PM Modi: తక్కువ కాలంలో.. ఎక్కువ వ్యతిరేకత
ABN, Publish Date - Nov 28 , 2024 | 04:17 AM
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అతి తక్కువ కాలంలో ఎక్కువ ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందని ప్రధాని మోదీ అన్నారు. కాంగ్రెస్ పాలన పట్ల రాష్ట్ర ప్రజలు విరక్తి చెందారని, అదే సమయంలో గత బీఆర్‌ఎస్ పాలనలోని చీకటి రోజులను వారు మరచిపోలేదని పేర్కొన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మూటగట్టుకుంది
ఆ పార్టీని ఎదుర్కోవడం పెద్ద కష్టమేమీ కాదు
బీఆర్‌ఎస్ పాలనలో ప్రజలకు చీకటి రోజులు
బీజేపీయే ప్రత్యామ్నాయం.. అధికారంలోకి రావాలి
మహారాష్ట్రలో విజయాన్ని స్ఫూర్తిగా తీసుకోండి
అభివృద్ధి అజెండాతో ప్రజల వద్దకు వెళ్లండి
రాష్ట్ర బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ/హైదరాబాద్, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అతి తక్కువ కాలంలో ఎక్కువ ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందని ప్రధాని మోదీ అన్నారు. కాంగ్రెస్ పాలన పట్ల రాష్ట్ర ప్రజలు విరక్తి చెందారని, అదే సమయంలో గత బీఆర్‌ఎస్ పాలనలోని చీకటి రోజులను వారు మరచిపోలేదని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో బీజేపీ మాత్రమే ప్రజలకు ప్రత్యామ్నాయంగా కనిపిస్తోందని, వారి నమ్మకానికి అనుగుణంగా పనిచేయాలని తెలంగాణకు చెందిన ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు సూచించారు. బుధవారం పార్లమెంటులో వారు తనను కలిసిన సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, వివిధ అంశాలపై వారితో చర్చించారు. పార్టీ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా బీజేపీని అడ్డుకోలిగే శక్తి ఏ పార్టీకి లేదని, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీకి ఏ కోశానా గట్టి పోటీ ఇచ్చే పరిస్థితులు లేవని ప్రధాని అన్నారు. తెలంగాణలో కాంగ్రె్‌సను ఎదుర్కోవడం పెద్ద కష్టమేం కాదన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాల్సిందని, కానీ.. కొన్ని కారణాల వల్ల రాలేకపోయామని తెలిపారు. ప్రస్తుతం పార్టీకి సానుకూల వాతావరణం ఉందన్నారు. మహారాష్ట్రలో బీజేపీ సాధించిన ఘనవిజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని పని చేయాలని, తెలంగాణలో కూడా అఖండ విజయం సాధించేందుకు ఇప్పటినుంచే కృషి చేయాలని సూచించారు. కలిసికట్టుగా, ప్రణాళిక బద్ధంగా పనిచేస్తే ఏదైనా సాధ్యమేనని అన్నారు. ఏక్ హైతో సేఫ్ హై అన్న నినాదం మహారాష్ట్రలో పార్టీని విజయపథంలో నడిపించిందన్నారు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రధానమంత్రి ఆరా తీశారు.
ప్రభుత్వ తప్పులపై అప్రమత్తంగా ఉండాలి..
