Adilabad: భార్యే కడతేర్చింది!
ABN, Publish Date - Jun 16 , 2024 | 05:35 AM
ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయుడి హత్య కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. ఉట్నూర్ పోలీసు స్టేషన్‌లో కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ నాగేందర్ శనివారం వివరించారు.
టీచర్ హత్య కేసులో వీడిన మిస్టరీ
ఉట్నూర్, జూన్ 15 : ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయుడి హత్య కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. ఉట్నూర్ పోలీసు స్టేషన్‌లో కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ నాగేందర్ శనివారం వివరించారు. నార్నూర్ మండలం నాగోల్‌కొండకు చెందిన గజేందర్ జైనథ్ మండలంలోని మేడిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడు. ఆయనకు తొమ్మిదేళ్ల క్రితం నాగోల్‌కొండకే చెందిన విజయలక్ష్మితో వివాహం జరిగింది. వీరికి ఏడేళ్ల కుమారుడు ఉన్నారు. ఆదిలాబాద్‌లోని రామ్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. గజేందర్ భార్య విజయలక్ష్మికి ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం తాడిహత్నూర్‌కు చెందిన రాథోడ్ మహేశ్‌తో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయమై గజేందర్, అతని భార్యకు పలుమార్లు గొడవలు జరిగినా.. ఆ తర్వాత సద్దుమణిగాయి. తమ ఆనందానికి గజేందర్ అడ్డుగా ఉన్నాడని భావించిన విజయలక్ష్మి... అతడిని ఎలాగైనా చంపాలని ప్రియుడితో కలిసి ప్రణాళిక రచించింది.
బేల పెట్రోల్ బంక్‌లో పని చేస్తున్న బోదే సుశీల్, ఉర్వేత కృష్ణకు రూ.3లక్షల చొప్పున సుపారీ ఇచ్చి.. ఒప్పందం కుదుర్చుకుంది. పాఠశాలలు పున: ప్రారంభమైన రోజు గజేందర్ బైక్‌పై మేడిగూడ పాఠశాలకు వెళ్తుండగా.. గాదిగూడ మండలం అర్జుని సమీపంలో రాథోడ్‌మహేశ్, బోదే సుశీల్, ఉర్వేత కృష్ణ అడ్డుకున్నారు. పంట పొలాల్లోకి లాక్కెళ్లి బండరాయితో కొట్టి దారుణంగా హత్య చేశారు. మృతుడి తండ్రి బిక్కు తన కోడలు విజయలక్ష్మిపై అనుమానం ఉందని చెప్పడంతో.. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడి భార్య విజయలక్ష్మితోపాటు ప్రియుడు రాథోడ్ మహేశ్, బేలకు చెందిన బోదె సుశీల్, కృష్ణను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు డీఎస్పీ వివరించారు.
Updated Date - Jun 16 , 2024 | 05:35 AM