Minister Sitakka: గత సర్కారు నిర్వాకంతోనే.. పంచాయతీలకు ఇక్కట్లు
ABN, Publish Date - Aug 08 , 2024 | 10:55 AM
గత ప్రభుత్వ నిర్వాకంవల్లే గ్రామ పంచాయతీలకు ఇక్కట్లు ఎదురవుతున్నాయని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడే హక్కు వారికి లేదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క(Minister Sitakka) ధ్వజమెత్తారు.
- మీ హయాంలో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు..
- హరీశ్ మర్చిపోయారా?: మంత్రి సీతక్క
హైదరాబాద్: గత ప్రభుత్వ నిర్వాకంవల్లే గ్రామ పంచాయతీలకు ఇక్కట్లు ఎదురవుతున్నాయని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడే హక్కు వారికి లేదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క(Minister Sitakka) ధ్వజమెత్తారు. స్వచ్ఛదనం, పచ్చదనం కార్యక్రమంలో కనీసం పాల్గొనకుండా రాజకీయాలు చేయడం హరీశ్‌రావు(Harish Rao)కు తగదన్నారు. ‘పదే పదే అబద్ధాలు చెబితే ప్రజలు నమ్మరు. మీ ప్రభుత్వ హయాంలోనే సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకున్న విషయం మర్చిపోయారా?’ అని నిలదీశారు.
ఇదికూడా చదవండి: Former MLA: ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే పీడీ యాక్ట్ పెట్టిస్తా..
ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్‌రావు(Former Minister Harish Rao) చేసిన వ్యాఖ్యలను బుధవారం మంత్రి సీతక్క ఓ ప్రకటనలో ఖండించారు. గత పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు రూ.10,170 కోట్లు కేటాయించి రూ.5,988కోట్లే విడుదల చేసిందన్నారు. పంచాయతీలకు 44శాతం నిధులివ్వకుండా గత ప్రభుత్వం సొంత అవసరాలకు వాడుకుందని ఆరోపించారు. నేషనల్ రూర్బన్ (రూరల్ అర్బన్) మిషన్‌కు 2019 నుంచి బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయేనాటికి రూ.1,200 కోట్లు చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టిందన్నారు. స్వచ్ఛ భారత్‌మిషన్(Swachh Bharat Mission) కింద చేయించిన పనులకు సంబంధించి ఆరేళ్లుగా రూ.940 కోట్లు, రూరల్ ఇంజనీరింగ్ విభాగానికి రూ.600కోట్ల బిల్లులు చెల్లించలేదన్నారు.
బీఆర్‌ఎస్(BRS) ప్రభుత్వం 2018 నూతన పంచాయతీ చట్టం ద్వారా అడ్వర్‌టైజింగ్, మైనింగ్ వంటి పన్నులను పంచాయతీలకు రాకుండా చేసిందని, పంచాయతీలను ఆదుకోకపోగా ఆర్థికంగా మరింత దెబ్బతీశారని ఆమె ఆరోపించారు. బీఆర్‌ఎస్ హయాంలో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల ప్రకారం పంచాయతీలకు నిధులు కేటాయించలేదన్నారు. కేసీఆర్ జన్మదినం కోసం ఫిబ్రవరిలో మొక్కలు నాటించారని విమర్శించారు. కాగా మూడు రోజుల్లోనే 25 లక్షల మొక్కలు నాటించామని, 29 వేల కిలోమీటర్ల రహదారులు, 18 వేల కిలోమీటర్లకుపైగా డ్రైనేజీ కాలువలను శుభ్రపరిచామని, ఇది బీఆర్‌ఎస్ నేతలకు కనబడటంలేదని సీతక్క పేర్కొన్నారు.
ఇదికూడా చదవండి: Cyber criminals: నగరంలో.. ఆగని సైబర్ మోసాలు..
ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్ హాస్టల్..
ఇదికూడా చదవండి: Offensive Video: బిత్తిరి సత్తిపై సైబర్ క్రైంలో కేసు నమోదు..
Updated Date - Aug 08 , 2024 | 10:55 AM