Teaching Hospitals: నెలాఖరులోగా సూపరింటెండెంట్లు!
ABN, Publish Date - Aug 22 , 2024 | 03:47 AM
రాష్ట్రంలో 18 బోధనాస్పత్రులకు ఈనెలాఖరు నాటికి శాశ్వత సూపరింటెండెంట్లు రానున్నారు. గత నెల చేపట్టిన సాధారణ బదిలీల్లో ఆ ఆస్పత్రుల సూపరింటెండెం ట్లు వేరేచోట్ల నియమితులయ్యారు.
రాష్ట్రంలో 18 బోధనాస్పత్రులకు నియామకం
నెల రోజులుగా వారు లేకుండానే ఆస్పత్రులు!
త్వరలో 10 వైద్య కాలేజీలకు ప్రిన్సిపాళ్లు
అడిషనల్ డీఎంఈ పదోన్నతులపైనా దృష్టి
త్వరలో రెగ్యులర్ డీహెచ్ నియామకం కూడా
హైదరాబాద్, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 18 బోధనాస్పత్రులకు ఈనెలాఖరు నాటికి శాశ్వత సూపరింటెండెంట్లు రానున్నారు. గత నెల చేపట్టిన సాధారణ బదిలీల్లో ఆ ఆస్పత్రుల సూపరింటెండెం ట్లు వేరేచోట్ల నియమితులయ్యారు. దాంతో సూపరింటెండెంట్లు లేకుండానే ఆ ఆస్పత్రులు నడుస్తున్నా యి. ఒక్క హైదరాబాద్‌లోనే ఏడు పెద్దాస్పత్రులు ఉన్నాయి. దాంతో వాటిలో పాలన అస్తవ్యస్తంగా మా రింది. సీనియర్ వైద్యులు కూడా బదిలీ కావడంతో వైద్య సేవలపై తీవ్ర ప్రభావం పడింది.
నిజానికి గత బీఆర్‌ఎస్ సర్కారు రాష్ట్రస్థాయి కీలక విభాగాధిపతులపోస్టుల నుంచి కాలేజీల ప్రిన్సిపాల్స్, బోధనాస్పత్రుల సూపరింటెండెంట్ల వరకు అంతా ఇన్‌చార్జులతోనే నెట్టుకొచ్చింది. రాష్ట్రంలో అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు ఇన్‌చార్జుల పాలనకు స్వస్తి పలికింది. రాష్ట్రస్థాయిలో రెగ్యులర్ హెచ్‌వోడీ పోస్టులు మంజూరు చేసింది. ప్రస్తుతం 50 అదనపు వైద్య విద్య సంచాలకుల (ఏడీఎంఈ) పోస్టుల భర్తీకి పదోన్నతులు చేపట్టింది. ఈ హోదా ఉన్నవారినే కాలేజీల ప్రిన్సిపాల్స్‌గా, బోధనాస్పత్రులకు సూపరింటెండెంట్లుగా నియమించాలని నిబంధనలు చెబుతున్నాయి. వారంలోపే పదోన్నతులు ఇచ్చి.. ప్రిన్సిపాల్స్, సూపరింటెండెంట్లుగా పంపనున్నట్లు సచివాలయ వర్గాలు వెల్లడించాయి.
త్వరలో రెగ్యులర్ డీహెచ్ నియామకం!
ప్రజారోగ్య సంచాలకులడి (రెగ్యులర్ డీహెచ్) పోస్టు కూడా త్వరలో భర్తీ కానుంది. ఈ పోస్టుకు అర్హత ఉన్నవారి సీనియారిటీ జాబితా పంపాలని ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా ఇన్‌చార్జి డీహెచ్‌ను ఆదేశించారు. దీంతో డీహెచ్ కార్యాలయం ఐదుగురి పేర్లతో జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో రవీంద్ర నాయక్, అమర్‌సింగ్ నాయక్, మోజీరాం రాథోడ్, డాక్టర్ కే పద్మజ, డాక్టర్ ఆర్ పుష్ప ఉన్నారు.
సీనియారిటీలో ముందున్న వారికి అవకాశం ఇవ్వాలని నిబంధనలు చెబుతున్నాయని, రవీంద్ర నాయక్‌నే డీహెచ్‌గా నియమించే అవకాశాలు ఉన్నాయని సచివాలయ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం కూడా సీనియారిటీనే ప్రాతిపదికగా తీసుకోవాలని భావిస్తోందని సమాచారం.
Updated Date - Aug 22 , 2024 | 03:47 AM