CMRF: నేటి నుంచి ఆన్లైన్లో సీఎంఆర్ఎఫ్
ABN, Publish Date - Jul 15 , 2024 | 03:08 AM
రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) కింద సాయాన్ని పారదర్శకంగా అందించేందుకు ప్రవేశపెట్టిన ఆన్లైన్ విధానం సోమవారం నుంచి అందుబాటులోకి రానుంది.
యం కోసం నేరుగా దరఖాస్తు చేసుకునే అవకాశం
మూడు నిమిషాల్లోనే దరఖాస్తు సమర్పించే వీలు
ఆన్లైన్లో 4వేల ఆస్పత్రులు అందుబాటులోకి
లోతైన విచారణ తర్వాతే సీఎంఆర్ఎఫ్ సాయం
ప్రజాప్రతినిధులకు లాగిన్ ఐడీలు
దరఖాస్తు ఏ దశలో ఉందో తెలుసుకునే సదుపాయం
లోతైన విచారణ తర్వాతే సాయం
హైదరాబాద్, జూలై 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) కింద సాయాన్ని పారదర్శకంగా అందించేందుకు ప్రవేశపెట్టిన ఆన్లైన్ విధానం సోమవారం నుంచి అందుబాటులోకి రానుంది. ఇకపై సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం పొందాలనుకునేవారు ఆన్లైన్లోనే దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రభుత్వం ఈ విభాగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసింది. ఇందుకు సంబంధించి సీఎంఆర్ఎఫ్ వెబ్‌సైట్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 2న ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా, ఆధార్, రేషన్, ఆరోగ్యశ్రీ కార్డుల సర్వర్లతోపాటు క్షేత్రస్థాయిలో తహసీల్దార్లు జారీ చేసే ఆదాయ ధ్రువపత్రాలకు సంబంధించిన సర్వర్‌తోనూ సీఎంఆర్‌ఎ్‌ఫను ప్రభుత్వం అనుసంధానం చేసింది. సీఎంఆర్ఎఫ్ కింద గతంలో కేవలం 2వేల ఆస్పత్రులు మాత్రమే ఉండగా, తాజాగా దాదాపు 4వేల ఆస్పత్రులను అందుబాటులోకి తీసుకువచ్చింది.
అంతేకాకుండా.. దరఖాస్తుదారులు తమ దరఖాస్తులో పొందుపరిచిన వివరాలు నమ్మదగినవేనా, ఏవైనా తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించారా.. అనే వివరాలు తెలుసుకునేందుకు కూడా ప్రత్యేక విధానాన్ని సర్వర్‌లో ఏర్పాటుచేశారు. సీఎంఆర్ఎఫ్ కింద సాయం పొందాలనుకున్నవారు.. ఇకపై ప్రభుత్వాన్ని, సీఎంఆర్ఎఫ్ అధికారులను ఆశ్రయించాల్సిన అవసరం లేదు. ఇందుకు దరఖాస్తు చేసుకునేందుకు ఆ ప్రాంత ఎమ్మెల్యే లేదా, మంత్రి, ఎంపీ, ఎమ్మెల్సీని సంప్రదిస్తే సరిపోతుంది. ఇందుకోసం ప్రభుత్వం ప్రజాప్రతినిధులకు ఒక లాగిన్ ఐడీని కేటాయించింది. దీని ద్వారా వారి వద్దకు వచ్చే పేషంట్ల వివరాలను సీఎంఆర్ఎఫ్ ఆన్లైన్ పోర్టల్‌లో నమోదు చేస్తారు.
దరఖాస్తు స్టేట్సనూ తెలుసుకునే వీలు
దరఖాస్తు అనంతరం అది ఏ దశలో ఉందనే వివరాలను తెలిసేలా కూడా ఏర్పాటుచేశారు. ప్రస్తుతానికి ఈ వివరాలు ప్రజాప్రతినిధుల లాగిన్ ఐడీతో మాత్రమే తెలుసుకునేందుకు అవకాశం కల్పించారు. త్వరలో దరఖాస్తుదారుడి ఐడీ నంబర్‌తోనూ తెలుసుకునే విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధిని పూర్తిగా ప్రక్షాళన చేయబోతోందని, త్వరలోనే ప్రజాప్రతినిధులకు ప్రత్యేక లాగిన్ ఐడీలు ఇవ్వనుందని పేర్కొంటూ ‘ఆంధ్రజ్యోతి’ జూన్ 8న ‘సీఎంఆర్ఎఫ్ ప్రక్షాళన’ శీర్షికన కథనాన్ని ప్రచురించింది. కాగా, సీఎంఆర్ఎఫ్ కింద సాయం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసేందుకు ఒక్కో దరఖాస్తుకు గరిష్ఠంగా మూడు నిమిషాల సమయం పట్టనుంది.
పేషంట్ పొందిన చికిత్స వివరాలు, అందుకు అయిన ఖర్చుతోపాటు ఆధార్, రేషన్, ఆరోగ్యశ్రీ కార్డు, ఆదాయ ధ్రువపత్రం, బ్యాంకు ఖాతా నంబర్, ఫోన్ నంబర్‌ను ఆన్లైన్ పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ విఽధానంలో దరఖాస్తు చేసినప్పుడు, దానిని ప్రభుత్వం ఆమోదించిన తరువాత, చెక్కు మంజూరుతో కలిపి మొత్తం మూడు దశల్లో దరఖాస్తుదారులకు మూడు ఐడీ నంబర్లు మెసేజ్ రూపంలో రానున్నాయి. అయితే దరఖాస్తు సమయంలో పొందుపరిచే వివరాలకు సంబంధించి పత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం ఆ వివరాలను నమోదు చేస్తే సరిపోతుంది. దరఖాస్తు అనంతరం ఆయా పత్రాలను ప్రజాప్రతినిధుల వద్ద పనిచేసే సిబ్బంది సీఎంఆర్ఎఫ్ విభాగానికి అందజేస్తారు.
దరఖాస్తులపై లోతైన విచారణ
సీఎంఆర్ఎఫ్ కోసం వచ్చిన దరఖాస్తులపైౖ ప్రభుత్వం 360 డిగ్రీల కోణంలో విచారణ చేయనుంది. ఇందుకోసం ఆన్లైన్ పోర్టల్‌కు.. రాష్ట్రంలోని ఆధార్, రేషన్, ఆరోగ్యశ్రీ కార్డులను పర్యవేక్షించే సర్వర్లను అనుసంధానం చేసింది. తహసీల్దార్లు జారీ చేసే ధ్రువపత్రాలను మీ-సేవల సహాయంతో పరిశీలించనున్నారు. దరఖాస్తుల విచారణలో భాగంగా పేషంట్ తీసుకున్న చికిత్స, అందుకు అయిన ఖర్చును ఆస్పత్రి యాజమాన్యం, వైద్యులతో మాట్లాడి మరోసారి వివరాలు తెలుసుకుంటారు. పేషంట్ ఇచ్చిన వివరాలు, ఆస్పత్రి తెలిపిన వివరాలు సరిగా ఉన్న దరఖాస్తులకు ఆమోదం తెలుపుతారు. అనంతరం దరఖాస్తుదారుడికి ఎంతమేర సాయం అందించాలన్న వివరాలు కూడా ఆన్లైన్లోనే తెలుస్తాయి. దాని ప్రకారం లబ్ధిదారుడి పేరిట చెక్కు మంజూరు చేస్తారు. కాగా, సీఎంఆర్ఎఫ్ సాయం కోసం.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన 6 నెలల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది.
Updated Date - Jul 15 , 2024 | 03:08 AM