Pending salaries: వేతనాలు ఎన్నడో?
ABN, Publish Date - Jul 23 , 2024 | 03:24 AM
రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సకాలంలో వేతనాలు అందడం లేదు. కొన్ని విభాగాల్లో నెలల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయి. అసలే అరకొర జీతాలు.. అవీ నెలనెలా అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నామని వారు వాపోతున్నారు.
కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల అవస్థలు
వైద్య శాఖలో 30 వేల మందికి 2 నెలలుగా బాకీ
అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలదీ అదే పరిస్థితి
కుటుంబాలు గడిచే పరిస్థితిలేదని ఆవేదన
మధ్యాహ్న భోజనంలో ఏడు నెలలుగా పెండింగ్
హైదరాబాద్, జూలై 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సకాలంలో వేతనాలు అందడం లేదు. కొన్ని విభాగాల్లో నెలల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయి. అసలే అరకొర జీతాలు.. అవీ నెలనెలా అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నామని వారు వాపోతున్నారు. పెరుగుతున్న నిత్యావసర ధరలతో కుటుంబం గడవడం కష్టమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫీజులు చెల్లించలేక పిల్లల్ని స్కూల్ మాన్పిస్తున్నామని, దురదృష్టవశాత్తు ఇంట్లో ఎవరికైనా ఆరోగ్య సమస్య వస్తే వైద్యానికి డబ్బు ఎలా తేవాలో అర్థం కావడం లేదని ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా కొన్ని ప్రభుత్వ విభాగాల్లోని కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. వైద్య ఆరోగ్య శాఖలో సుమారు 30 వేల మందికి సకాలంలో వేతనాలు అందడం లేదు. జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలో 17,514 మంది పనిచేస్తున్నారు. ఇందులో సెకండ్ ఏఎన్‌ఎమ్, ఎంఎల్‌హెచ్‌పీలు, స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్లు, అకౌంటెంట్లు, డీఈవోలు ఉన్నారు.
వీరికి నెల రోజుల వేతనాలు పెండింగ్ ఉన్నాయి. వైద్య విద్య సంచాలకులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో పనిచేసే సుమారు 15 వేల మందికి గత 2-3 నెలలుగా జీతాలు అందడం లేదు. ఇందులో స్టాఫ్ నర్సులు, టెక్నీషియన్లు, శానిటరీ, పేషెంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. అంగన్‌వాడీ టీచర్లు, అయాలకు గత మూడు నెలల వేతనాలు, కూరగాయలు, గ్యాస్ ఖర్చులు, అంగన్‌వాడీ కేంద్రాల అద్దెలు ఇవ్వాల్సి ఉంది. ఒక్క అంగన్‌వాడీ టీచర్లకే సుమారు రూ.31 కోట్లు, అయాలకు రూ.14 కోట్లు బకాయిలు ఉన్నాయి. అంగన్‌వాడీ కేంద్రాలు చాలావరకు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. వాటికి గత పది నెలలుగా అద్దెలు చెల్లించడం లేదని, కోడిగుడ్ల బిల్లులు కూడా పెద్దమొత్తంలో పెండింగ్‌లో ఉన్నాయని చెబుతున్నారు. జనవరి వరకే వాటి బిల్లులు చెల్లించారని, తర్వాత నుంచి పెండింగ్‌లో ఉన్నాయంటున్నారు.
మధ్యాహ్న భోజన పథకంలో వంటపని చేసేవారు, సహాయకులకు గత ఏడాది డిసెంబరు నుంచి వేతనాలు రావడం లేదని చెబుతున్నారు. మొత్తం 54 వేల మంది ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు. సర్వశిక్షా అభియాన్‌లో పనిచేసే వారికి మే-జూన్ నెలల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. గురుకుల విద్యాలయాల్లో కూడా ప్రతి నెలా 15 తర్వాతే వేతనాలు ఇస్తున్నారని కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ సిబ్బంది చెబుతున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు ప్రభుత్వం గత రెండు నెలలుగా వేతనాలు చెల్లించలేదని సమాచారం. రాష్ట్రంలోని 7,280 మందికి రెండు నెలల వేతనాలు రూ.15.29 కోట్లు బకాయి ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, రాష్ట్రంలోని 12,761 గ్రామపంచాయతీల్లోని 29,676 మంది పారిశుధ్య కార్మికులకు 5 నెలల వేతన బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం ఇటీవల రూ.150.57 కోట్లు విడుదల చేసింది.
Updated Date - Jul 23 , 2024 | 03:24 AM