Konda Surekha: మంత్రి సురేఖపై నాగార్జున, కేటీఆర్ దావాల విచారణ వాయిదా
ABN, Publish Date - Oct 31 , 2024 | 04:11 AM
మంత్రి కొండా సురేఖపై వేసిన క్రిమినల్ పరువు నష్టం దావాలపై తదుపరి విచారణను వచ్చే నెల 13వ తేదీకి నాంపల్లి కోర్టు వాయిదా వేసింది.
హైదరాబాద్, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): మంత్రి కొండా సురేఖపై వేసిన క్రిమినల్ పరువు నష్టం దావాలపై తదుపరి విచారణను వచ్చే నెల 13వ తేదీకి నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. అక్కినేని కుటుంబ సభ్యులపై చేసిన వ్యాఖ్యలకుగాను హీరో నాగార్జున, వ్యక్తిగతంగా తనపై చేసిన విమర్శలకుగాను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కొండా సురేఖపై నాంపల్లిలోని ప్రత్యేక జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఎక్సైజ్ కోర్టులో క్రిమినల్ పరువు నష్టం దావాలు వేసిన విషయం తెలిసిందే.
ఈ రెండు దావాలపై మంగళవారం విచారణ జరగాల్సి ఉండగా న్యాయమూర్తి సెలవులో ఉండడంతో వచ్చే నెల 13వ తేదీకి ఇన్‌చార్జ్ జడ్జి వాయిదా వేశారు. నాగార్జున వేసిన దావాపై వాదనలు వినిపించేందుకు మంత్రి కొండా సురేఖ తరఫు న్యాయవాది గుర్మిత్ సింగ్ న్యాయస్థానానికి వచ్చారు. అయితే ఈ కేసు విచారణను పరిశీలిస్తున్న జడ్జి అందుబాటులోలేకపోవడంతో వాదనలు జరగలేదు. కేటీఆర్ వేసిన దావాలో ఆయనతోపాటు దాసోజు శ్రవణ్ గత వారమే వాంగ్మూలం ఇవ్వగా మిగిలిన సాక్షుల వాంగ్మూలాలను న్యాయస్థానం నమోదు చేయాల్సి ఉంది.
Updated Date - Oct 31 , 2024 | 04:11 AM