ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Police Investigation: ‘లగచర్ల’పై ఉన్నత స్థాయి విచారణ

ABN, Publish Date - Nov 15 , 2024 | 03:15 AM

లగచర్ల ఫార్మావిలేజ్‌లో అధికారులపై దాడి ఘటనను పోలీసు శాఖ సీరియ్‌సగా తీసుకుంది. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. దీంతో.. శాంతిభద్రతల అదనపు డీజీపీ మహేశ్‌.ఎం.భగవత్‌ రంగంలోకి దిగారు.

  • పరిగికి అదనపు డీజీ మహేశ్‌ భగవత్‌

  • దర్యాప్తు అధికారులకు దిశానిర్దేశం

  • హైకోర్టులో నరేందర్‌రెడ్డి క్వాష్‌ పిటిషన్‌

  • రిమాండ్‌ రిపోర్టులో అంశాలు అబద్ధాలు

  • కేటీఆర్‌ ప్రోద్బలం ఉందని వాంగ్మూలమివ్వలే

  • కొడంగల్‌ కోర్టు బెయిల్‌ పిటిషన్‌లో పట్నం

  • మా వాళ్ల అరెస్టు అన్యాయం.. భూములివ్వం

  • అరెస్టయిన వారి కుటుంబ సభ్యుల ఆరోపణ

హైదరాబాద్‌, పంజాగుట్ట, పరిగి, వికారాబాద్‌, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): లగచర్ల ఫార్మావిలేజ్‌లో అధికారులపై దాడి ఘటనను పోలీసు శాఖ సీరియ్‌సగా తీసుకుంది. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. దీంతో.. శాంతిభద్రతల అదనపు డీజీపీ మహేశ్‌.ఎం.భగవత్‌ రంగంలోకి దిగారు. ఆయన నేతృత్వంలో దర్యాప్తు కొనసాగనుంది. ప్రాథమిక విచారణలో రాజకీయ కుట్రకోణం వెలుగుచూడడంతో.. ఆధారాలు పకడ్బందీగా ఉండేలా, అవసరమైతే న్యాయనిపుణుల సలహాను తీసుకునేలా ఆయన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. గురువారం ఆయన మల్టీజోన్‌-2 ఐజీ వి.సత్యనారాయణతో కలిసి పరిగి పోలీ్‌సస్టేషన్‌లో సుమారు మూడుగంటల పాటు లగచర్ల దాడి దర్యాప్తు పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్‌ భగవత్‌కు ప్రాథమిక నివేదిక వివరాలను ఐజీ సత్యనారాయణ అందజేశారు. కేసు దర్యాప్తులో పురోగతి, పరారీలో ఉన్న నిందితులను అరెస్టు చేయడానికి తీసుకుంటున్న చర్యలను గురించి వికారాబాద్‌ ఎస్పీ నారాయణరెడ్డి వివరించారు. ఈ కేసులో కుట్రదారులు మొదలు.. సూత్రధారులు, పాత్రధారులు ఎవరూ తప్పించుకోకుండా అనుసరించాల్సిన వ్యూహం గురించి దర్యాప్తు అధికారులకు మహేశ్‌ భగవత్‌ దిశానిర్దేశం చేశారు. పకడ్బందీగా చార్జిషీట్‌ను రూపొందించాలని, కోర్టులో కేసు వీగిపోకుండా ఉండేలా.. అవసరమైతే న్యాయనిపుణుల సలహాలను తీసుకుని, అభియోగపత్రాలను సిద్ధం చేయాలని సూచించారు. రిమాండ్‌లో ఉన్న నిందితులు బెయిల్‌ పిటిషన్లు దాఖలు చేస్తే.. శక్తిమంతమైన కౌంటర్లను ఫైల్‌ చేయాలని ఆదేశించారు. కాగా.. లగచర్ల దాడిలో పోలీసులు మొత్తం 47 మంది నిందితులను గుర్తించగా.. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, మరో 21 మందిని రిమాండ్‌ చేశారు. దాడిలో కీలకంగా వ్యవహరించిన సురేశ్‌రాజ్‌, దేవదాస్‌, గోపాల్‌నాయక్‌, విజయ్‌, విఠల్‌ పరారీలో ఉన్నారు. వీరిని అరెస్టు చేసేందుకు నాలుగు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి.


  • రిమాండ్‌ రిపోర్టులో అవాస్తవాలు: పట్నం

తన అరెస్టు సందర్భంగా పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో అవాస్తవాలున్నాయని మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి ఆరోపించారు. చర్లపల్లి జైలులో రిమాండ్‌లో ఉన్న నరేందర్‌రెడ్డి గురువారం ఈ మేరకు కొడంగల్‌ కోర్టులో బీఆర్‌ఎస్‌ లీగల్‌ సెల్‌ న్యాయవాదుల తరఫున ఓ అఫిడవిట్‌ను సమర్పించారు. తాను పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో ఎక్కడా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రోద్బలంతో దాడి జరిగిందని చెప్పలేదన్నారు. రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్న అవాస్తవాలను బట్టి.. పోలీసులు కేటీఆర్‌ను అరెస్టు చేసే ఉద్దేశంలో ఉన్నట్లు కనిపిస్తోందని వివరించారు. అబద్ధాలను ఖండించకపోతే అనర్థం జరుగుతుందనే ఉద్దేశంతో అఫిడవిట్‌ సమర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘‘ఏ పోలీసు అధికారి కూడా నా వాంగ్మూలాన్ని నమోదు చేయలేదు. కోర్టులో హాజరుపరచడానికి 10 నిమిషాల ముందు కొన్ని పేపర్లపై నా సంతకం తీసుకున్నారు. అరెస్టుకు ముందు కూడా నాకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. కేటీఆర్‌ ప్రమేయం ఉందంటూ పోలీసులు కల్పితాన్ని సృష్టించారు. కోర్టుకు వచ్చాక నా అడ్వొకేట్‌ అడిగితే తప్ప రిమాండ్‌ రిపోర్టు ఇవ్వలేదు’’ అని ఆ అఫిడవిట్‌లో వివరించారు. మరోవైపు.. నరేందర్‌రెడ్డి తరఫున బీఆర్‌ఎస్‌ లీగల్‌సెల్‌ న్యాయవాదులు వికారాబాద్‌ ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్స్‌ కోర్టులో గురువారం బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కూడా ఆ రోజు దర్యాప్తు అధికారుల తరఫున వాదనలను వినిపించనున్నారు.


  • హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌

ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేకున్నా.. విధించిన రిమాండ్‌ ఉత్తర్వులను కొట్టివేసి, తనను విడుదల చేయాలని కోరుతూ నరేందర్‌రెడ్డి హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. బీఆర్‌ఎస్‌ లీగల్‌సెల్‌ దాఖలు చేసిన ఈ పిటిషన్‌కు ఇంకా రిజిస్ట్రీ నంబర్‌ ఇవ్వలేదు. సోమవారం ఈ పిటిషన్‌ విచారణకు వచ్చే అవకాశాలున్నాయి. ‘‘లగచర్ల గ్రా మంలో ఈ నెల 11న జరిగిన దాడితో నాకు ఎలాంటి సంబంధం లేదు. అక్కడ టీజీఐఐసీ భూసేకరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణ జరిగినట్లు తెలుసు. భూములు కోల్పోయే రైతులు, ప్రజలు అధికారులపై దాడి చేశారు. పోలీసులు ఈ దాడితో సంబంధం ఉన్న వారిని అరెస్టు చేశారు. అలా అరెస్టయిన వారు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా నన్ను ఏ-1గా చేర్చారు. 13వ తేదీన నన్ను అరెస్టు చేసి, కొడంగల్‌ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు కేసును పరిశీలించకుండానే.. యాంత్రికంగా జ్యుడీషియల్‌ కస్టడీకి అప్పగించడం సరికాదు. నా అరెస్టు సమయంలోనూ పోలీసులు నిబంధనలను పాటించలేదు. అరెస్టుకు కారణాలను నాకు లేదా నా భార్యకు లిఖితపూర్వకంగా చెప్పలేదు’’ అని నరేందర్‌రెడ్డి ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ‘డీకే బసు వర్సెస్‌ పశ్చిమ బెంగాల్‌’ కేసును ఈ సందర్భంగా ఉటంకించారు.


  • సంగారెడ్డి జైలుకు నిందితులు

పట్నం నరేందర్‌రెడ్డిని చర్లపల్లి జైలులో రిమాండ్‌ చేయగా.. మరో 16 మంది నిందితులను పోలీసులు పరిగి సబ్‌-జైలుకు తరలించిన విషయం తెలిసిందే..! పరిగి సబ్‌-జైలు సామర్థ్యం 50 మంది ఖైదీలు కాగా.. ప్రస్తుతం 80 మంది ఉండడంతో.. లగచర్ల నిందితులను గురువారం సాయంత్రం సంగారెడ్డి జిల్లా జైలుకు తరలించారు.


  • ఫార్మాకు భూములు ఇచ్చేది లేదు: బాధితులు

ఫార్మావిలేజ్‌కు వ్యవసాయ భూములను ఇచ్చేది లేదని పలువురు గిరిజన మహిళలు తెగేసి చెప్పారు. తమ కుటుంబ సభ్యులను అన్యాయంగా, అక్రమంగా అరెస్టు చేశారని వాపోయారు. హకీంపేట, పోలపల్లి, లగచర్ల గ్రామాలకు చెందిన గిరిజన, స్థానిక మహిళలు జ్యోతిబాయి, గోపీబాయి, జయాబాయి తదితరులు గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘‘ఆరుగాలం కష్టపడి పనిచేసి, పంటలు పండించుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నాం. ఉన్న భూములను కోల్పోతే ఎలా బతకాలి? ఫార్మా కంపెనీలు వస్తే.. పచ్చని పొలాలు నాశనమవుతాయి. భూగర్భ జలాలు కలుషితమవుతాయి. పర్యావరణం దెబ్బతింటుంది. పెద్ద మొత్తంలో నష్టపరిహారం ఇస్తామన్నా.. మమ్మల్ని చంపుతామని బెదిరించినా.. మేం భూములను ఇచ్చేది లేదు’’ అని స్పష్టం చేశారు. తమవాళ్లు కలెక్టర్‌, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలిచ్చారే తప్ప.. దాడులు చేయలేదని వివరించారు. పోలీసులు అర్ధరాత్రి వేళ ఇళ్లపై దాడులు చేసి, తమ వారిని అరెస్టు చేశారని, వారిపై కేసులను ఎత్తివేసి, విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఫార్మావిలేజ్‌ను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.


  • కేటీఆర్‌ నివాసం వద్ద ఉత్కంఠ

నరేందర్‌రెడ్డి రిమాండ్‌ రిపోర్టులో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పేరు రావడంతో.. బుధవారం రాత్రి నుంచి ఆయన ఇంటి వద్ద పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున మోహరించారు. బంజారాహిల్స్‌ నందినగర్‌లోని కేటీఆర్‌ నివాసానికి పెద్దఎత్తున నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. గురువారం కూడా అక్కడ పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు చేరుకోవడంతో.. తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Updated Date - Nov 15 , 2024 | 03:15 AM