High Court: గురుద్వారా, ఆలయాన్ని కూల్చనివ్వకండి
ABN, Publish Date - Oct 11 , 2024 | 04:34 AM
గురుద్వారా, హనుమాన్ ఆలయంతో పాటు పలు ఇళ్లను కూల్చకుండా హైడ్రాను అడ్డుకోవాలంటూ హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలైంది.
మూసీ రివర్‌బెడ్‌లో ఉన్నాయంటూ మార్కింగ్ అక్రమం
హైడ్రా, అధికారుల తీరు సరికాదు..హైకోర్టులో పిటిషన్
హైదరాబాద్, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): గురుద్వారా, హనుమాన్ ఆలయంతో పాటు పలు ఇళ్లను కూల్చకుండా హైడ్రాను అడ్డుకోవాలంటూ హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలైంది. హైదరాబాద్‌లోని పేట్లబుర్జు వద్ద ఉన్న బాబా మెహర్ దాస్‌జీ గురుద్వారా, హనుమాన్ ఆలయంతోపాటు పలు ఇళ్లును కూల్చకుండా అడ్డుకోవాలని కోరుతూ గురుద్వారా, ఆలయం కేర్‌టేకర్ మహేందర్‌సింగ్ దాస్ సహా మరో 15 మంది ఈ పిటిషన్ దాఖలు చేశారు. మూసీ రివర్‌బెడ్, బఫర్‌జోన్‌లో ఉన్నాయని పేర్కొంటూ నిజాం కాలం నుంచి ఉన్న గురుద్వారా, ఆలయానికి ‘ఆర్‌బీ-ఎక్స్’ అని మార్కింగ్ చేసి కూల్చేస్తామని బెదిరిస్తున్నారని పిటిషనర్లు పేర్కొన్నారు.
అప్పటి నిజాం కేటాయించిన 4.20 ఎకరాల్లో గురుద్వారా కొనసాగుతోందని.. దశాబ్దాలుగా ఇది ఉందని తెలిపారు. అలాగే పేట్లబుర్జు పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్ సమీపంలో ఉన్న పట్టాభూముల్లోని ఇళ్లను సైతం కూల్చడానికి మునిసిపల్, రెవెన్యూ, హైడ్రా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రాంతానికి ఉన్న చారిత్రక నేపథ్యాన్ని, గుర్తింపును అర్థం చేసుకుని గత ప్రభుత్వాలు రివర్‌బెడ్ బయటే ఉన్నట్లు ధ్రువీకరించాయన్నారు. 90 ఏళ్ల నుంచి పేట్లబుర్జు వద్ద ఇళ్లు ఉన్నాయని.. ఇప్పుడు రివర్‌బెడ్‌లో ఉన్నాయని చెప్పి, మార్కింగ్ చేయడం అక్రమమని పేర్కొన్నారు. మూసీ రివర్ పాత రికార్డులను కోర్టుకు సమర్పించేలా ఆదేశించాలని కోరారు. కాగా, ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు హైకోర్టు నిరాకరించింది. ఇది సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.
Updated Date - Oct 11 , 2024 | 04:34 AM