GHMC: అక్రమ హర్మ్యంపై చర్యలేవీ!?
ABN, Publish Date - Sep 24 , 2024 | 03:52 AM
నిబంధనలను తుంగలో తొక్కి జీహెచ్‌ఎంసీ అనుమతులు పొందిన నెట్ నెట్ వెంచర్స్ అక్రమంగా ఆకాశ హర్మ్యాలు నిర్మిస్తోందని విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ తేల్చినా
అక్రమమని విజిలెన్స్ తేల్చినా పట్టించుకోవట్లేదు
నెట్ నెట్ వెంచర్స్ నిర్మాణంపై నందగిరి హిల్స్ సొసైటీ ఆరోపణ
బంజారాహిల్స్, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): నిబంధనలను తుంగలో తొక్కి జీహెచ్‌ఎంసీ అనుమతులు పొందిన నెట్ నెట్ వెంచర్స్ అక్రమంగా ఆకాశ హర్మ్యాలు నిర్మిస్తోందని విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ తేల్చినా జీహెచ్‌ఎంసీ అధికారులు ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడంపై నందగిరి హిల్స్ కో ఆపరేటివ్ సొసైటీ మండిపడింది. జీహెచ్‌ఎంసీకి చెందిన అన్ని విభాగాల అధికారులు తప్పుడు అనుమతులు ఇచ్చారని నివేదిక స్పష్టం చేస్తున్నా కమిషనర్ పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నారని తప్పుబట్టారు. జూబ్లీహిల్స్ నందగిరి హిల్స్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ కార్యాలయంలో సొసైటీ అధ్యక్షుడు యుగంధర్, కార్యదర్శి రాధిక, సభ్యుడు రాఘవాచార్య, మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి తదితరులు మీడియాతో మాట్లాడారు.
నందగిరి హిల్స్ కొండ ప్రాంతమని, దీనిని ఆనుకుని ఉన్న హెచ్‌ఎండీఏ స్థలాన్ని వేలంలో నెట్ నెట్ వెంచర్స్ కొనుగోలు చేసిందని, దాంతో, నిర్మాణాలకు కొండ ప్రాంతాన్ని కదిలించవద్దని ప్రభుత్వం నిబంధన పెట్టిందని, అయినా.. వంద మీటర్ల కొండను తవ్వి లోయగా మార్చారని ఆరోపించారు. ఇక్కడ జీ+13 అంతస్థులు, 5 స్టిల్టులు, ఒక సెల్లార్‌కు అనుమతులు తీసుకున్నారని, నందగిరి హిల్స్ లే అవుట్‌గా చూపిస్తే ఇన్ని అంతస్థులకు అనుమతులు రావని, అందుకే రోడ్ నంబర్ 45 నిబంధనలను తమకు అనుకూలంగా మార్చుకున్నారని వివరించారు.
ఈ అంశంపై నందగిరిహిల్స్ సొసైటీ మొదటి నుంచీ పోరాటం చేస్తోందని, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు ఫిర్యాదు చేసిందని, అధికారులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి జీహెచ్‌ఎంసీ అధికారులు నిర్లక్ష్య ధోరణితో, క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే అనుమతులు ఇచ్చారని నివేదిక ఇచ్చారని తెలిపారు. నెట్ నెట్ వెంచర్స్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయడంతోపాటు నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలని నివేదికలో పేర్కొన్నారని గుర్తు చేశారు. అయినా, ఇంత వరకూ ఎటువంటి చర్యలూ తీసుకోలేదన్నారు. అందుకే, విజిలెన్స్ నివేదికను యథావిధిగా అమలు చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించామని తెలిపారు. త్వరలో హైడ్రా కమిషనర్‌ను కలుస్తామన్నారు.
Updated Date - Sep 24 , 2024 | 03:52 AM