Raghunandan Rao: బీసీలపై కవితది మొసలి కన్నీరు
ABN, Publish Date - Dec 30 , 2024 | 03:58 AM
బీసీలపై కల్వకుంట కవిత మొసలి కన్నీరు కార్చడం మానుకోవాలని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు హితవు పలికారు. సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద సమగ్ర శిక్షా ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మెకు ఆయన ఆదివారం సంఘీభావం తెలిపారు.
అధికారంలో పదేళ్లు ఉన్నా కేసీఆర్ బీసీలకు అన్యాయం చేశారు
ఈ-ఫార్ములా కేసుతో కేంద్రానికి ఏం సంబంధం?: ఎంపీ రఘునందన్
సంగారెడ్డి అర్బన్, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): బీసీలపై కల్వకుంట కవిత మొసలి కన్నీరు కార్చడం మానుకోవాలని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు హితవు పలికారు. సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద సమగ్ర శిక్షా ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మెకు ఆయన ఆదివారం సంఘీభావం తెలిపారు. బీసీలకు అన్యాయం జరుగుతుందని, బీసీ కులగణన చేయాలని కవిత డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందని చెప్పారు. పదేళ్లు అధికారంలో ఉండి కేసీఆర్ బీసీలకు అన్యాయం చేశారని, బీఆర్‌ఎస్ నేతలు బీసీల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందన్నారు.
కేంద్రం, బీజేపీ భయపెట్టాలని చూస్తున్నట్లు కవిత చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటే గౌరవంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. గతంలోనూ మోదీ, ఈడీ, బోడీలని కవిత అన్నారని గుర్తు చేశారు. తిహాడ్ జైలుకు పోయి వచ్చినా కవిత మారలేదన్నారు. ఈ-ఫార్ములా రేసు కేసుతో కేంద్రానికి ఏం సంబంధమని ప్రశ్నించారు. సమగ్ర శిక్షా ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం కట్టుబడి ఉంటానని, రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానని స్పష్టం చేశారు.
Updated Date - Dec 30 , 2024 | 03:58 AM