అమృత్ టెండర్లు ఖరారు చేసింది బీఆర్‌ఎస్సే!
ABN, Publish Date - Nov 13 , 2024 | 05:36 AM
అమృత్ 2.0 టెండర్లలో అవినీతి గురించి కేటీఆర్ మాట్లాడడం ఈ శతాబ్దపు పెద్ద జోక్ అని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
వాటిపై కేటీఆర్ మాట్లాడడం ఈ శతాబ్దపు పెద్ద జోక్
ఆయన తెచ్చింది నకిలీ ఫార్ములా ఈ రేస్.. అదో స్కాం
దాన్నుంచి తప్పించమని షాను కోరేందుకే ఢిల్లీ వెళ్లారు
అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర మంత్రులను కలవలేదేం?
అప్పుడు చేతకాక ఇప్పుడు కొత్త నాటకం ఆడుతున్నారు..
ప్రతిపక్షంలోకి మారాక ప్రజాస్వామ్యం గుర్తుకు వచ్చిందా?
ప్రశ్నించిన మంత్రి కోమటి రెడ్డి
హైదరాబాద్, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): అమృత్ 2.0 టెండర్లలో అవినీతి గురించి కేటీఆర్ మాట్లాడడం ఈ శతాబ్దపు పెద్ద జోక్ అని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తాము అధికారంలోకి వచ్చే నాటికే టెండర్లు ఖరారైనట్లు వివరించారు. అమృత్ 2.0 పనులకు రీ టెండర్ పిలిచేలా చేసిందే కేటీఆర్ అని ఆరోపించారు. తేజా రాజుకు చెందిన గజా కన్‌స్ట్రక్షన్స్‌కు అమృత్-1 టెండర్లు ఇచ్చింది కేటీఆర్ కాదా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో మంగళవారం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రతిమా శ్రీనివా్‌సరావు, మేఘా కంపెనీకి టెండర్లు ఇచ్చింది కేసీఆర్ కాదా అని నిలదీశారు. రూ.21 వేల కోట్ల విలువైన కాళేశ్వరం పనులను ఆస్పత్రులు నిర్వహించే ప్రతిమా శ్రీనివా్‌సరావుకు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. సుజన్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి తోక చుట్టం అని, కల్వకుంట్ల కవితకు వ్యాపార భాగస్వామి అని కోమటిరెడ్డి చెప్పారు. నీటి పారుదల శాఖలో టన్నెల్ పనులు వారే చేశారని, ఆ విషయంపై కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కేటీఆర్ తెచ్చింది అసలైన ఫార్ములా ఈ కాదని.. అది పెద్ద నకిలీ అని కోమటిరెడ్డి ఆరోపించారు. ఫార్ములా ఈ రేస్‌కు రూ.55 కోట్ల కేటాయింపుపై ఏసీబీ కేసు నమోదు, విచారణకు గవర్నర్ అనుమతి కోరడంతో కేటీఆర్‌లో భయం పుట్టిందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు సహకరించినందుకు తనను ఫార్ములా ఈ కుంభకోణం నుంచి తప్పించమని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలిసేందుకే ఢిల్లీ వెళ్లాడని పేర్కొన్నారు. ఫెమా, ఆర్‌బీఐ నిబంధనలు ఉల్లంఘించి కోట్ల రూపాయలను డాలర్లుగా మార్చి కన్సల్టెన్సీల కడుపు నింపాడని, హైదరాబాద్ పేరు చెప్పి అడ్డగోలు దోపిడీకి తెరతీసిన దోపిడీరావు కేటీఆర్ అని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో కేటీఆర్‌ను ఎవరూ పట్టించుకోరని.. మంత్రిగా ఉన్నప్పుడు మోడీ లేదు బోడీ లేదు అన్న ఆయనకు ఇప్పుడు ప్రజాస్వామ్యం గుర్తొచ్చిందా? అని నిలదీశారు. అధికారంలో ఉండగా రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర మంత్రులను కలవడం చేతగాని కేటీఆర్, కేసుల మాఫీ కోసం కొత్త నాటకానికి తెరతీశారని అన్నారు.ఆర్‌ఆర్‌ఆర్ మంజూరై ఏళ్లు గడిచినా కేంద్ర మంత్రి గడ్కరీని ఒక్కసారి కూడా ఎందుకు కలవలేదన్నారు. గిరిజనులు, ఆదివాసీల సంక్షేమం కోసం పని చేసిన ఐఏఎస్ అధికారి ప్రతీక్‌జైన్‌పై దాడి బీఆర్‌ఎస్ మానసిక స్థితికి నిదర్శనమని కోమటిరెడ్డి అన్నారు. ఇప్పుడు భూ సేకరణ గురించి మాట్లాడుతున్నవారు.. బీఆర్‌ఎస్ హయాంలో 14 వేల ఎకరాలను ఫార్మా సిటీ కోసం సేకరించినప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. అధికారంలో ఉంటే రాళ్లు విసరడం, లేకపోతే కాళ్లు పట్టుకోవడం కేసీఆర్ కుటుంబానికి అలవాటేనని వ్యాఖ్యానించారు.
Updated Date - Nov 13 , 2024 | 05:37 AM