్మన్ ఎస్‌డీ జానీపాషాల మధ్య ఘర్షణ జరిగి పరస్పర దాడులు చేసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య సమక్షంలోనే అధికార కాంగ్రె్‌సకు చెందిన ఇద్దరు ప్రజా ప్రతినిధులు తీవ్రంగా దుర్భాషలాడుతూ కొట్టుకోవడం గమనార్హం. కౌన్సిల్ సమావేశంలో అజెండా అంశాలపై జరుగుతున్న చర్చల్లో ప్రతి అంశంపై వైస్ చైర్మన్ జానీ జోక్యం చేసుకోవడంతో విసిగిపోయిన చైర్మన్ డీవీ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జానీ.. చైర్మన్ డీవీపై వ్యక్తిగత దూషణలు చేయడంతో ఆగ్రహించిన ఆయన జానీపై మొదట దాడి చేసినట్లు సమాచారం. చివరకు తోటి కౌన్సిలర్లతోపాటు ఎమ్మెల్యే కోరం వారిద్దరినీ సముదాయించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
తూంకుంటలో చైర్మన్, వైస్‌చైర్‌పర్సన్‌పై దాడి
ఇటు తూంకుంట మునిసిపల్ సర్వసభ్య సమావేశంలోనూ సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. అయితే ఇక్కడ మునిసిపల్ చైర్మన్, వైస్ చైర్‌పర్సన్‌పై నిధుల సాకుతో పలువురు కౌన్సిలర్లు దాడికి పాల్పడ్డారు. తూంకుంట మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ రాజేశ్వర్‌రావు అధ్యక్షతన ఉదయం భేటీ మొదలు కాగానే.. కౌన్సిలర్ సింగిరెడ్డి మధుసూదన్‌రెడ్డి, సింగిరెడ్డి రజిని భర్త సింగిరెడ్డి వేణుగోపాల్‌రెడ్డి, వారి మద్దతు కౌన్సిలర్లు, అనుచరులతో సమావేశం హాల్‌లోకి ప్రవేశించి వీరంగం సృష్టించారు. అభివృద్ధి నిధుల కేటాయింపులపై చైర్మన్ రాజేశ్వర్‌రావు, వైస్ చైర్‌పర్సన్ వాణివీరారెడ్డిలను నిలదీశారు. వారిని దుర్బాషలాడుతూ వారిపైకి కుర్చీలు విసరగా వైస్‌చైర్‌పర్సన్ వాణి తలకు గాయమైంది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, గతంలో అవిశ్వాస తీర్మానం విషయమై కౌన్సిలర్లు మనసులో పెట్టుకుని ఈ దాడులకు పాల్పడినట్లు సమాచారం.
Updated Date - Jun 30 , 2024 | 03:45 AM