Telangana: మంత్రుల మధ్య ‘నామినేటెడ్’ చిచ్చు!
ABN, Publish Date - Mar 19 , 2024 | 04:24 AM
రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేపట్టిన నామినేటెడ్ పదవుల పంపిణీ.. మంత్రుల మధ్య చిచ్చు రాజేసింది. వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ సర్కారు తీసుకున్న నిర్ణయం ఆధిపత్య పోరుకు తెరలేపింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నేతలకు పదవులు కట్టబెట్టే
కార్పొరేషన్ చైర్మన్ల నియామకంపై పొన్నం అసంతృప్తి!
శ్రీధర్‌బాబు మాటే చెల్లుబాటైందని కినుక
తన వర్గం నేతలకు పదవులు దక్కలేదని ఆగ్రహం
కరీంనగర్, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ప్రభుత్వం చేపట్టిన నామినేటెడ్ పదవుల పంపిణీ.. మంత్రుల మధ్య చిచ్చు రాజేసింది. వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ సర్కారు తీసుకున్న నిర్ణయం ఆధిపత్య పోరుకు తెరలేపింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నేతలకు పదవులు కట్టబెట్టే విషయంలో తనను సంప్రదించలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. జిల్లాకు చెందిన మరో మంత్రి శ్రీధర్‌బాబు సన్నిహితులకే పదవులు దక్కాయని, ఆయన మాటే చెల్లుబాటు అయిందని పొన్నం కినుక వహించినట్లు తెలుస్తోంది. ప్రత్యేకించి.. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద, కరీంనగర్ శాతవాహన అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీ (సుడా) చైర్మన్‌గా కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి నియామకంపై పొన్నం ప్రభాకర్ ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. తన సొంత జిల్లా కావడంతోపాటు.. తాను కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్నా తనను పట్టించుకోలేదని ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి వద్ద, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ వద్ద ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. అంతేకాదు.. తనకు నామినేటెడ్ పదవి దక్కిన విషయం తెలుసుకున్న కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి.. మంత్రి పొన్నంకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఆయన ఇంటికి వెళ్లి శాలువాతో సత్కరించేందుకు ప్రయత్నించగా స్వీకరించేందుకు ప్రభాకర్ నిరాకరించినట్లు సమాచారం. పొన్నం అనుచరులు పలువురు ఆయనను కలిసి అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఆయన ఇలా స్పందించినట్లు తెలిసింది. వీరిలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పరాజయం పాలైన పురమల్ల శ్రీనివాస్, టీపీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్‌కుమార్, టీపీసీసీ అధికార ప్రతినిధి రేగులపాటి రమ్యారావు ఉన్నట్లు సమాచారం.
శ్రీధర్‌బాబుకు సన్నిహితులైనందునే పదవులు!
పొన్నంతో చర్చించిన అనంతరం పురమల్ల శ్రీనివాస్.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కార్యాలయానికి, ఆయన సలహాదారు ఇంటికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వద్దకు వెళ్లి కలిసినట్లు తెలిసింది. సుడా చైర్మన్ పదవి పొందిన కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి.. అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించేందుకు ప్రయత్నించారని, అలాంటి వ్యక్తికి నామినేటెడ్ పదవి ఎలా ఇస్తారని శ్రీనివాస్ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. నరేందర్‌రెడ్డి, నేరెళ్ల శారదతోపాటు నామినేటెడ్ పదవులు దక్కిన మంథని నియోజకవర్గానికి చెందిన అయిత ప్రకాశ్‌రెడ్డి, కార్మిక నాయకుడు జనక్‌ప్రసాద్‌కు కూడా నామినేటెడ్ పదవులు దక్కాయి. అయితే వీరందరూ మంత్రి శ్రీధర్‌బాబుకు సన్నిహితులు కావడంతోనే పదవులు కట్టబెట్టారని, మంత్రి పొన్నం ప్రభాకర్‌ను సంప్రదించలేదని పార్టీ వర్గాలు చర్చించుకోవడం వల్లే ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. పైగా, పదవులు విషయంలో శ్రీధర్‌బాబు పైచేయి సాధించడం పొన్నం ప్రభాకర్‌కు రాజకీయంగా మింగుడుపడడం లేదని, దీంతో ఇద్దరు మంత్రుల మధ్య ఆధిపత్య పోరుకు తెరలేపినట్లయిందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
Updated Date - Mar 19 , 2024 | 08:16 AM