Nampally: చేప ప్రసాదానికి పోటెత్తిన జనం..
ABN, Publish Date - Jun 09 , 2024 | 04:13 AM
చేప ప్రసాదానికి వచ్చిన వారితో నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానం పోటెత్తింది. తెలంగాణ, ఏపీతోపాటు పలురాష్ట్రాల నుంచి భారీగా ప్రజలు తరలి వచ్చారు. మృగశిర కార్తెను పురస్కరించుకుని దివంగత బత్తిని హరినాథ్‌గౌడ్ కుటుంబసభ్యులు, సోదరులు ఏటా ఉబ్బసం బాధితులకు చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు.
తెలంగాణ, ఏపీతోపాటు పలు రాష్ట్రాల నుంచి రాక.. ఆదివారం ఉదయం వరకు కార్యక్రమం
స్పీకర్ ప్రసాద్‌రావు, మంత్రి పొన్నం చేతుల మీదుగా ప్రారంభం
గుండెపోటుతో ఒకరి మృతి
గోషామహల్, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): చేప ప్రసాదానికి వచ్చిన వారితో నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానం పోటెత్తింది. తెలంగాణ, ఏపీతోపాటు పలురాష్ట్రాల నుంచి భారీగా ప్రజలు తరలి వచ్చారు. మృగశిర కార్తెను పురస్కరించుకుని దివంగత బత్తిని హరినాథ్‌గౌడ్ కుటుంబసభ్యులు, సోదరులు ఏటా ఉబ్బసం బాధితులకు చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. శనివారం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఇతర రాష్ట్రాలతోపాటు నేపాల్ తదితర దేశాల నుంచి బాధితులు శుక్రవారం ఉదయం నుంచే ఎగ్జిబిషన్ మైదానానికి తరలివచ్చారు. శనివారం ఉదయం 9.30 గంటలకు రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి, స్పీకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు మైదానంలో అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
మత్స్య పారిశ్రామిక సమాఖ్య ఛైర్మన్ మెట్టు సాయికుమార్ బత్తిని కుటుంబసభ్యుల సేవా భావాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారికి పద్మశ్రీ అవార్డును ఇప్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ మహే్‌షకుమార్ గౌడ్, మేయర్ విజయలక్ష్మి, మత్స్యశాఖ ప్రిన్స్‌పల్ సెక్రటరీ అధర్ సిన్హా, కమిషనర్ గోపి తదితరులు పాల్గొన్నారు. వచ్చినవారికి ఎగ్జిబిషన్ మైదానంలో పలు శాఖల అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. క్యూలైన్‌లో పంపించేందుకు పోలీసు శాఖ ప్రత్యేక చొరవ తీసుకుంది. శనివారం రాత్రి వరకు దాదాపు 60 వేల మందికి పైగా టోకెన్లు విక్రయించినట్లు మత్స్యశాఖ అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయం 9 గంటల వరకు చేప ప్రసాదం పంపిణీ నిర్విరామంగా కొనసాగుతుందని తెలిపారు. కాగా చేప ప్రసాదం కోసం వచ్చిన నిజామాబాద్ జిల్లాకు చెందిన గొల్ల రాజు(65) శనివారం తెల్లవారుజామున ఛాతీలో నొప్పి, ఊపిరాడక ఇబ్బంది పడ్డారు. గమనించిన కుటుంబసభ్యులు నాంపల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తుండగా ఆయన గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
Updated Date - Jun 09 , 2024 | 04:13 AM