Congress: ఎట్టి పరిస్థితుల్లో రూ.2 లక్షల రుణమాఫీ
ABN, Publish Date - Jul 21 , 2024 | 12:05 PM
ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. రూ.లక్ష లోపు రుణం తీసుకున్న అందరికి మాఫీ అయ్యిందని వివరించారు. రెండో దఫాలో రూ.2 లక్షల వరకు లోన్ తీసుకున్న వారికి మాఫీ అవుతుందని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం పనిచేస్తోందని వెల్లడించారు. రైతుల మేలు కోరి రుణమాఫీ చేస్తున్నామని చెప్పుకొచ్చారు.
నల్గొండ: ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) స్పష్టం చేశారు. రూ.లక్ష లోపు రుణం తీసుకున్న అందరికి మాఫీ అయ్యిందని వివరించారు. రెండో దఫాలో రూ.2 లక్షల వరకు లోన్ తీసుకున్న వారికి మాఫీ అవుతుందని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం పనిచేస్తోందని వెల్లడించారు. రైతుల మేలు కోరి రుణమాఫీ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. అదేవిధంగా ఎస్ఎల్బీసీ పనుల కోసం నిధులు మంజూరు చేశామని గుర్తుచేశారు. దీంతో నల్గొండ జిల్లావ్యాప్తంగా రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు.
తుది దశ..
బ్రాహ్మణ వెల్లంల ఉదయ సముద్రం ప్రాజెక్ట్ తుదిదశకు చేరుకుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివరించారు. వచ్చే ఏడాది మార్చి వరకు ప్రాజెక్ట్ పూర్తి అవుతుందని అంచనా వేశారు. ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసి, దాని కింద ఉన్న చెరువులను నింపుతామన్నారు. తమ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు అండగా నిలుస్తోందని తెలిపారు. ఏటా జూన్‌లో నోటిఫికేషన్లు ఇచ్చి, డిసెంబర్ వరకు నియమాకాలను పూర్తి చేస్తామన్నారు. సివిల్స్ కోసం ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులకు రూ.1 లక్ష ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. సబ్బండ వర్గాలకు సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి కోమటిరెడ్డి ఉద్ఘాటించారు.
త్వరలో ప్రారంభం..
హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి ఆరు లైన్లుగా విస్తరణ జరగబోతుందని మంత్రి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ పనులు సెప్టెంబర్ నెలలో ప్రారంభిస్తామని ఆయన వివరించారు. ఇదే విషయంపై పలు దఫాలుగా కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసామని గుర్తుచేశారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం చేస్తోన్న మంచి పనులను చూసి బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు చేరుతున్నారని పేర్కొన్నారు. ఏ ఒక్క నేతను పార్టీలోకి రావాలని కోరలేదని, వారే స్వయంగా తమ పార్టీలోకి వస్తున్నారని వెల్లడించారు. రాబోయే రోజుల్లో చేరికల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
Read Latest Telugu News and Telangana News
Updated Date - Jul 21 , 2024 | 12:05 PM