Osmania University: హిందీ మహా విద్యాలయంలో డిగ్రీ సర్టిఫికెట్ల ఫోర్జరీ
ABN, Publish Date - Nov 24 , 2024 | 04:32 AM
ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా కొనసాగుతున్న హిందీ మహా విద్యాలయ.. విద్యార్థుల డిగ్రీ సర్టిఫికెట్లను ఫోర్జరీ చేసింది. ఫెయిలైన విద్యార్థులను పాసైనట్లుగా తప్పుడు సర్టిఫికెట్లను సృష్టించింది.
కళాశాల అనుమతులు రద్దు
హైదరాబాద్ సిటీ, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా కొనసాగుతున్న హిందీ మహా విద్యాలయ.. విద్యార్థుల డిగ్రీ సర్టిఫికెట్లను ఫోర్జరీ చేసింది. ఫెయిలైన విద్యార్థులను పాసైనట్లుగా తప్పుడు సర్టిఫికెట్లను సృష్టించింది. ఓయూకు చెందిన అధికారుల సంతకాలనూ ఫోర్జరీ చేసింది. విచారణ జరిపిన ఓయూ అధికారులు హిందీ మహా విద్యాలయ అనుమతులను రద్దు చేశారు. ప్రస్తుతం వివిధ కోర్సులు చదువుతున్న విద్యార్థులు నష్టపోకుండా ఓయూ పర్యవేక్షణలో కోర్సులను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. హిందీ మహా విద్యాలయానికి ఉన్న స్వయం ప్రతిపత్తిని రద్దు చేయాలంటూ ఉస్మానియా వర్సిటీ యూజీసీకి ప్రతిపాదనలు పంపింది. హైదరాబాద్‌లోని విద్యానగర్‌లో ఉన్న హిందీ మహా విద్యాలయానికి స్వయం ప్రతిపత్తి ఉంది. యూజీలో బీబీఏ, బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులను, పీజీలో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ కోర్సులను నిర్వహిస్తోంది.
స్వయం ప్రతిపత్తి ఉండడంతో హిందీ మహా విద్యాలయమే స్వయంగా పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, తమ అధ్యాపకులతోనే నిర్వహించుకోవడానికి అవకాశం ఉంది. అయితే 2019-22 విద్యాసంవత్సరానికి సంబంధించి డిగ్రీ ఆరో సెమిస్టర్ పరీక్షల్లో 49మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. ఐదుగురు విద్యార్థులు పాసయ్యారు. కానీ, ఫెయిలైన 49 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లుగా, ఉత్తీర్ణులైన 5గురు విద్యార్థులు ఫెయిలైనట్లుగా తారుమారు చేసిన జాబితాను ఓయూ పరీక్షల నియంత్రణ కార్యాలయానికి హిందీ మహావిద్యాలయం సమర్పించింది. సదరు విద్యాసంస్థ రికార్డులపై అనుమానం రావడంతో ఓయూ అధికార యంత్రాంగం సమగ్ర విచారణకు ఆదేశించింది. హిందీ మహా విద్యాలయ అక్రమాలకు పాల్పడ్డట్టు కమిటీ నిర్ధారించింది. ఓయూ పరిధిలో అక్రమాలను సహించే ప్రసక్తే లేదని వీసీ ఎం.కుమార్ చెప్పారు.
Updated Date - Nov 24 , 2024 | 04:32 AM