Kiran Kumar Reddy: మూసీ ప్రక్షాళనతోనే భావితరాలకు మనుగడ
ABN, Publish Date - Oct 28 , 2024 | 04:45 AM
మూసీ నదిని ప్రక్షాళన చేస్తేనే భావితరాలకు మనుగడ ఉంటుందని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మూసీ ప్రక్షాళనకు మద్దతుగా యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు
దీనికయ్యే ఖర్చు పర్యాటకంతో తిరిగొస్తుంది
వ్యతిరేకించే బీఆర్‌ఎస్, బీజేపీ నేతలను గ్రామాల్లోకి రాకుండా తరిమికొట్టాలి
మూసీ పునరుజ్జీవానికే భగీరథ యత్నం
భువనగిరి ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి
మానాయికుంటలో రైతుల సమ్మేళనం
మోత్కూరు/శాలిగౌరారం, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): మూసీ నదిని ప్రక్షాళన చేస్తేనే భావితరాలకు మనుగడ ఉంటుందని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మూసీ ప్రక్షాళనకు మద్దతుగా యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం మానాయికుంటలోని మూసీ వంతెనపై తుంగతుర్తి ఎమ్మెల్యే సామేలు అధ్యక్షతన నిర్వహించిన రైతుల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యేలు మందుల సామేల్, వేముల వీరేశంతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ ప్రక్షాళనను బీఆర్‌ఎస్, బీజేపీలు రాజకీయ కుట్రతో అడ్డుకోవడానికి చేస్తున్న ప్రయత్నాన్ని విరమించుకోవాలన్నారు. భావితరాల మనుగడ కోసం ఆత్మవిమర్శ చేసుకుని ప్రక్షాళనకు మద్దతుగా ఉండాలన్నారు.
ప్రభుత్వం చేస్తున్నది మూసీ నది సుందరీకరణ కాదని, మూసీ పునరుజ్జీవం కోసం, మూసీ మురికి నుంచి ప్రజలను విముక్తి చేయడానికి భగీరథ ప్రయత్నం చేస్తోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చేలా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతుంటే దరిద్రపు ఆలోచనలతో బీఆర్‌ఎస్, బీజేపీ విషప్రచారం చేస్తున్నాయన్నారు. సోషల్ మీడియాలో చిల్లర ప్రసంగాలు, ప్రచారాలు మానుకోవాలన్నారు. తాము ముగ్గురం ఈ ప్రాంతానికి చెందినవారమేనని, తమ చిన్నతనంలో మూసీలో చెలిమెలు తీసుకుని మంచినీరు తాగేవారమని, ఈ నీటిలో ఈత కొట్టేవారమని, ఇప్పుడు దుస్తులు కూడా ఉతకలేని దుస్థితి ఏర్పడిందన్నారు. అందుకే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మూసీ ప్రక్షాళనకు సిద్ధమయ్యారన్నారు.
మూసీ ప్రక్షాళనకు మద్దతుగా తాము ఇక్కడి నుంచే (మూసీ ఒడ్డు నుంచే) శంఖం పూరిస్తున్నామన్నారు. మాజీ సీఎం కేసీఆర్ తన హయాంలో ‘హైదరాబాద్‌ను ఇస్తాంబుల్ చేస్తా, న్యూయార్క్ చేస్తా, లండన్ చేస్తా’నన్నాడు.. ఎందుకు చేయలేదు... ఇంట్ల పడుకుంటే అవుతాయా’ అని కిరణ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు చేయాలని, ఆ తర్వాత అందరూ అభివృద్ధికి సహకరించాలన్నారు. మూసీ ప్రక్షాళనకు చేస్తున్న వ్యయం పర్యాటకం ద్వారా ప్రభుత్వానికి తిరిగివస్తుందన్నారు. కేసీఆర్ హయాంలో ఏర్పాటుచేసిన మూసీ రివర్ ప్రాజెక్టు, దానికి కేటాయించిన నిధులు ఏమయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి మూసీ ప్రక్షాళన చేస్తానంటే తప్పు పడుతున్న కేటీఆర్, హరీశ్... కేసీఆర్ మూసీని ప్రక్షాళన చేస్తానన్నప్పుడు ఒప్పెలా అయ్యిందో చెప్పాలన్నారు.
మోదీ గంగా నది ప్రక్షాళన చేస్తే మంచి, రేవంత్‌రెడ్డి మూసీని ప్రక్షాళన చేస్తే చెడు ఎలా అవుతుందో కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, సంజయ్ చెప్పాలన్నారు. మూసీ ప్రక్షాళనను వ్యతిరేకించే బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులను గ్రామాల్లోకి రాకుండా తరిమికొట్టాలన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లా ప్రజలు గొంతువిప్పి మద్దతు ఇవ్వాలన్నారు. ఎమ్మెల్యే సామేల్ మాట్లాడుతూ మూసీని ప్రక్షాళన చేయడం ఈ ప్రాంత రైతుల అదృష్టమన్నారు. ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మూసీ ప్రక్షాళనకు రూ.16కోట్లు ఖర్చు పెట్టినట్లు లెక్కలు చూపించి ప్రజలను మోసం చేసిందన్నారు.
Updated Date - Oct 28 , 2024 | 04:45 AM