Sridhar Babu: 200 ఎకరాల్లో గోల్ఫ్ సిటీ
ABN, Publish Date - Oct 20 , 2024 | 02:58 AM
ప్రొఫెషనల్ గోల్ఫర్స్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా(పీజీఏ), స్థానిక భాగస్వామి స్టోన్ క్రాఫ్ట్‌తో కలిసి హైదరాబాద్‌కు దక్షిణాన 200 ఎకరాల్లో గోల్ఫ్ సిటీని నిర్మించేందుకు ముందుకు వచ్చిందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు.
10 వేల మందికి ఉపాధి అవకాశాలు: మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): ప్రొఫెషనల్ గోల్ఫర్స్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా(పీజీఏ), స్థానిక భాగస్వామి స్టోన్ క్రాఫ్ట్‌తో కలిసి హైదరాబాద్‌కు దక్షిణాన 200 ఎకరాల్లో గోల్ఫ్ సిటీని నిర్మించేందుకు ముందుకు వచ్చిందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. అమెరికాలోని టెక్సస్ రాష్ట్రంలో ఫ్రిస్కో కేంద్రంగా పని చేస్తున్న పీజీఏ ప్రతినిధి బృందం శనివారం మంత్రితో సచివాలయంలో భేటీ అయింది. అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తే గోల్ఫ్ కోర్టులు, నివాస సముదాయాలు, హోటళ్లు, వినోద పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి సిద్ధమని పీజీఏ, స్టోన్ క్రాఫ్ట్ ప్రకటించినట్లు తెలిపారు. ప్రస్తుతం ముంబైలో షాపూర్జీ పల్లోంజీ సంస్థతో కలిసి పీజీఏ గోల్ఫ్ సిటీ నిర్మాణం చేపడుతోందని తెలిపారు.
ఇక్కడ స్టోన్ క్రాఫ్ట్ భాగస్వామ్యంతో భారీ పెట్టుబడులు పెట్టడానికి అంగీకరించిందని వివరించారు. గోల్ఫ్ సిటీ నిర్మాణం పూర్తయితే వచ్చే పదేళ్లలో పదివేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని శ్రీధర్ బాబు తెలిపారు. పీజీఏ కన్సార్టియం నిర్మించనున్న ‘18 హోల్’ ప్రామాణిక గోల్ఫ్ కోర్సు... దక్షిణ భారత దేశంలోనే మొట్ట మొదటిది కానుందని వెల్లడించారు. కాగా, నిర్మాణ రంగంలో దేశంలోని అన్ని నగరాలతో హైదరాబాద్ పోటీ పడి అగ్రగామిగా నిలవాలని మంత్రి శ్రీధర్ బాబు ఆకాంక్షించారు. కొంపల్లిలోని ఆస్పేషియస్ కన్వెన్షన్ సెంటర్‌లో రూఫ్ అండ్ ఫ్లోర్ ప్రాపర్టీ ప్రదర్శనను మైనంపల్లి హన్మంతరావుతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం బిల్డర్లు, రియల్ డెవలపర్లతో మాట్లాడారు. రెచ్చగొట్టే వారి మాటలు విని, హైడ్రా గురించి ఆందోళన చెందవద్దని సూచించారు. ఉత్తర హైదరాబాద్ ఇంకా విస్తరింస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రదర్శనలో 15 మంది డెవలపర్లు సుమారుగా వంద ప్రాజెక్టులను ప్రదర్శించారు.
Updated Date - Oct 20 , 2024 | 02:58 AM