Pension : కార్పొరేట్ల చేతుల్లోకి పెన్షన్ నిధులు
ABN, Publish Date - Sep 16 , 2024 | 04:07 AM
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పెన్షన్ సంస్కరణలు.. ఉద్యోగుల కష్టార్జితాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు ఉద్దేశించినవని
రూ.10 లక్షల కోట్లు ధారాదత్తం: స్థిత ప్రజ్ఞ
హైదరాబాద్, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పెన్షన్ సంస్కరణలు.. ఉద్యోగుల కష్టార్జితాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు ఉద్దేశించినవని నేషనల్ మూవ్‌మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం(ఎన్‌ఎంఓపీఎస్) సెక్రటరీ జనరల్ స్థిత ప్రజ్ఞ ఆరోపించారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 99,77,165 మంది ఉద్యోగుల నుండి వసూలు చేసిన రూ.10,53,850 కోట్ల పెన్షన్ నిధులు కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్లనున్నాయని విమర్శించారు.
ఎన్‌ఎంఓపీఎస్ జాతీయ కార్యవర్గ సమావేశం స్థితప్రజ్ఞ అధ్యక్షతన ఆదివారం న్యూఢిల్లీలోని సుర్జీత్ భవన్లో జరిగింది. ఈ సమావేశంలో ఎన్‌ఎంఓపీఎస్ అధ్యక్షుడు వి.కె బంధు, తెలంగాణ నుంచి రామాంజనేయులు, కల్వల్ శ్రీకాంత్, నరేష్ గౌడ్‌తో పాటు అన్ని రాష్ట్రాల నుంచి ఎన్‌ఎంఓపీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ యేడు ఎన్నికలు జరగనున్న మహారాష్ట్ర, హరియాణా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, ఢిల్లీలో ఓట్ ఫర్ ఓపీఎస్ కొనసాగించాలని తీర్మానించారు.
ఓపీఎ్‌సను పునరుద్ధరించాలి
ఉద్యోగ, ఉపాధ్యాయుల పెన్షన్ విధానంపై కేంద్ర ప్రభుత్వం మాటల గారడీని ఇకనైనా ఆపాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. పాఠశాల విద్యకు నిధులు పెంచాలని, పీఎ్‌ఫఆర్‌డీఏను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. నూతన విద్యావిధానంలో పేద బడుగు వర్గాలను విద్యకు దూరం చేసే నష్టదాయకమైన అంశాలున్నాయని విమర్శించారు. తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య(టీఎస్ యూటీఎఫ్) రాష్ట్ర కమిటీ సమావేశం ఆదివారం దోమలగూడలోని రాష్ట్ర కార్యాలయంలో జరిగింది.
యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య మాట్లాడుతూ.. బదిలీ సమస్యలను, అప్పీళ్లను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 20న జరగనున్న రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో పాత పెన్షన్ విధానంపై నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. సీపీఎస్ రద్దు చేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీని అమలు చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడుకమలాకర్ ఆదివారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
Updated Date - Sep 16 , 2024 | 04:07 AM