Online Gaming: సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని.. ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య
ABN, Publish Date - Sep 29 , 2024 | 04:33 AM
కష్టపడి పోలీస్ కానిస్టేబుల్ (ఏఆర్) ఉద్యోగాన్ని సాధించిన ఆ యువకుడు ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసై.. ఆ గేమ్స్‌లో డబ్బులు పోగొట్టుకొని అప్పుల ఊబిలో కూరుకుపోయాడు.
ఆదిభట్ల/మంచాల, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): కష్టపడి పోలీస్ కానిస్టేబుల్ (ఏఆర్) ఉద్యోగాన్ని సాధించిన ఆ యువకుడు ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసై.. ఆ గేమ్స్‌లో డబ్బులు పోగొట్టుకొని అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. అవి తీర్చే దారీతెన్నూ కనిపించక సర్వీసు రివాల్వరుతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు రంగారెడ్డి జిల్లా మంచాల మండల కేంద్రానికి చెందిన దూసరి బాలకృష్ణ (28). 2018లో పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. హెడ్‌క్వార్టర్స్ కేంద్రంగా వివిధ ప్రాంతాల్లో డ్యూటీ చేసి ఈనెల 1 నుంచి రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌కు వచ్చాడు.
అయితే అతడికి ఆన్‌లైన్ గేమ్స్ ఆడే వ్యసనం ఉన్నట్లు తెలిసింది. బాలకృష్ణ గేమ్స్ ఆడుతూ డబ్బులు పోగొట్టుకొని అప్పుల పాలైనట్లు సమాచారం. అప్పులు ఎక్కువై మానసిక వేదనకు గురైనట్లు స్నేహితులు చెబుతున్నారు. ఎవ్వరితో సరిగా మాట్లాడకుండా.. ఎప్పుడు మూడీగా ఉండేవాడని తెలిసింది. శుక్రవారం ఉదయం 9 గంటలకు డ్యూటీకి వచ్చి శనివారం ఉదయం వెళ్లాల్సి ఉండగా.. శనివారం తెల్లవారు జామున 3.30 గంటల ప్రాంతంలో టాయిలెట్‌కు వెళ్తున్నట్లు అక్కడున్న సిబ్బందికి చెప్పి వెళ్లాడు. అక్కడ తన వద్ద ఉన్న తుపాకీతో గొంతు భాగంలో కాల్చుకొని మృతి చెందాడు.
తుపాకి శబ్ధం రావడంతో అక్కడున్న సిబ్బంది వెంటనే వెళ్లి చూడగా అప్పటికే మృతిచెందాడు. కాగా, బుల్లెట్ తలలో నుంచి దూసుకెళ్లి బిల్డింగ్ సీలింగ్‌కు తగిలి రంధ్రం ఏర్పడింది. బాలకృష్ణ గతంలోనూ ఓసారి ఆత్మహత్యా ప్రయత్నం చేసినట్లు సమాచారం. మృతుడు బాలకృష్ణ బేబులో నుంచి ఓ సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిరుడు చెల్లి పెళ్లి జరగ్గా, ఈ ఏడాది అతడి పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో ఈ ఘటన కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. తాను ముగ్గురు వ్యక్తులకు రూ.2.8 లక్షలు బాకీ ఉన్నట్లు చెబుతూ వారి పేర్లూ సూసైడ్ నోట్‌లో పొందుపర్చాడు
Updated Date - Sep 29 , 2024 | 04:33 AM