Road Accident: అమెరికాలో ప్రమాదం..బోధన్‌వాసి మృతి
ABN, Publish Date - Dec 20 , 2024 | 04:09 AM
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణానికి చెందిన పంజాల నీరజ్ గౌడ్ (23) అనే యువకుడు మృతి చెందగా.. అదే పట్టణానికి చెందిన శ్రీధర్ అనే యువకుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
బోధన్‌రూరల్, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి ): అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణానికి చెందిన పంజాల నీరజ్ గౌడ్ (23) అనే యువకుడు మృతి చెందగా.. అదే పట్టణానికి చెందిన శ్రీధర్ అనే యువకుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఏడాదిన్నర క్రితం ఉన్నత విద్య నిమిత్తం వీరిరువురూ అమెరికా వెళ్లారు. అమెరికాలోని న్యూహెవెన్ సిటీలో నివాసం ఉంటూ విద్యనభ్యసిస్తున్నారు. ఈ నెల 16వ తేదీన వ్యక్తిగత పని నిమిత్తం వీరిద్దరూ బ్రిడ్జిపోర్టు ప్రాంతానికి వెళ్లి తిరిగి వస్తుండగా తీవ్రమైన మంచు కురుస్తుండడంతో వీరి కారు అదుపు తప్పి పక్కనే ఉన్న పోలీసు పెట్రోలింగ్ కారును ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వీరిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో నీరజ్‌గౌడ్ మృతి చెందాడు. శ్రీధర్ చికిత్స పొందుతున్నాడు. ఈ ప్రమాదంలో అమెరికా పెట్రోలింగ్ పోలీసు సిబ్బందికి కూడా తీవ్ర గాయాలైనట్లు సమాచారం. మరో ఐదు నిమిషాల్లో వీరు తమ రూమ్‌కు చేరుకుంటారనగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద విషయం తెలియగానే యువకుల కుటుంబసభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. నీరజ్ గౌడ్ మృతదేహాన్ని స్వదేశానికి రప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని అతడి కుటుంబసభ్యులు తెలిపారు.
Updated Date - Dec 20 , 2024 | 04:09 AM