Police Protests: ఆగని ‘పోలీసు’ పోరు
ABN, Publish Date - Oct 28 , 2024 | 04:37 AM
రాష్ట్రంలో ‘ఒకే పోలీస్’ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆదివారం వివిధ బెటాలియన్ పోలీసులతో పాటు వారి కుటుంబసభ్యులు, చిన్నారులు నిరసనలు చేపట్టారు.
రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలు
పోలీసుల సస్పెన్షన్‌తో ఉద్రిక్తం
కానిస్టేబుళ్ల సస్పెన్షన్ ఎత్తివేయండి: హరీశ్
నేడు కోమటిరెడ్డి దృష్టికి పోలీసుల సమస్యలు?
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): రాష్ట్రంలో ‘ఒకే పోలీస్’ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆదివారం వివిధ బెటాలియన్ పోలీసులతో పాటు వారి కుటుంబసభ్యులు, చిన్నారులు నిరసనలు చేపట్టారు. సస్పెండ్ చేసిన 39 మంది సిబ్బందిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ ఎత్తివేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 17వ బెటాలియన్ పోలీసులు ఆందోళన చేపట్టారు. లేనిపక్షంలో తమను కూడా సస్పెండ్ చేయాలని ధర్నా చేశారు. ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న పోలీసు వ్యవస్థను ఇక్కడ కూడా అమలు చేయాలని కోరడం తప్పా అని ఆవేదన వ్యక్తం చేశారు.
మంచిర్యాల జిల్లా గుడిపేట 13వ బెటాలియన్‌లోని నలుగురు కానిస్టేబుళ్లు, ఒక హెడ్ కానిస్టేబుల్‌పై విధించిన సస్పెస్షన్‌ను ఎత్తివేయాలని కమాండెంట్ రాములుకు వినతిపత్రం అందించారు. తమిళనాడు, కర్ణాటకలో ఉన్న పోలీస్ విధానాన్ని అమలు చేయాలని వరంగల్ 4వ బెటాలియన్ సిబ్బంది నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రధాన ద్వారం ముందు బైఠాయించి ధర్నా చేశారు. ‘టీజీఎస్పీ వద్దురా... ఏక్ పోలీసు ముద్దురా’ అంటూ ఆదివారం రాత్రి నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి 7వ బెటాలియన్ కానిస్టేబుళ్లు కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. నల్లగొండలోని అన్నెపర్తిలో గల 12వ బెటాలియన్ పోలీసుల నిరసనలు నాలుగో రోజూ కొనసాగాయి. బెటాలియన్ ప్రధాన ద్వారం వద్ద పోలీసులు, కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో అంబేడ్కర్ విగ్రహం ముందు 3వ బెటాలియన్ కానిస్టేబుళ్లు కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు.
సోమవారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టనున్నట్లు టీజీఎస్పీ సిబ్బంది తెలిపారు. కాగా, యూనిఫామ్‌తో నిరసనలో పాల్గొన్న పోలీసులపై రాష్ట్ర పోలీసు యంత్రాంగం చర్యలకు పూనుకుంది. శనివారం 39 మందిని సస్పెండ్ చేసింది. కాగా, బెటాలియన్ కానిస్టేబుళ్లపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని డీజీపీ జితేందర్‌ను మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆదివారం ఎక్స్ వేదికగా కోరారు. ఇప్పటికే ఉన్న నిబంధనలను ప్రభుత్వం ఆకస్మికంగా సవరించడం, తెలంగాణ స్పెషల్ పోలీసుల అభ్యర్థనలు పరిగణనలోకి తీసుకోకపోవడం తగదన్నారు. మానవతా దృక్పథంతో వారి సస్పెన్షన్‌ను ఉపసంహరిచుకోవాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. పోలీసు కుటుంబాలు రోడ్డెక్కడం చరిత్రలో మొదటిసారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. టీజీఎస్పీ కానిస్టేబుళ్ల పనిభారాన్ని పెంచుతూ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోను రద్దు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని డిమాండ్ చేశారు.
నేడు మంత్రి కోమటిరెడ్డి దృష్టికి సమస్యలు?
నల్లగొండలోని 12వ బెటాలియన్ పక్కనే ఉన్న మహాత్మగాంధీ వర్సిటీ ప్రధాన క్యాంప్‌సకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సోమవారం రానున్నారు. ఈ నేపథ్యంలో పోలీసు కుటుంబాలు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
Updated Date - Oct 28 , 2024 | 04:37 AM