ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

NHAI: ఆర్‌ఆర్‌ఆర్‌ దారి ఇలా..

ABN, Publish Date - Nov 17 , 2024 | 03:07 AM

రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుగా చేపడుతున్న రీజినల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తరభాగం నిర్మాణానికి సంబంధించి అడుగులు వేగంగా పడుతున్నాయి. ఈ రోడ్డు నిర్మాణ పనులను ఏ పద్ధతుల్లో చేపడితే లాభదాయకంగా ఉంటుందో తెలుపుతూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) నియమించిన కన్సల్టెన్సీ సంస్థ.. కీలక సూచనలు చేసింది.

  • ఉత్తరభాగం నిర్మాణం ఈపీసీ, హెచ్‌ఏఎం పద్ధతుల్లో!

  • ఈ విధానాల్లోనైతేనే లాభదాయకం టోల్‌ వసూలు ద్వారా 20 ఏళ్లలో

  • రూ.15,768 కోట్ల ఆదాయం బీవోటీ పద్ధతిలో గిట్టుబాటు కాదు

  • 120 కి.మీ వేగంతో ప్రయాణించేలా.. 4 లేన్ల యాక్సెస్‌ కంట్రోల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే

  • ఆరు ప్యాకేజీలు.. ఇంటర్‌ చేంజ్‌లు, టోల్‌ప్లాజాలు, రెస్ట్‌ ఏరియాల ఏర్పాటు

  • సమగ్ర ప్రాజెక్టు రిపోర్టులో వెల్లడి ఎన్‌హెచ్‌ఏఐకి సమర్పించిన కన్సల్టెన్సీ

హైదరాబాద్‌, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుగా చేపడుతున్న రీజినల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తరభాగం నిర్మాణానికి సంబంధించి అడుగులు వేగంగా పడుతున్నాయి. ఈ రోడ్డు నిర్మాణ పనులను ఏ పద్ధతుల్లో చేపడితే లాభదాయకంగా ఉంటుందో తెలుపుతూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) నియమించిన కన్సల్టెన్సీ సంస్థ.. కీలక సూచనలు చేసింది. హైబ్రిడ్‌ యాన్యుటీ మోడ్‌ (హెచ్‌ఏఎం) లేదా ఇంజనీరింగ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ కన్‌స్ట్రక్షన్‌ (ఈపీసీ) పద్ధతుల్లో చేపట్టడం ఆర్థికంగా లాభదాయకమని పేర్కొంది. బిల్డ్‌-ఆపరేట్‌- ట్రాన్స్‌ఫర్‌ (బీవోటీ) విధానంలో చేపడితే.. రాబడి రాకపోగా, పెట్టిన పెట్టుబడిపై వచ్చే అంతర్గత రాబడి కూడా గిట్టుబాటు కాదని తెలిపింది. ఈ మేరకు ఎన్‌హెచ్‌ఏఐకి ఇటీవల ఇచ్చిన నివేదికలో సమగ్ర ప్రాజెక్టు రిపోర్టును (డీపీఆర్‌) పొందుపరిచింది. ఉత్తరభాగం రహదారి నిర్మాణానికి హెచ్‌ఏఎం, ఈపీసీ విధానమైతేనే మేలు అని సూచించడానికి ముందుగా.. ప్రాజెక్టు కోసం చేసే ఖర్చు, నికర మార్కెట్‌ విలువలు, రహదారి నిర్మాణం తరువాత వసూలు చేసే టోల్‌ ద్వారా వచ్చే ఆదాయాన్ని కన్సల్టెన్సీ సంస్థ గణించింది. దీని ప్రకారం.. బీవోటీ విధానంలో మొత్తం ప్రాజెక్టు వ్యయాన్ని నిర్మాణ సంస్థే భరించినా.. పెట్టిన పెట్టుబడిపై అంతర్గత రాబడి (ఎకనమిక్‌ ఇంటర్నల్‌ రేట్‌ ఆఫ్‌ రిటర్న్‌) రేటు 5.37 శాతం మాత్రమే ఉంటుందని పేర్కొంది. ఒకవేళ నిర్మాణ వ్యయంలో 40 శాతం నిధులను ప్రభుత్వం గ్రాంట్ల రూపంలో అందించినా.. అంతర్గత రాబడి రేటు తక్కువగానే ఉంటుందని తెలిపింది. అందుకే బీవోటీ విధానం లాభదాయకం కాదని స్పష్టం చేసింది.


  • ఆశాజనకంగా అంతర్గత రాబడి!

