NIMS : పిల్లలకు నిమ్స్‌లో ఉచితంగా గుండె శస్త్ర చికిత్సలు
ABN, Publish Date - Sep 20 , 2024 | 03:42 AM
గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న 15 ఏళ్ల లోపు చిన్నారులకు హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రి అండగా నిలుస్తుంది.
యూకే వైద్య బృందం ఆధ్వర్యంలో 22 నుంచి శిబిరం
15 ఏళ్ల లోపు వారికి ఉచితం..80 మంది పేర్లు నమోదు
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న 15 ఏళ్ల లోపు చిన్నారులకు హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రి అండగా నిలుస్తుంది. హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఒక రోజు నుంచి 15 ఏళ్ల లోపు చిన్నారులకు నిమ్స్‌లో ఉచితంగా శస్త్ర చికిత్సలు చేయనున్నారు. డాక్టర్ రమణ దన్నపనేని ఆధ్వర్యంలోని యూకే వైద్య బృందం, నిమ్స్ వైద్యులతో కలిసి ఈ శస్త్ర చికిత్సలు నిర్వహిస్తుంది. ఆదివారం(22వ తేదీ) నుంచి 28వ తేదీ వరకు వారం రోజుల పాటు ఈ ప్రత్యేక శిబిరం జరగనుంది.
ఈ శిబిరంలో వైద్యం చేయించుకునేందుకు ఇప్పటికే 80 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. ఆయా చిన్నారులను వైద్యులు పరీక్షించి శస్త్ర చికిత్స తేదీ నిర్ణయించి ఆ ప్రకారం చికిత్స నిర్వహిస్తారు. ఈ శిబిరాన్ని వినియోగించుకోవాలని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప నగరి కోరారు. కాగా, యూకే బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన గత శిబిరంలో 180 మందికి శస్త్ర చికిత్సలు చేశామని నిమ్స్ కార్డియోథోరాసిక్ సర్జరీ విభాగాధిపతి ప్రొఫెసర్ అమరేశ్వరరావు చెప్పారు.
Updated Date - Sep 20 , 2024 | 03:42 AM