Sircilla: కానిస్టేబుళ్లను కూలీలుగా మార్చి, వేధిస్తారా?
ABN, Publish Date - Oct 25 , 2024 | 04:32 AM
గౌరవప్రదమైన పోలీసు ఉద్యోగంలో ఉన్న తమ భర్తలను అధికారులు కూలీలుగా మార్చి, వేధింపులకు గురి చేస్తున్నారంటూ 17వ బెటాలియన్ పోలీసు కానిస్టేబుళ్ల భార్యలు, వారి కుటుంబ సభ్యులు గురువారం సిరిసిల్ల, నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి, గద్వాల జిల్లా ఎర్రవల్లిలోని జాతీయ రహదారులపై బైఠాయించి ఆందోళనకు దిగారు.
బెటాలియన్ పోలీసు కుటుంబాల ఆందోళన
సిరిసిల్ల, డిచ్‌పల్లి, ఎర్రవల్లిలలో బైఠాయింపు
సిరిసిల్ల, డిచ్‌పల్లి, ఎర్రవల్లి, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): గౌరవప్రదమైన పోలీసు ఉద్యోగంలో ఉన్న తమ భర్తలను అధికారులు కూలీలుగా మార్చి, వేధింపులకు గురి చేస్తున్నారంటూ 17వ బెటాలియన్ పోలీసు కానిస్టేబుళ్ల భార్యలు, వారి కుటుంబ సభ్యులు గురువారం సిరిసిల్ల, నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి, గద్వాల జిల్లా ఎర్రవల్లిలోని జాతీయ రహదారులపై బైఠాయించి ఆందోళనకు దిగారు. తెలంగాణలో ఏక్ స్టేట్ - ఏక్ పోలీస్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిరిసిల్లలో అంబేద్కర్ విగ్రహం వద్దకు బెటాలియన్ పోలీసు కానిస్టేబుళ్ల భార్యలు, కుటుంబ సభ్యులు తరలి వచ్చి బైఠాయించారు.
తమ భర్తల సమస్యలు పరిష్కరించి న్యాయం చేయాలంటూ ధర్నా చేపట్టారు. డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి ఆందోళనకారులను అదుపులోకి తీసుకొని సర్ధాపూర్‌లోని బెటాలియన్ వద్దకు తరలించారు. కమాండెంట్ శ్రీనివాసరావు వారి సమస్యలను విని ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కానిస్టేబుళ్ల భార్యలు మాట్లాడుతూ పోలీసు ఉద్యోగానికి తమ భర్తలు చేస్తున్న పనికి సంబంధం లేకుండా పోయిందన్నారు. పోలీసు ఉద్యోగం పేరుతో బెటాలియన్‌లో కూలి పనులు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ భర్తలు డ్యూటీ చేయాలంటే భయంతో వణికిపోతున్నారని అన్నారు.
ఇళ్లలో శుభకార్యాలు జరుపుకోవడానికి కూడా సెలవులను ఇవ్వకుండా అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని వాపోయారు. బెటాలియన్‌లో పనిచేసే వారు చనిపోతే కానిస్టేబుళ్లే అంత్యక్రియలు చేయాలని, వారే డప్పులు కొట్టాల్సిన దుస్ధితి ఏర్పడిందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో అమలు చేస్తున్న పోలీసు విధానా న్ని తెలంగాణలో అమలు చేసి తమ భర్తలకు వెట్టి చాకరీనుంచి విముక్తి కల్పించాలని డిమాండ్ చేశారు. డిచ్‌పల్లిలో ఆందోళన విరమించాలని కోరగా వినకపోవడంతో.. పోలీసులు వారిని బలవంతంగా లాక్కెళ్లి.. అక్కడి నుంచి పంపించివేశారు. అంతకు ముందు డిచ్‌పల్లి వద్ద ఆందోళన చేస్తున్న పోలీసు కుటుంబాలకు కేటీఆర్ సంఘీభావం తెలిపారు.
హక్కులడిగితే వేటేస్తారా? : కేటీఆర్
హైదరాబాద్, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): పాపపు పాలనలో తెలంగాణలోని ప్రతిబిడ్డా ఆగమైపోతోందని.. హక్కుల గురించి అడిగితే ఉద్యోగులపై వేటెయ్యడం ఏమిటని కేటీఆర్ గురువారం ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. డిజిటల్ సర్వేకు ఒప్పుకోలేదని 165 మంది ఏఈవోలను, హక్కులు అడిగారని 20 మంది కానిేస్టబుళ్లను సస్పెండ్ చేయడం దారుణమ ని పేర్కొన్నారు. రాష్ట్రంలో 2లక్షల ఉద్యోగాలు రాహు ల్ ఎరుగు... అడ్డగోలు సాకులతో సస్పెన్షన్ చేస్తూ.. రేవంత్ సర్కార్ ఉన్న ఉద్యోగాలను ఊడపీకుతోందని ఆరోపించారు. సస్పెండ్ చేసిన ఉద్యోగులను తక్షణం విధుల్లోకి తీసుకోవాలని, ఉద్యోగులతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
Updated Date - Oct 25 , 2024 | 04:32 AM