Tummala : కౌలు రైతు, యజమాని మాట్లాడుకోవాలి..
ABN, Publish Date - Sep 20 , 2024 | 04:33 AM
రైతు భరోసాపై కౌలు రైతు, భూ యాజమాని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
‘రైతు భరోసా’పై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల
కొత్తగూడెంలో విమానాశ్రయంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి వినతి
ఢిల్లీలో ప్రపంచ ఆహార సదస్సుకు హాజరై.. వ్యాపారవేత్తలతో సమావేశమైన తుమ్మల
రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని ఆహ్వానించిన మంత్రి
న్యూఢిల్లీ/ఖమ్మం, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): రైతు భరోసాపై కౌలు రైతు, భూ యాజమాని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలో పంట పండించే రైతులకే రైతుభరోసా (రైతుబంధు) ఇవ్వాలన్నదే తమ ప్రభుత్వ ఆలోచన అని చెప్పారు. గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పంట ఎవరైతే పండిస్తారో వారికే ఆర్థిక చేయూత ఇవ్వాలని అందరూ చెబుతున్నారన్నారు. ఏపీలో మాదిరిగా కౌలు రైతు ఒప్పందాలు తెలంగాణలో లేవని, ఇక్కడి భూ చట్టాలు వేరు, ఏపీలో ఉన్న చట్టాలు వేరని అన్నారు.
ఇటీవల వరదలతో వ్యవసాయ భూముల్లో గండ్లు పడినా, ఇసుక మేటలు వేసినా నష్టపరిహారాన్ని భూ యాజమానులు తీసుకోవాలని, పంట నష్టం మాత్రమే జరిగితే కౌలు రైతుకు ఇవ్వాలని చెప్పామని తుమ్మల తెలిపారు. రైతుబంధుపై సీలింగ్ విధించడంపై ఇంకా తుదినిర్ణయం తీసుకోలేదన్నారు. రెండు లక్షల రూపాయల్లోపు పంట రుణాలు ఉన్న 22 లక్షల మంది రైతులకు రూ.18 వేల కోట్లు మాఫీ చేశామన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్ల పాటు రైతులకు రుణమాఫీ చేయకుండా ఎన్నికల కోడ్ వచ్చే ముందు ఓఆర్‌ఆర్‌ను తాకట్టు పెట్టి.. 20 లక్షల మంది రైతులకే రుణమాఫీ చేసిందన్నారు. రాష్ట్రంలో వచ్చే పంటకాలం నుంచి అన్ని పంటలకు ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లిస్తుందన్నారు. దీనికి దాదాపు రూ.3 వేల కోట్లు ఖర్చు కావచ్చని తుమ్మల తెలిపారు.
కేంద్ర మంత్రులను కలిసిన తుమ్మల
రాష్ట్ర సమస్యలతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై మంత్రి తుమ్మల గురువారం ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. ఇటీవల ఖమ్మం జిల్లాకు వచ్చిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను కలిసిన తుమ్మల.. ఆయిల్‌పామ్ దిగుమతి సుంకాన్ని పెంచినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ టన్నుకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) రూ.20 వేలు ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల రాష్ట్రంతో పాటు ఖమ్మం జిల్లాలో జరిగిన వరద నష్టాన్ని ప్రత్యక్షంగా చూసినందున కేంద్ర నుంచి ఇతోధికంగా సహాయం అందించాలని కోరారు. తెలంగాణకు కొబ్బరి పరిశోధన బోర్డు మంజూరు చేయాలని, అశ్వారావుపేటలో హార్టికల్చర్ ఎక్స్‌లెన్స్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు.
శివరాజ్ సింగ్ స్పందిస్తూ ఆయిల్‌పామ్ ఎంఎస్పీ నిర్ణయంపై సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వరద నష్టంపై నివేదిక రాగానే సహాయం అందిస్తామని తెలిపారు. మంత్రి తుమ్మల కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడిని కూడా కలిశారు. కొత్తగూడెంతో పాటు వరంగల్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్‌లో విమానాశ్రయాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. కొత్తగూడెం ఎయిర్‌పోర్టుకు భూములు, ఇతర వనరులు అందుబాటులో ఉంటే వెంటనే మంజూరు చేస్తామని, త్వరలోనే ఒక బృందాన్ని పంపుతామని హామీ ఇచ్చారు. కేంద్ర ఆహార శుద్ధి శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్‌ను కూడా తుమ్మల కలిసి తెలంగాణలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుతో పాటు బుగ్గపాడులోని యూనిట్‌కు సహకారం అందించాలని కోరారు.
వ్యాపారవేత్తలతో భేటీ
ఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న ప్రపంచ ఆహార సదస్సులో మంత్రి తుమ్మల పాల్గొన్నారు. ఈ సందర్భంగా లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ, మోనిన్ ఇండియా ఎండీ జెర్మైన్ అరౌద్, బీఎల్ అగ్రో ఎండీ నవనీత్ రవికర్‌తో పాటు పలు ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో అవకాశాలను వివరించి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపించాలని ఆహ్వానించారు. తెలంగాణ పెవిలియన్‌లో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. అలాగే లీలా ప్యాలెస్ హోటల్‌లో డెలాయిట్ ఇండియా నిర్వహించిన సదస్సుకు మంత్రి తుమ్మల హాజరై ‘వికసిత్ తెలంగాణ’ అంశంపై ప్రసంగించారు.
Updated Date - Sep 20 , 2024 | 04:33 AM