రాష్ట్ర ప్రభుత్వం చేసే తప్పులపై అప్రమత్తంగా ఉండాలని, సర్కారు ప్రజా వ్యతిరేక నిర్ణయాలను గట్టిగా ప్రతిఘటించాలని నిర్దేశించారు. మరోవైపు అభివృద్ధి ఎజెండాతో ప్రజల వద్దకు వెళ్లాలని, కేంద్ర ప్రభుత్వం పదేళ్లలో తెలంగాణలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రచారం చేయాలని చెప్పారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన అన్ని పెండింగ్ పథకాలు, నిధులు మంజూరు చేసేలా చూడాలని, అదే సమయంలో వాటి గురించి తమకు ముందే తెలియజేసి ప్రజలకు వివరించే అవకాశం కల్పించాలని తెలంగాణ బీజేపీ ప్రజాప్రతినిధులు ప్రధాని మోదీకి చెప్పినట్లు సమాచారం. కాగా, తెలంగాణలో బీజేపీ వేగంగా విస్తరిస్తోందని ప్రధాని మోదీ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ‘‘రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్‌ఎ్‌సల ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బీజేపీ తన స్వరాన్ని గట్టిగా వినిపిస్తూనే ఉంటుంది. కార్యకర్తలు మా అభివృద్ది ఎజెండాను వివరిస్తూనే ఉంటారు’’ మోదీ తెలుగులో ట్వీట్ చేశారు. .ప్రధానితో భేటీ వివరాలను కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వెల్లడిస్తూ.. ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఎప్పుడూ పనిచేయాలని, ప్రభుత్వంతో మాట్లాడి వాటి పరిష్కారానికి కృషిచేయాలని మోదీ సూచించినట్లు తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి పనుల గురించి ప్రధాని అడిగి తెలుసుకున్నారని చెప్పారు. డిసెంబరు చివరి నాటికల్లా.. పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తవుతాయని, ఆ తర్వాత పార్టీకి కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుందని అన్నారు.
సమస్యలపై ప్రశ్నిస్తే.. వ్యక్తిగతంగా దాడులు: కిషన్‌రెడ్డి
రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి పాలన కూడా కేసీఆర్ పాలనలాగే ఉందని, ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. బెదిరింపులు, తిట్ల పురాణాలు, వ్యక్తిగత దాడులు, అక్రమ కేసులు, గాలిమాటలు తప్ప.. ఈ ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం సాదించిందేమీ లేదన్నారు. బుధవారం కిషన్‌రెడ్డి తన అధికారిక నివాసంలో మీడియాతో మాట్లాడారు. ’నేను సమస్య గురించి మాట్లాడితే.. కిషన్ రెడ్డి డీఎన్‌ఏ ఏంటని అడుగుతున్నారు. నా డీఎన్‌ఏ.. బీజేపీ డీఎన్‌ఏ. మీలా పది పార్టీలు తిరిగిన డీఎన్‌ఏ కాదు’ అని అన్నారు. అప్రజాస్వామిక భాష మాట్లాడటాన్ని కేసీఆర్ ప్రవేశపెడితే.. రేవంత్ కొనసాగిస్తున్నారని ఆరోపించారు. రాజకీయ పరమైన ఆరోపణలు, ప్రత్యారోపణలతో తెలంగాణ నష్టపోతోందన్నారు. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందన్నారు. రాష్ట్రంలోని సమస్యలను పరిష్కరించకుండా వారం రోజులపాటు ఉత్సవాలు నిర్వహించడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ ఆధ్వర్యంలో డిసెంబరు 1 నుంచి 5 వరకు రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కొమురం భీం జిల్లాలో.. శైలజ అనే విద్యార్థిని ఆహార కల్తీతో చనిపోతే ముఖ్యమంత్రి కనీసం పట్టించుకోలేదని మండిపడ్డారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులు, వ్యక్తిగత దాడులు.. అసాధ్యమైన అంశాల్లో.. ప్రజలను మభ్యపెట్టేలా పనులు చేయడంలో కేసీఆర్, రేవంత్ ఇద్దరూ ఇద్దరేనని కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఆ రెండు పార్టీలు చట్టాలకు తూట్లు పొడుస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పాత అలవాటు ప్రకారం రాష్ట్రంలో అవినీతి విలయతాండవం చేస్తోందని, హైదరాబాద్‌లో రియల్ ఎేస్టట్ పూర్తిగా దెబ్బతిన్నదని తెలిపారు.
Updated Date - Nov 28 , 2024 | 05:50 AM