Minister Seetakka: మూసీ నిర్వాసితులను ఆదుకుంటాం
ABN, Publish Date - Oct 19 , 2024 | 04:30 AM
మూసీ నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, స్వచ్ఛమైన గాలి, నీరు కల్పించడంతో పాటు ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు.
స్వచ్ఛమైన గాలి, నీరు, ఉపాధి కల్పిస్తాం .. నిర్వాసితులకు చెక్కుల పంపిణీలో సీతక్క
హైదరాబాద్ సిటీ, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): మూసీ నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, స్వచ్ఛమైన గాలి, నీరు కల్పించడంతో పాటు ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. ఉన్న ఊరు, ఇళ్లను వదులుకోవాలంటే ఎవ్వరికైనా బాధ ఉంటదని, ఆ ప్రాంతంతో ఉన్న అనుబంధం వీడదీయలేనిదని మంత్రి సీతక్క అన్నారు. వానొచ్చినా.. వరదొచ్చినా భయంతో బతుకుతున్న పరిస్థితి నుంచి వారిని బయటపడేసేందుకు మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును చేపట్టామని తెలిపారు. శుక్రవారం ప్రజాభవన్‌లో సీతక్క.. మూసీ పరివాహక ప్రాంతాల స్వయం సహాయక సంఘాలకు చెందిన 172 మంది మహిళలకు రూ.3.44 కోట్ల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మూసీలో చెత్త, మురుగు చేరి దుర్గంధం వస్తోందని, అక్కడే ఉంటూ ఆ గాలి పీల్చుతున్నందున అనారోగ్య సమస్యలు వస్తున్నాయని అన్నారు. మూసీ పరివాహక ప్రాంత మహిళా సంఘాలకు 17 రకాలు అవకాశాలు కల్పిస్తామని, కుట్టుమిషన్లు అందించి ఉపాధి కల్పిస్తామని తెలిపారు.
స్కూల్ డ్రెస్‌లు కుట్టడానికి మూసీ నిర్వాసితులకు ప్రథమ ప్రాధాన్యమిస్తామన్నారు. పిల్లలకు గురుకులలో ఉచితంగా అడ్మిషన్ కల్పిస్తామని హామీనిచ్చారు. బాధిత మహిళలకు రూ. 2 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నామని, అందులో రూ. 1.40 లక్షలు సబ్సిడీగా ఉంటాయని, మిగిలిన రూ. 60 వేల రూపాయలు మూడు సంవత్సరాల్లో చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. పునరావాసం పొందిన బాధిత కుటుంబాలకు ఉచిత విద్య, అంగన్వాడీ కేంద్రాలలో ప్రవేశం, అలాగే రెండు పడకల గదుల నిర్మాణం ఉచితంగా అందించామని చెప్పారు. మలక్‌పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బిన్ బలాల మాట్లాడుతూ... మూసీ నిర్వాసితులకు పిల్లి గుడిసె 2బీహెచ్‌కె కాలనీలో 130 కుటుంబాలకు పునరావాసం కల్పించామని తెలిపారు. కాగా, చెక్కుల పంపిణీ కార్యక్రమం కోసం నిర్వాసితులను ఉదయం 11 గంటలకే ప్రజాభవన్‌కు తీసుకొచ్చారు. కానీ, రెండు గంటలు ఆలస్యంగా కార్యక్రమాన్ని నిర్వహించడంతో నిర్వాసితులు ఇబ్బందులు పడ్డారు.
Updated Date - Oct 19 , 2024 | 04:30 AM