Minister Sitakka: ఆదివాసి గూడేల అభివృద్ధే నిజమైన ప్రగతి
ABN, Publish Date - Aug 09 , 2024 | 09:51 AM
దేశంలోని మారుమూల ప్రాంతాలు, ఆదివాసీ గూడేల అభివృద్ధి జరిగినప్పుడే నిజమైన ప్రగతి అని మంత్రి సీతక్క(Minister Sitakka) అన్నారు.
- డా.బి.ఆర్ అంబేడ్కర్ వర్సిటీ సదస్సులో మంత్రి సీతక్క
హైదరాబాద్ సిటీ: దేశంలోని మారుమూల ప్రాంతాలు, ఆదివాసీ గూడేల అభివృద్ధి జరిగినప్పుడే నిజమైన ప్రగతి అని మంత్రి సీతక్క(Minister Sitakka) అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, పొలిటికల్ సైన్స్ విభాగం, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో గురువారం ‘‘ఆదివాసీ జీవనోపాధి పద్ధతులు: సాధికారత సాధనలో సమస్యలు, వ్యూహాలు’’ అనే ఆంశంపై నిర్వహిస్తున్న రెండురోజుల అంతర్జాతీయ సదస్సును సీతక్క గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొన్ని దశాబ్దాలుగా సమాజం ఒకవైపే అభివృద్ధి చెందుతోందని, గ్రామీణ ప్రాంతం, ముఖ్యంగా ఆదివాసీలు నివసించే ప్రాంతాల్లో అభివృద్ధి అంతగా జరగట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఏజెన్సీ ఏరియాలో అడవుల పెంపకంపై దృష్టిపెట్టాల్సిన బాధ్యత అటు ప్రభుత్వాలపై ఇటు సమాజంపై ఉందని మంత్రి అన్నారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ మాజీ డీన్ ప్రొఫెసర్ జి.హరగోపాల్ మాట్లాడుతూ ఎప్పటికప్పుడు వచ్చే సమస్యలను పరిష్కరించడానికి ఆదివాసీ గ్రామాలను సందర్శించినట్లు తెలిపారు. ఏ అభివృద్ధి నమూనాలోనైనా ఆదివాసీలు వెనకంజలోనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి పేరుతో ఆదివాసీలు నిర్వాసితులవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివాసీల పలు సమస్యలపై కాన్ఫరెన్స్‌లో చర్చించి సరైన సిఫార్సులతో ప్రభుత్వానికి నివేదిక అందించాలని నిర్వాహకులకు ఆయన సూచించారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ర్టార్ ప్రొఫెసర్ ఇ.సుధారాణి, విశ్వవిద్యాలయ అకడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ జి.పుష్పా చక్రపాణి, సదస్సు డైరెక్టర్ ప్రొఫెసర్ గుంటి రవీందర్, సామాజిక శాస్త్రం విభాగ డీన్ ప్రొఫెసర్ వడ్డాణం శ్రీనివాస్, సదస్సు కో డైరెక్టర్ ప్రొఫెసర్ జి.లక్ష్మి, పలు విభాగాల అధిపతులు, డీన్లు, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు తీసుకొస్తాం
రాంనగర్: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి ఉత్తమ ఫలితాలు తీసుకొస్తామని మంత్రి సీతక్క(Minister Sitakka) పేర్కొన్నారు. తెలంగాణ బాలోత్సవం సంస్థ ఆధ్వర్యంలో గురువారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో 10/10 జీపీఏ సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేశారు. బాలోత్సవం సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు భూపతి వెంకటేశ్వర్లు, ఎం.సోమయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో విధ్వంసానికి గురైన విద్యా వ్యవస్థను పటిష్ఠం చేయడానికి సీఎం రేవంత్‌రెడ్డి చర్యలు చేపట్టారని, ఇందులో భాగంగానే విద్యా వ్యవస్థకు బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించామన్నారు. కార్యక్రమంలో ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ, విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి: Cyber criminals: నగరంలో.. ఆగని సైబర్ మోసాలు..
ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్ హాస్టల్..
ఇదికూడా చదవండి: Offensive Video: బిత్తిరి సత్తిపై సైబర్ క్రైంలో కేసు నమోదు..
Read Latest Telangana News and National News
Updated Date - Aug 09 , 2024 | 09:53 AM