NMC: నకిలీ రోగులను చూపిస్తే కఠిన చర్యలు
ABN, Publish Date - Dec 09 , 2024 | 04:16 AM
చాలా మెడికల్ కాలేజీలు తమ బోధనాస్పత్రుల్లో రోగులు లేకపోయినా... ‘బెడ్ ఆక్యుపెన్సీ’ కోసం నకిలీ రోగులను చూపిస్తుండడాన్ని జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) తీవ్రంగా పరిగణిస్తోంది.
తనిఖీల్లో గుర్తించేందుకు ఎన్‌ఎంసీ కొత్త మార్గదర్శకాలు
ఎక్కువమంది రోగులు చేరుతున్నట్లుగా చూపాలని బోధనాస్పత్రుల అడ్డదార్లు
చెక్ పెట్టేందుకు ఎన్‌ఎంసీ చర్యలు
కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు దరఖాస్తులు.. జనవరి 5 తుది గడువు
సీట్లను 100కు పెంచే యోచనలో సర్కారు
హైదరాబాద్, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): చాలా మెడికల్ కాలేజీలు తమ బోధనాస్పత్రుల్లో రోగులు లేకపోయినా... ‘బెడ్ ఆక్యుపెన్సీ’ కోసం నకిలీ రోగులను చూపిస్తుండడాన్ని జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) తీవ్రంగా పరిగణిస్తోంది. ఎన్‌ఎంసీ బృందాలు తనిఖీకి వచ్చే సమయంలో ఆస్పత్రుల యాజమాన్యాలు ఇలా చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. ఆస్పత్రుల్లో ఉన్న రోగులు అసలా నకిలీయా తేల్చేందుకు ఎన్‌ఎంసీ ఈసారి కొత్తగా మార్గదర్శకాలు విడుదల చేసింది. తనిఖీల సమయంలో పెద్దసంఖ్యలో రోగులు అడ్మిట్ అయి ఉంటే... అంతకుముందు కొన్ని రోజులు వరుసగా ఇదే తరహాలో రోగులు ఉన్నారా లేదా అని పరిశీలిస్తామని వెల్లడించింది. పిల్లల వార్డులో చిన్నారులు ఎటువంటి అనారోగ్యం లేకుండా ఆడుకుంటూ ఉన్నా నకిలీ పేషెంట్ల కింద పరిగణిస్తామని తెలిపింది.
ఒకే కుటుంబం నుంచి ఎక్కువమంది అదే ఆస్పత్రిలో చేరినా, ఎక్కువమంది వైద్య శిబిరం పేరుతో ఆస్పత్రికి వచ్చినా వారిని నకిలీ రోగులుగా గుర్తిస్తామని పేర్కొంది. నకిలీ రోగులను చూపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్‌ఎంసీ హెచ్చరించింది. కాగా, కొత్త వైద్య విద్య కళాశాలల ఏర్పాటుకు ఎన్‌ఎంసీ దరఖాస్తులు ఆహ్వానించింది. ఇప్పటికే ఉన్న కళాశాలల్లో ఎంబీబీఎస్, పీజీ సీట్ల పెంపునకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, వచ్చే ఏడాది జనవరి 4 వరకు గడువు ఉందని తెలిపింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు సమాచారం పంపింది. దరఖాస్తులకు మార్గదర్శకాలు విడుదల చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిఽధిలోని వైద్య కళాశాలల్లో అదనపు పీజీ సీట్ల కోసం దరఖాస్తు చేసుకుంటే వాటిని తనిఖీల నుంచి మినహాయిస్తామని పేర్కొంది. వారిచ్చే స్వీయ ధ్రువీకరణ, సమర్పించే పత్రాల ఆధారంగా భౌతిక తనిఖీల నుంచి మినహాయిస్తామని తెలిపింది.
కొడంగల్‌లో 50 సీట్లా? వందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత
నియోజకవర్గమైన కొడంగల్‌లో కొత్త మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ఇప్పటికే సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత 50 ఎంబీబీఎస్ సీట్లతో ఈ కాలేజీని ఏర్పాటు చేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులివ్వగా ప్రస్తుతం సీట్ల సంఖ్యను వందకు పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ అంశంపై స్పష్టత వచ్చిన తర్వాతే కొడంగల్ మెడికల్ కాలేజీ కోసం దరఖాస్తు చేయనున్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో 34 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి.
Updated Date - Dec 09 , 2024 | 04:16 AM