Minister Jupalli: మీ వల్ల సర్కారుకు చెడ్డపేరొస్తోంది!
ABN, Publish Date - Jun 19 , 2024 | 07:36 AM
తెలంగాణ బేవరేజ్ కార్పొరేషన్ తప్పుడు నిర్ణయాల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupalli Krishna Rao) అన్నారు. కీలకమైన బాధ్యతల్లో ఉన్నవారు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాలని, సొంత నిర్ణయాలు తగవని అధికారులను హెచ్చరించారు.
- ప్రభుత్వ అనుమతి లేకుండా సొంత నిర్ణయాలా?
- మద్యం కంపెనీల విధానాలను ఎలా ఖరారు చేస్తారు?
- విచారణ జరిపి సమగ్ర నివేదిక సమర్పించండి
- అధికారులకు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి ఆదేశం
హైదరాబాద్: తెలంగాణ బేవరేజ్ కార్పొరేషన్ తప్పుడు నిర్ణయాల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupalli Krishna Rao) అన్నారు. కీలకమైన బాధ్యతల్లో ఉన్నవారు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాలని, సొంత నిర్ణయాలు తగవని అధికారులను హెచ్చరించారు. ఎక్సైజ్ శాఖ ప్రధాన కార్యాలయంలో మంత్రి నాలుగు గంటల పాటు అధికారులతో సమీక్షించారు. ఇటీవల ఎక్సైజ్ శాఖలో చోటుచేసుకున్న పరిణామాలపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మద్యం కంపెనీల అనుమతుల విషయంలో జరిగిన పరిణామాలను మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. మద్యం కంపెనీల అనుమతుల విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురాకుండా బేవరేజ్ కార్పొరేషన్ అధికారులే విధివిధానాలను ఎలా ఖరారు చేస్తారని మండిపడ్డారు.
దీనిపై సంజాయిషీ ఇవ్వాలని, విచారణ జరిపి సమగ్ర నివేదికను సమర్పించాలని ఎక్సైజ్ శాఖ కమిషనర్, ఎండీ శ్రీధర్, జీఎం అబ్రహాంను మంత్రి ఆదేశించారు. నివేదికను బట్టి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అధికారుల సొంత నిర్ణయాల వల్ల ఎక్సైజ్ శాఖ ప్రతిష్ఠకు భంగం కలిగిందని, దీనివల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని చెప్పారు. కాగా, మాదక ద్రవ్యాలు, గంజాయి, అక్రమ మద్యం, కల్తీ కల్లు, గుడుంబా తయారీ, సరఫరా, అమ్మకాలపై నిరంతరం నిఘా పెట్టాలని మంత్రి జూపల్లి ఆదేశించారు. అక్రమ మద్యం తయారీ, సరఫరాదారులు, విక్రేతల నెట్‌వర్క్ సమాచారాన్ని తయారు చేయాలని మంత్రి ఆదేశించారు.
ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News
Updated Date - Jun 19 , 2024 | 07:36 AM