ఈపీసీ, హెచ్‌ఏఎం విధానాల్లోనైతే అన్ని ఖర్చులు కలుపుకొన్నా.. అంతర్గత రాబడి రేటు ఆశాజనకంగా ఉంటుందని కన్సల్టెన్సీ సంస్థ పేర్కొంది. దాదాపు 12 శాతానికి పైగా రాబడి రేటు ఉందని తెలిపింది. అంతేకాకుండా ఈ విధానాల్లో చేపట్టే నిర్మాణాలకు ప్రభుత్వం కొంతమేర గ్రాంట్ల రూపంలో నిధులు ఇస్తే.. నిర్మాణం పూర్తయిన తరువాత నుంచి 17 ఏళ్లలోనే టోల్‌ వసూళ్ల రూపంలో ఆదాయం వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. కాగా, రోడ్డు నిర్మాణం తరువాత 2027 నుంచి 2046 వరకు (ఆ సమయానికి రహదారి నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తేనే ) దాదాపు రూ.15,768 కోట్లు టోల్‌ వసూలు ద్వారా రాబడి ఉంటుందని నివేదికలో పొందుపరిచింది. ఇది కూడా ఏటా 5 ు చొప్పున వాహనాల పెరుగుదల ఉంటేనే సాధ్యమవుతుందని అంచనా వేసింది. వాహనాల పెరుగుదల, రాబడికి సంబంధించి వేసిన కొన్ని అంచనాలను కూడా వివరించింది.


  • ఈపీసీ, హెచ్‌ఏఎం అంటే..

ఇంజనీరింగ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ కన్‌స్ట్రక్షన్‌ (ఈపీసీ) అంటే.. ఏదైనా ఒక రహదారి నిర్మాణం కోసం టెండర్‌ దక్కించుకున్న సంస్థే ఆ రహదారి నిర్మాణంలో ఇంజనీరింగ్‌ పనులు, మెటీరియల్‌ సేకరణ, నిర్మాణం, వ్యయం వరకు అన్నింటినీ పర్యవేక్షిస్తుంది. ఇక హైబ్రిడ్‌ యాన్యుటీ మోడ్‌ (హెచ్‌ఏఎం) విధానంలోనైతే.. నిర్మాణ వ్యయంలో నిర్మాణ సంస్థ కొంత, రుణంగా కొంత చొప్పున నిధులను సమకూర్చుకుంటారు. ఒకవేళ జాతీయ రహదారుల నిర్మాణాల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం కావాలనుకుంటే కొంతమేర పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. రోడ్డు నిర్మాణం పూర్తయిన తరువాత నుంచి వసూలు చేసే టోల్‌లో రాష్ట్రానికి కూడా కొంత వాటా వస్తుంటుంది. ఇందుకు సంబంధించి నిర్మాణానికి ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం టోల్‌ వసూలు, వాటా ఉంటుంది. ఈ విధానంలో రహదారి నిర్మాణం కోసం ప్రైవేటు సంస్థ వెచ్చించిన నిధులను వారికి ప్రభుత్వం వెంటనే చెల్లించాల్సిన అవసరంలేదు. ఏడాదికి కొంత చొప్పున వాయిదాల పద్ధతిలో చెల్లించేందుకు వెసులుబాటు ఉంటుంది. ప్రస్తుతం దేశంలో ఈ హైబ్రిడ్‌ యాన్యుటీతోపాటు ఈపీసీ విధానం ఎక్కువగా అమల్లో ఉంది. ఇక బిల్డ్‌-ఆపరేట్‌-ట్రాన్స్‌ఫర్‌ (బీవోటీ) విధానంలో.. నిర్మాణ సంస్థే టోల్‌ వసూలు చేసుకుంటుంది, టోల్‌ వసూలు చేసినంతకాలం రోడ్‌ నిర్వహణను సదరు సంస్థే పర్యవేక్షిస్తుంది. ఆ తరువాత కొంతకాలానికి ప్రభుత్వానికి అప్పగిస్తుంది.


  • టోల్‌ ప్లాజాలు, రెస్ట్‌ ఏరియాలు..

ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగం సంగారెడ్డిలో మొదలై నర్సాపూర్‌, తూఫ్రాన్‌, గజ్వేల్‌, ప్రజ్ఞాపూర్‌, యాదాద్రి భువనగిరి మీదుగా చౌటుప్పల్‌ వరకు 161 కిలోమీటర్ల మేర నిర్మాణం కానుంది. దీనిని ఆరు ప్యాకేజీలుగా నిర్మించనున్నారు. నిర్మాణానికి 1,940 హెక్టార్ల భూమి అవసరమవుతుండగా.. రూ.15 వేల కోట్లకు పైగా నిధులు అవసరమవుతున్నాయి. ఇందులో దాదాపు రూ.5,200 కోట్లు భూపరిహారానికి చెల్లించాల్సి ఉంది. కాగా ఈ రహదారిని గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా నిర్మిస్తున్నారు. ఇది నాలుగు వరుసలతో పూర్తి యాక్సెస్‌ కంట్రోల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ రహదారిగా నిర్మితం కానుంది. ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తరభాగం రోడ్డు మార్గంలో పలు జాతీయ, రాష్ట్ర రహదారులను క్రాస్‌ చేయాల్సి వస్తుంది. కొన్నిచోట్ల ఇరిగేషన్‌ శాఖకు సంబంధించిన మైనర్‌, మేజర్‌, బాక్స్‌ కల్వర్టులను కూడా నిర్మించాల్సి ఉంది. మొత్తం రోడ్డు విస్తీర్ణంలో 11 ఇంటర్‌ఛేంజ్‌లు, కొన్ని చోట్ల టోల్‌ప్లాజాలు రానుండగా, 6 చోట్ల రెస్ట్‌ ఏరియాలు ఏర్పాటు కానున్నాయి. చిన్న, మధ్య, భారీ తరహా వెహికల్‌ అండర్‌ పాస్‌లు అన్నీ కలిపి దాదాపు 187, రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జి (ఆర్వోబీ)లు నాలుగింటిని నిర్మించాల్సి వస్తుంది. ఇవే కాకుండా మేజర్‌ బ్రిడ్జిలు 26, మైనర్‌ బ్రిడ్జిలు 81, బాక్స్‌ కల్వర్టులు 400కు పైగా నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది.


  • ఆరు ప్యాకేజీలుగా నిర్మాణం..

ఆరు ప్యాకేజీల్లో భాగంగా.. మొదటి ప్యాకేజీ గిర్మాపూర్‌ నుంచి రెడ్డిపల్లి వరకు 34.518 కిలోమీటర్లు ఉండనుంది. రెండో ప్యాకేజీ.. రెడ్డిపల్లి నుంచి ఇస్లామాపూర్‌ వరకు 26 కి.మీ ఉంటుంది. ప్యాకేజీ-3 ఇస్లామాపూర్‌ నుంచి గుండన్‌పల్లి వరకు 29 కి.మీ ఉంది. ప్యాకేజీ-4.. గుండన్‌పల్లి నుంచి తుర్కపల్లి వరకు 29 కిలోమీటర్లు. ప్యాకేజీ-5 తుర్కపల్లి నుంచి ఏదుళ్లగూడెం వరకు 31.100కి.మీ. ప్యాకేజీ-6.. ఏదుళ్లగూడెం నుంచి చౌటుప్పల్‌ వరకు..17.900కి.మీ ఉండనుంది. ఇక ఉత్తరభాగం రహదారిలో రానున్న 11 ఇంటర్‌ఛేంజ్‌లను వివిధ విధానాల్లో నిర్మించనున్నారు. హైదరాబాద్‌-పుణె (ఎన్‌హెచ్‌-65) మార్గంలో సింగిల్‌ ట్రంపెట్‌ విధానంలో, హైదరాబాద్‌-నాందేడ్‌ (ఎన్‌హెచ్‌-161) మార్గంలో డబుల్‌ ట్రంపెట్‌, హైదరాబాద్‌-మెదక్‌ (ఎన్‌హెచ్‌-765డి)మార్గంలో డైమండ్‌ పద్ధతిలో, హైదరాబాద్‌-నాగ్‌ఫూర్‌ (ఎన్‌హెచ్‌-44)లో క్లోవర్‌లీఫ్‌ విధానంలో, తూఫ్రాన్‌-గజ్వేల్‌ (స్టేట్‌ హైవే-17) దగ్గర రోటరీ కమ్‌ ఫ్లై ఓవర్‌ విధానం, హైదరాబాద్‌-మంచిర్యాల (స్టేట్‌హైవే-01) క్లోవర్‌ లీఫ్‌ పద్ధతిలో ఒకటి, ప్రజ్ఞాపూర్‌- భువనగిరి (స్టేట్‌ హైవే-17) దగ్గర రోటరీ కమ్‌ ఫ్లైఓవర్‌ విఽధానం. యాదాద్రి-కీసర రోడ్డులో రోటరీ కమ్‌ ఫ్లై ఓవర్‌, హైదరాబాద్‌-వరంగల్‌ (ఎన్‌హెచ్‌-163) మార్గంలో డబుల్‌ ట్రంపెట్‌, భువనగిరి-నల్లగొండ రోడ్డులో రోటరీ కమ్‌ ఫ్లై ఓవర్‌, హైదరాబాద్‌-విజయవాడ (ఎన్‌హెచ్‌-65)మార్గంలో సింగిల్‌ ట్రంపెట్‌ విధానంలో వీటిని నిర్మించనున్నారు.

Updated Date - Nov 17 , 2024 | 03:07 AM