Nirmal: రాథోడ్‌ నాందేవ్‌ కుటుంబానికి ఎమ్మెల్యే, కలెక్టర్‌ భరోసా!

ABN, Publish Date - Aug 11 , 2024 | 03:54 AM

ఉపాధి కోసం ఎడారి దేశం కువైట్‌కు వెళ్లి ఏజెంట్‌ చేతిలో మోసపోయి, యజమాని వేధింపులకు గురవుతూ అనారోగ్యం బారిన పడిన నిర్మల్‌ జిల్లా ముథోల్‌ మండలంలోని రువ్వి గ్రామానికి చెందిన రాథోడ్‌ నాందేవ్‌ కుటుంబానికి ఎమ్మెల్యే, కలెక్టర్‌ భరోసా కల్పించారు.

Nirmal: రాథోడ్‌ నాందేవ్‌ కుటుంబానికి ఎమ్మెల్యే, కలెక్టర్‌ భరోసా!

  • గల్ఫ్‌ నుంచి స్వదేశానికి రప్పిస్తామని వెల్లడి

  • ‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన

ముథోల్‌, ఆగస్టు 10: ఉపాధి కోసం ఎడారి దేశం కువైట్‌కు వెళ్లి ఏజెంట్‌ చేతిలో మోసపోయి, యజమాని వేధింపులకు గురవుతూ అనారోగ్యం బారిన పడిన నిర్మల్‌ జిల్లా ముథోల్‌ మండలంలోని రువ్వి గ్రామానికి చెందిన రాథోడ్‌ నాందేవ్‌ కుటుంబానికి ఎమ్మెల్యే, కలెక్టర్‌ భరోసా కల్పించారు. బాధితుడిని రక్షించేందుకు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం అతను క్షేమంగా ఉన్నాడని, అతన్ని తిరిగి రప్పించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్టు చేశారు. రాథోడ్‌ నాందేవ్‌ కువైట్‌లో యజమాని వేధింపులు ఎక్కువ కావడంతో తనను ఆదుకోవాలంటూ బాధితుడి ఆవేదనతో కూడిన వీడియో ఇటీవల సోషల్‌ మీడియాలో వైరలైంది.


పడరాని పాట్లు పడుతున్న తనను సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు ముథోల్‌ ఎమ్మెల్యే రామారావు పటేల్‌ ఆదుకుని స్వదేశానికి రప్పించే విధంగా చూడాలని వీడియో ద్వారా వేడుకున్నాడు. ఈ ఉదంతంపై శనివారం ‘ఆంధ్రజ్యోతి’లో ‘నిర్మల్‌ వాసి ఆడు జీవితం’ అన్న శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి నిర్మల్‌ జిల్లా కలెక్టర్‌ స్పందించారు. బాధితుడిని క్షేమంగా తిరిగి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముథోల్‌ ఎమ్మెల్యే రామారావు.. బాధిత కుటుంబంతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సంబంధిత అధికారులు, నాయకులతో మాట్లాడారు. అధైర్య పడవద్దని బాధితుడి కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. రాథోడ్‌ నాందేవ్‌ను స్వదేశానికి రప్పించేందుకు సంబంధిత అధికారులతో, కేంద్ర మంత్రి సంజయ్‌తో మాట్లాడానని ఎమ్మెల్యే తెలిపారు.

Updated Date - Aug 11 , 2024 | 03:54 AM

Advertising
Advertising
<